Wooden Comb vs Plastic Comb: తల దువ్వుకోవడానికి ఈ దువ్వెన వాడుతున్నారా? అయితే, ఈ రోజే పారవేయండి..
ABN , Publish Date - Sep 09 , 2025 | 08:13 PM
జుట్టు విపరీతంగా రాలుతోందని చింతిస్తున్నారా? అయితే, ముందు మీరు ఏ దువ్వెన వాడుతున్నారో చెక్ చేసుకోండి. ఎందుకంటే, దువ్వెనకు, జుట్టు రాలడానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. సరైన దువ్వెనను ఎంచుకోకపోతే విపరీతంగా జుట్టు రాలిపోవచ్చు.
ఈ రోజుల్లో జుట్టు రాలడం ఒక సాధారణ సమస్య. పిల్లల నుండి పెద్దల వరకు చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పోషకారం తీసుకోకపోవడం, దుమ్ము, కాలుష్యం, సరైన జాగ్రత్త తీసుకోకపోవడం ఇలా జుట్టు రాలే సమస్యకు ఎన్నో కారణాలు ఉండవచ్చు. మనం రోజూ ఉపయోగించే హెయిర్ ప్రొడక్ట్స్ కూడా జుట్టు రాలడానికి ప్రధాన కారణమని అందరికీ తెలుసు. కానీ, జుట్టు రాలడానికి, వాడే దువ్వెనకూ మధ్య సంబంధముంది అంటే నమ్ముతారా? వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇదే నిజం అంటున్నారు హెయిర్ కేర్ నిపుణులు. సరైన దువ్వెన ఎంచుకోకపోతే విపరీతంగా జుట్టు రాలే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ దువ్వెనను ఉపయోగిస్తున్నట్లయితే.. వెంటనే పారవేయాలని సూచిస్తున్నారు.
ప్లాస్టిక్ దువ్వెన వల్ల జుట్టు రాలుతుందా?
అవును! ప్లాస్టిక్ దువ్వెన ద్వారా ఉత్పత్తి అయ్యే స్టాటిక్ ఛార్జ్ జుట్టును బలహీనపరుస్తుంది. ఫలితంగా జుట్టు రాలడం పెరుగుతుంది. ప్లాస్టిక్ దువ్వెనకు బదులుగా చెక్క దువ్వెనను ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుందని హెయిర్ కేర్ నిపుణులు అంటున్నారు. ఇంకా కురుల సంరక్షణకు చెక్క దువ్వెన అద్భుతంగా పనిచేస్తుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
స్టాటిక్ విద్యుత్ తగ్గుదల
ప్లాస్టిక్ దువ్వెనతో దువ్వుకుంటే స్టాటిక్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇది జుట్టు పొడిబారేలా లేదా చిక్కుబడేలా చేసి కురులను దెబ్బతీస్తుంది. అదే కలప అయితే సహజ ఇన్సులేటర్. అందువల్ల, స్టాటిక్ ఛార్జ్ ఉత్పత్తి కాదు. ఇది మీ జుట్టును నున్నగా మెరిసేలా చేస్తుంది. ఇదే గాక చెక్క దువ్వెన జుట్టు చిట్లిపోకుండా కూడా రక్షిస్తుంది.
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
చెక్క దువ్వెన మృదువైన దంతాలు తలపై సున్నితమైన ఒత్తిడిని కలిగిస్తాయి. ఇది మసాజ్ సాధనంలా పనిచేస్తుంది. ఫలితంగా తల్లో రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. మెరుగైన రక్త ప్రవాహం జుట్టు మూలాలకు పోషకాలు, ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే దృఢంగా చేస్తుంది.
సహజ నూనె పంపిణీ
మన తలపై చర్మం సహజంగా సెబమ్ అనే నూనెను స్రవిస్తుంది. ఇది జుట్టుకు తేమను అందించడంలో సహాయపడుతుంది. చెక్క దువ్వెన ఈ నూనెను జుట్టు మూలాల నుండి జుట్టు చివరల వరకు సమానంగా పంపిణీ చేయడంలో సహాయపడుతుంది. అందువలన,మొత్తం జుట్టు తేమగా, మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా ప్లాస్టిక్ దువ్వెనలు ఈ పనిని సమర్థవంతంగా చేయలేవు.
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది
చెక్క దువ్వెనలు ప్లాస్టిక్ దువ్వెనల వలె పదునైనవి కావు. కానీ మృదువైన చివరలను కలిగి ఉంటాయి. కాబట్టి అవి జుట్టును లాగవు లేదా తెగిపోయేలా చేయవు. జుట్టును చిక్కు తీసేటప్పుడు వెదురు దువ్వెనలు జుట్టుపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి. అందువల్ల వెంట్రుకలు రాలడం తగ్గిపోతుంది.
హైపోఅలెర్జెనిక్
చెక్క దువ్వెనలు సహజ పదార్థాలతో తయారు చేయబడినందున అవి పర్యావరణ అనుకూలమైనవి. ప్లాస్టిక్ దువ్వెనలలోని కొన్ని రసాయనాలు కొంతమందిలో తలపై చికాకు లేదా అలెర్జీలకు కారణమవుతాయి. ఇవి హైపోఅలెర్జెనిక్ కాబట్టి తలపై సున్నితమైన చర్మం ఉన్నవారికి సురక్షితమైనవిగా భావిస్తారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి?
వారానికి ఒకసారి దువ్వెన శుభ్రం చేయడానికి పాత టూత్ బ్రష్ ఉపయోగించండి.
తేలికపాటి సబ్బు లేదా షాంపూ ఉపయోగించి కొద్దిగా గోరువెచ్చని నీటితో కడగాలి. అయితే, దువ్వెనను ఎక్కువసేపు నీటిలో నానబెట్టవద్దు.
దువ్వెనను కడిగిన తర్వాత దానిని ఒక గుడ్డతో పూర్తిగా తుడిచి పొడి ప్రదేశంలో ఉంచండి. తేమగా ఉన్న ప్రదేశంలో ఉంచితే బూజు పట్టి దువ్వెన దెబ్బతింటుంది.
దువ్వెన ఎండిపోకుండా ఉండటానికి ప్రతి కొన్ని నెలలకు ఒకసారి కొంత కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెను ఒక గుడ్డకు రాసి దువ్వెనపై సున్నితంగా రుద్దండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
చెప్పులు లేకుండా నడవడం లేదా బూట్లు వేసుకుని నడవడం.. ఏది మంచిది?
విదేశీ పూలపైనా నిషేధం.. ఆస్ట్రేలియాలో ఇంత కఠిన నిబంధనలు ఎందుకంటే..
For More Latest News