PM Modi Urges: ప్రజల్ని వేధించేలా ఉండొద్దు
ABN , Publish Date - Dec 10 , 2025 | 03:13 AM
దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులపాలు చేసిన ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోదీ స్పందించారు. విమానాల నిర్వహణ లోపాలతో ప్రయాణికులకు ఎలాంటి సమస్యలు తలెత్తవద్దని స్పష్టం చేశారు. చట్టాలు, నిబంధనలు ఏవైనా సరే వ్యవస్థలను సరిచేసేలా ఉండాలే తప్ప..
నిబంధనలు వ్యవస్థల్ని సరిచేసేలా ఉండాలి
ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ఎన్డీయే ఎంపీల భేటీలో మోదీ వ్యాఖ్య
ఇండిగో విమాన సర్వీసుల్లో 10% కోత.. అవి ఇతర సంస్థలకు
సంక్షోభం నేపథ్యంలో పౌర విమానయాన శాఖ చర్యలు
విమానయాన రంగంలో ఆధిపత్యాన్ని రూపుమాపుతాం
ఎంత పెద్ద సంస్థ అయినా సరే వదిలిపెట్టం: రామ్మోహన్‌నాయుడు
న్యూఢిల్లీ, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులపాలు చేసిన ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోదీ స్పందించారు. విమానాల నిర్వహణ లోపాలతో ప్రయాణికులకు ఎలాంటి సమస్యలు తలెత్తవద్దని స్పష్టం చేశారు. చట్టాలు, నిబంధనలు ఏవైనా సరే వ్యవస్థలను సరిచేసేలా ఉండాలే తప్ప.. ప్రజలను వేధించవద్దని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో ఎన్డీయే ఎంపీలతో జరిగిన సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘విమాన విధుల సమయ నియంత్రణ (ఎఫ్‌డీటీఎల్)’ రెండో దశలోని కఠిన నిబంధనల కారణంగా.. పైలట్లు, సిబ్బందిని సర్దుబాటు చేయలేక ఇండిగో విమాన సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో.. నిబంధనలు, చట్టాలు ప్రజలను ఇబ్బంది పెట్టొందంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్డీయే ఎంపీల భేటీ అనంతరం ప్రధాని వ్యాఖ్యల వివరాలను కేంద్ర మం త్రి కిరణ్ రిజిజు మీడియాకు వెల్లడించారు. ‘‘విమా న నిర్వహణ సమస్యల కారణంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దని ప్రధాని సూచించారు. ప్రజలెవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఎదురవకూడదన్నారు. నిబంధనలు, చట్టాలు ముఖ్యమే అయినా, అవి వ్యవస్థలను సరిచేసేలా ఉండాలేగానీ.. ప్రజలను వేధించేలా ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రజల జీవితాలను మరింత మెరుగుపరిచేలా సంస్కరణలు అమలు చేయడంపై ఎంపీలు దృష్టిపెట్టాలని సూచించారు’’ అని రిజిజు చెప్పారు.
ఇండిగో సర్వీసులలో 10 శాతం కోత
వందలాది విమానాల రద్దుతో సంక్షోభానికి తెరతీసిన ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు దిగింది. శీతాకాలానికి సంబంధించి ఆ సంస్థకు కేటాయించిన సర్వీసులలో 10ు కోత పెట్టింది. ఈ సర్వీసులను ఇతర విమానయాన సంస్థలకు కేటాయించనున్నట్టు తెలిపింది. ఇండిగో సర్వీసులలో 5ు కోతపెడుతున్నట్టు మంగళవారం మధ్యాహ్నం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ప్రకటించగా.. దా నిని రెండింతలు చేస్తూ, 10ు కోతపెట్టాలని ఆదేశించినట్టు పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు సాయంత్రం ‘ఎక్స్’లో వెల్లడించారు. ఇం డిగో సర్వీసులను స్థిరీకరించడంకోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకు ఇండిగోకు రోజుకు 2,200కుపైగా సర్వీసుల నిర్వహణకు అనుమతి ఉంది. తాజా కోతతో అవి రోజు కు 1,950కంటే తగ్గిపోనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
సంక్షోభంపై ఉన్నత స్థాయి సమీక్ష
పెద్ద సంఖ్యలో విమానాల రద్దు నేపథ్యంలో వివరణ ఇవ్వాలని ఇండిగోకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ అంశంపై డీజీసీఏ, పౌర విమానయాన శాఖ అధికారులు సమీక్ష నిర్వహించారు. షోకాజ్ నోటీసులపై ఇండిగో ఇచ్చిన వివరణను పరిశీలించి, సర్వీసులలో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ‘‘శీతాకాలం విమానాల షెడ్యూల్‌కు సంబంధించి నవంబరులో 64,346 సర్వీసులకు అనుమతిస్తే.. 59,438 సర్వీసులు మాత్రమే నిర్వహించింది. 403 విమానాలకు అనుమతిస్తే.. అక్టోబరులో 339, నవంబరులో 344 విమానాలను మాత్రమే నడిపించగలిగింది. కేటాయించిన షెడ్యూల్‌ను పూర్తిస్థాయిలో నిర్వహించే సామర్థ్యం ఉందని ఇండిగో నిరూపించలేకపోయింది. ఈ నేపథ్యంలో సర్వీసులలో 5ు కోత విధిస్తున్నాం. ముఖ్యంగా ఎక్కువ డిమాండ్ ఉన్న మార్గాల్లో ఈ కోత వర్తిస్తుంది’’ అని డీజీసీఏ మంగళవారం ప్రకటించింది. ఇక ప్రధాన విమానాశ్రయా ల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకు పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించారు. వారు విమానాశ్రయాల్లో ప్రయాణికులకు అవసరమైన సాయం అందిస్తున్నారు.
400కుపైగా విమానాలు రద్దు
ఇండిగో విమాన సర్వీసుల రద్దు మంగళవారం కూడా కొనసాగింది. దేశవ్యాప్తంగా 400కుపైగా సర్వీసులు రద్దయ్యాయి. అందులో ఒక్క శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే 78 సర్వీసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రయాణికులకు సంబంధించిన లగేజీ డెలివరీ కూడా ఇంకా చాలా వరకు పెండింగ్‌లోనే ఉంది. దీనితో ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు చాలా వరకు సర్వీసులను పునరుద్ధరించామని, ప్రయాణికుల రీఫండ్ల చెల్లింపు కూడా వేగంగా జరుగుతోందని ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. విమానాల రద్దుతో ప్రయాణికులకు కలిగిన ఇబ్బందిపై క్షమాపణలు చెప్పారు. అనంతరం ఇండిగో ఒక ప్రకటన జారీ చేసింది. మంగళవారం 1,800 సర్వీసులు నిర్వహించామని, బుధవారం 1,900 సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపింది.
ఆధిపత్యాన్ని రూపుమాపుతాం..: రామ్మోహన్‌నాయుడు
భారత పౌర విమానయాన రంగంలో నెలకొన్న రెండు సంస్థల ఆధిపత్యాన్ని(డ్యుయోపాలీని) రూపుమాపుతామని.. కొత్త విమానయాన సంస్థలను ప్రోత్సహిస్తామని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు. మంగళవారం ఆయన లోక్‌సభలో ఈ అంశంపై మాట్లాడారు. పౌర విమానయాన రంగంలో పోటీని పెంచడానికి కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు. భారత్ ఇప్పటికే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా ఉందని, ఈ వృద్ధి దెబ్బతినకుండా కాపాడుతామని చెప్పారు. ఇండిగో విమానాల రద్దు సంక్షోభం కుదురుకుంటోందని.. విమాన సర్వీసు లు యథాతథ స్థితికి చేరుకుంటున్నాయన్నారు. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో రద్దీ తగ్గిందని, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు. డీజీసీఏ దర్యాప్తు నివేదికల ఆధారంగా ఈ సంక్షోభానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రణాళికా లోపాలు, నిబంధనలు పాటించడంలో వైఫల్యం ద్వారా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే సంస్థ ఎంత పెద్దదైనా సరే వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.