Vitamins Deficiency Effects: ఈ విటమిన్లు లేకుంటే మనసు అల్లకల్లోలమే! నెగెటివ్ థాట్స్‌కు ఇదే కారణం?
ABN , Publish Date - Sep 01 , 2025 | 07:19 PM
నచ్చిన ఆహారం తిన్న తర్వాత మనసు, శరీరం ప్రశాంతంగా, హాయిగా అనిపించడం ప్రతి ఒక్కరికీ అనుభవమే. దీని ప్రకారం చూస్తే ఆహారానికి శరీరంతో పాటు మనసును ప్రభావితం చేసే శక్తి ఉందని తెలుస్తుంది. ఇదే నిజమని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ విటమిన్లు తక్కువైతే మనసు ప్రతికూల ఆలోచనలతో చిత్తయిపోతుందని..
Vitamins Deficiency and Mental Health: కొన్నిసార్లు ఎటువంటి నిర్దిష్ట కారణం లేకుండా కోపం, భయం, ఆందోళనలాంటివి మనసులో హఠాత్తుగా చెలరేగుతాయి. వేరే విషయంపైకి ఆలోచనలను మళ్లించాలని ప్రయత్నించినా సాధ్యం కాదు. క్రమంగా రోజురోజుకూ సమస్య తీవ్రమవుతుంది. నిత్యం డిప్రెషన్ ఫీలవుతుంటారు. నెగటివ్ థాట్స్ కుదురుగా ఉండనివ్వవు. ఒత్తిడి నుంచి బయటపడే మార్గం కనిపించక సతమతమవుతుంటారు. ఇలాంటి పరిస్థితే మీకూ ఎదురైతే అందుకు ఇదే కారణం కావచ్చు. ఎందుకంటే, శరీరంలో ఈ కింది 5 విటమిన్లు లోపిస్తే మనస్సు ప్రతికూల ఆలోచనలు చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఏ విటమిన్ లోపం వల్ల చెడు ఆలోచనలు వస్తాయి?
ప్రతికూల ఆలోచనలు, ఆందోళన, నిరాశ, మానసిక ఒత్తిడికి.. శరీరంలోని అనేక పోషకాల లోపానికి సంబంధం ఉంది. ముఖ్యంగా ఒక వ్యక్తిలో విటమిన్ డి, విటమిన్ బి12, విటమిన్ బి9 (ఫోలేట్), విటమిన్ బి6, విటమిన్ బి1 (థియామిన్) లోపం ఉన్నప్పుడు చెడు ఆలోచనలు రావడం మొదలవతుంది. ఈ ఐదు విటమిన్లు మెదడు పనితీరు, న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తి (సెరోటోనిన్, డోపమైన్ వంటివి)కి, మొత్తం మానసిక ఆరోగ్యానికి ముఖ్యమైనవి.
విటమిన్ బి12
విటమిన్ బి12 శరీరంలోని అనేక ముఖ్యమైన విధులను నిర్వర్తించడంలో సహాయపడుతుంది. శరీరంలో ఎర్ర రక్త కణాలు, DNA ఉత్పత్తి చేయడమే కాకుండా చర్మం, ఎముకలు, గోళ్లను బలంగా ఉంచుతుంది. మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్ బి12 చాలా అవసరం. ఇది లోపిస్తే నిరాశ, ఆందోళన, జ్ఞాపకశక్తి బలహీనపడటం వంటి సమస్యలు మనల్ని చుట్టుముట్టవచ్చు. దీని కారణంగా మనసులోకి చెడు ఆలోచనలు రేకెత్తవచ్చు. విటమిన్ బి12 తక్కువైన వారిలో అలసట, బలహీనత, బద్ధకం, మానసిక స్థితిలో మార్పులు, చిరాకు, ఏకాగ్రత లేకపోవడం, చేతులు, కాళ్ళలో జలదరింపు, రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడానికి ఆహారంలో మాంసం, చేపలు (ముఖ్యంగా సాల్మన్, ట్యూనా), గుడ్లు, పాల ఉత్పత్తులు (పాలు, పెరుగు, జున్ను) చేర్చుకోవాలి.
విటమిన్ డి లోపం
'సన్‌షైన్ విటమిన్' అని కూడా పిలుచుకునే విటమిన్ డి మెదడులోని సెరోటోనిన్, డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్ల స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ న్యూరోట్రాన్స్మిటర్లు ఆనందం, మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. శరీరంలో ఈ విటమిన్ లేకపోతే నిరాశ, భావోద్వేగ రుగ్మతలు, ఆందోళన, ప్రతికూల ఆలోచనలు తలెత్తుతాయి. పరిశోధనల ప్రకారం, విటమిన్ డి లోపం మెదడులోని హిప్పోకాంపస్, ప్రిఫ్రంటల్ కార్టెక్స్ వంటి ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది. ఇవి భావోద్వేగాలు, నిర్ణయం తీసుకోవడంతో సంబంధం కలిగి ఉంటాయి. నిరంతర విచారం, నిరాశ, ప్రతికూల ఆలోచన, అలసట, బద్ధకం, శక్తి లేకపోవడం, నిద్రలేమి, ఏకాగ్రత లేకపోవడం, మానసిక స్థితిలో మార్పులు ఉండటం ఈ విటమిన్ తగ్గితే కనిపించే లక్షణాలు. ఈ విటమిన్ లోపాన్ని అధిగమించడానికి ఉదయం 6 నుండి 8 గంటల మధ్య 15 నిమిషాల సూర్యకాంతిలో నిలబడండి. చేపలు, గుడ్డు పచ్చసొన, పుట్టగొడుగులు, సప్లిమెంట్ల ద్వారా విటమిన్ డి పొందేందుకు ప్రయత్నించండి.
ఫోలేట్ (విటమిన్ B9)
తీవ్రమైన సందర్భాల్లో ఫోలేట్ లోపం మెగాలోబ్లాస్టిక్ రక్తహీనతకు కారణమవుతుంది. దీని వలన శరీరం అసాధారణంగా పెద్ద ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి సరిగ్గా పనిచేయవు. గర్భధారణ సమయంలో ఫోలేట్ లోపం శిశువులో స్పినా బిఫిడా వంటి న్యూరల్ ట్యూబ్ లోపాలకు కారణమవుతుంది. అకాల జనన ప్రమాదాన్ని పెంచుతుంది. అలసట, బలహీనత, శ్వాస ఆడకపోవడం, లేత చర్మం, నోటి పూతలు, దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది విటమిన్ B9 (ఫోలేట్) లోపం లక్షణాలు. ఆకుకూరలు (పాలకూర, మెంతులు, బ్రోకలీ), కాయధాన్యాలు, చిక్‌పీస్, వేరుశెనగలు, తృణధాన్యాలు, సిట్రస్ పండ్లు (నారింజ, నిమ్మకాయలు) తినడం వల్ల శరీరంలో ఫోలేట్ లోపాన్ని అధిగమించవచ్చు. వంట చేసేటప్పుడు, వేడి చేసినప్పుడు ఫోలేట్ నాశనం అవుతుందని గుర్తుంచుకోండి. కాబట్టి కూరగాయలను తేలికగా ఉడికించాలి.
విటమిన్ బి6
శరీరంలో విటమిన్ బి6 లేకపోవడం వల్ల చిరాకు, ప్రతికూల ఆలోచనలు వస్తాయి. ఈ లోపాన్ని అధిగమించడానికి అరటిపండు, పప్పుదినుసులు, బంగాళాదుంపలు, పొద్దుతిరుగుడు విత్తనాలను ఆహారంలో చేర్చుకోండి.
విటమిన్ బి1 (థయామిన్)
మెదడు పనితీరుకు విటమిన్ బి1 చాలా అవసరం. దీని లోపం అలసట, మానసిక గందరగోళానికి కారణమవుతుంది. ఈ విటమిన్ లోపాన్ని అధిగమించడానికి, తృణధాన్యాలు, గింజలు, విత్తనాలను తినండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read
చర్మంపై తెల్లని మచ్చలు ఎందుకు వస్తాయి.. ఇది ఒక వ్యాధినా?
గుండెపోటు నివారణలో ఆస్పిరిన్‌కు బదులుగా కొత్త మందు..
For More Latest News