Smartphone Addiction: స్మార్ట్ ఫోన్ వ్యసనం వదుల్చుకునేందుకు పాటించాల్సిన టిప్స్
ABN , Publish Date - Sep 01 , 2025 | 10:31 PM
స్మార్ట్ ఫోన్ వ్యసనం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారా? ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం కూడా గడవని కాలం ఇది. ఇది చాలదన్నట్టు.. షార్ట్స్, రీల్స్ వంటివి జనాలను స్మార్ట్ ఫోన్‌ను పక్కనపెట్టలేని విధంగా చేస్తున్నాయి. చివరకు అనేక మంది ఈ వ్యసనం బారిన పడి విలువైన కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు. తప్పు అని తెలిసినా ఎలా బయటపడాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు కొన్ని చిట్కాలు పాటిస్తే విముక్తి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
స్మార్ట్ ఫోన్ చూసే సమయంపై పరిమితి విధించుకునేందుకు స్క్రీన్ టైమ్ ఫీచర్‌ను వాడుకోవాలి. దీని సాయంతో మెల్లగా ఈ వ్యసనం నుంచి బయటపడొచ్చు.
నిత్యం వచ్చే నోటిఫికేషన్‌ల కారణంగా పదే పదే ఫోన్ చూడాల్సి వస్తుంది. చివరకు ఇదే వ్యసనంగా మారుతుంది. కాబట్టి, ముందుగా అవసరం లేని యాప్స్ నుంచి నోటిఫికేషన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక సోషల్ మీడియా యాప్స్‌ను ఫోన్ నుంచి తొలగిస్తే చాలా ప్రయోజనం చేకూరుతుంది. మనసుపై నిగ్రహం వస్తుంది. ఒక్కసారిగా యాప్స్‌ను తొలగించలేమనుకుంటే వీటి వినియోగంపై టైమ్ లిమిట్ పెట్టుకోవాలి. అలా క్రమంగా ఈ వ్యసనాన్ని వదిలించుకోవాలి.
నిద్రపోయే సమయానికి కనీసం గంట ముందు నుంచీ ఫోన్ వాడటాన్ని ఆపేయాలి. లేదా డూ నాట్ డిస్టర్బ్ మోడ్‌లో పెట్టుకోవాలి. పడక మీదకు చేరాక స్మార్ట్ ఫోన్ చూసే బదులు పుస్తకాలు చదవడం, కుటుంబసభ్యులతో మాట్లాడటం వంటివి చేయాలి.
రోజులో ఏయే సమయాల్లో ఎంత సేపు ఫోన్ చూడాలనే విషయంలో కచ్చితమైన షెడ్యూల్ రూపొందించుకుని దాన్ని ఫాలో అయితే ఈ వ్యసనం వదిలిపోతుంది.
మన లక్ష్యాలు ఏమిటో కుటుంబసభ్యులు, స్నేహితులతో పంచుకుంటే షెడ్యూల్‌కు కట్టుబడి ఉండటం సులభమవుతుంది. హద్దు దాటుతున్నామంటే చుట్టు పక్కల వారు మనల్ని అప్రమత్తం చేసి సరిదిద్దుతారు. డిజిటల్ డీటాక్స్ ఛాలెంజ్‌లు, లేదా ఈ వ్యసనం వదుల్చుకునేందుకు ప్రయత్నిస్తున్న వారితో కలిసి ముందడుగు వేస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.