Australia Biosecurity Rules: విదేశీ పూలపైనా నిషేధం.. ఆస్ట్రేలియాలో ఇంత కఠిన నిబంధనలు ఎందుకంటే..
ABN , Publish Date - Sep 08 , 2025 | 06:31 PM
ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టుల్లో బయోసేఫ్టీ రూల్స్ ఎందుకు కఠినంగా ఉంటాయో? విదేశీ పూలను కూడా ఎందుకు అనుమతించరో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో పూలు ఒక భాగం.. సర్వసాధారణం. కానీ, తన వెంట పూలు తెచ్చుకున్నందుకు ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టు అధికారులు మలయాళ నటి నవ్య నాయర్‌పై ఏకంగా రూ.1.14 లక్షల జరిమానా విధించారు. దీంతో, ఈ ఉదంతం భారత్‌లో సంచలనంగా మారింది. సువాసనలు వెదజల్లే పూలు తీసుకెళితే ఎందుకంత భారీ జరిమానా అనే సందేహాన్ని అనేక మంది వ్యక్తం చేస్తున్నారు (Australia Biosafety Rules).
నిషేధం.. కారణాలు..
విదేశీ పూలతో పాటు ఇంకా అనేక ఇతర వస్తువులను ఆస్ట్రేలియాకు తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు పక్కా. ఒక్కోసారి జైలు శిక్ష కూడా విధిస్తారు. తాజా లేదా ఎండిన పూలు, పండ్లు, కూరగాయలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, ముడి గింజలు, విత్తనాలు, పాల ఉత్పత్తులు, బర్ఫీ, రసమలై, రసగుల్లా, బియ్యం, టీ, తేనె, ఇంట్లో తయారు చేసి తీసుకెళ్లే ఆహారం, పక్షులు, జంతువుల ఈకలు ఎముకలు, చర్మంతో చేసిన జాకెట్లు, బ్యాగులు, దుప్పట్లు వంటి వాటిని అస్సలు అనుమతించరు. ఈ విషయాల్లో తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడే వారి వీసాలను రద్దు చేసే ప్రమాదం కూడా ఉంటుంది.
నిపుణులు చెప్పే దాని ప్రకారం, ఆస్ట్రేలియాకు వెళ్లే వారు తమ వెంట తీసుకెళ్లే ఆహార పదార్థాలు, ఇతర వస్తువుల గురించి ముందుగానే అధికారులకు చెబితే ప్రమాదం కొంత తగ్గుతుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికుల వద్ద ఉన్న నిషేధిత వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకుని వాటిని వెంటనే ధ్వంసం చేస్తారు. ఎలాంటి జరిమానాలు విధించరు.
నిబంధనలు ఎందుకంత కఠినం అంటే..
ఆస్ట్రేలియా ఖండానికి అన్ని వైపులా సముద్రం ఉంది. దీంతో, అక్కడి జీవజాతులు ఇతర ప్రాంతాలతో సంబంధం లేకుండా పరిణామం చెందాయి. ఫలితంగా ఆ భూభాగంలోకి కొత్త జీవజాతులు ప్రవేశిస్తే స్థానిక జంతు, వృక్ష జాతులు ప్రమాదంలో పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఆహారం, ఇతర సహజ వనరుల కోసం పోటీ పెరిగి ఒక్కోసారి స్థానిక జాతులు అంతరించి పోయే ముప్పు కూడా ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఆస్ట్రేలియాలో జీవవైవిధ్యత ఇంత సున్నితమైనది కావడంతో అక్కడి ప్రభుత్వం బయోసేఫ్టీకి సంబంధించి కఠిన నిబంధనలు రూపొందించింది.
ఇవి కూడా చదవండి:
స్మార్ట్ ఫోన్ వ్యసనం వదుల్చుకునేందుకు పాటించాల్సిన టిప్స్
వామ్మో.. ఈ దేశాల్లో విడాకులు అత్యధికం.. ఇలా పెళ్లి.. అలా డైవర్స్