Bihar Assembly Elections: ఒక ముస్లిం ముఖ్యమంత్రి కాకూడదా.. బిహార్‌లో ఒవైసీ ప్రచారం షురూ
ABN , Publish Date - Oct 28 , 2025 | 08:44 PM
బీజేపీపై మైనారిటీల్లో ఉన్న భయాన్ని ఆసరాగా తీసుకుని కాంగ్రెస్, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలు ముస్లిం ఓట్లకు గాలం వేస్తున్నాయని, అయితే ఈ పార్టీలు బీజేపీని అడ్డుకోలేవని ఒవైసీ అన్నారు.
గోపాల్‌గంజ్: బిహార్ జనాభాలో 17 శాతం మైనారిటీలు ఉన్నప్పటికీ ముస్లిం ముఖ్యమంత్రి ఎందుకు లేరని ఏఐఎంఐఎం (AIMIM) అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owasi) ప్రశ్నించారు. ఇటు ఎన్డీయే, అటు 'ఇండియా' కూటమి ముస్లింలను మోసగిస్తున్నాయని విమర్శించారు. గోపాల్ గంజ్ నుంచి బిహార్ ఎన్నికల ప్రచారానికి ఒవైసీ మంగళవారంనాడు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని 32 నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది.
'రాష్ట్ర జనాభాలో 17 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్లింలు ఎందుకు సీఎం కాకూడదు? జనాభాలో 3 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇస్తే దానితోనే సరిపుచ్చుకోవాలని అనుకుంటున్నారు' అని ఒవైసీ అన్నారు. ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిషాద్ నేత ముఖేష్ సహానిని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఇటీవల ప్రకటించారు. సమాజంలోని ఇతర వర్గాలతో పాటు ముస్లింలకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి కల్పిస్తామని హామీ ఇచ్చారు.
అవకాశవాదాన్ని ఎండగడదాం
బీజేపీపై మైనారిటీల్లో ఉన్న భయాన్ని ఆసరాగా తీసుకుని కాంగ్రెస్, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలు ముస్లిం ఓట్లకు గాలం వేస్తున్నాయని, అయితే ఈ పార్టీలు బీజేపీని అడ్డుకోలేవని ఒవైసీ అన్నారు. టిక్కెట్ల పంపిణీలో జనాభా ప్రాతిపదికన టిక్కెట్లు ఇవ్వలేని అవకాశవాద పార్టీల మాయలో పడవద్దని అన్నారు. ముస్లిం కమ్యూనిటీ సొంతంగా నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవాలని సూచించారు.
కేంద్రంలోని బేజీపీపైనా ఒవైసీ విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నివర్గాల ప్రగతి కోసం పాటుపడుతున్నామని చెబుతుంటారని, కానీ ఆయన పార్టీ ఒక్క ముస్లింకు కూడా ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేదని ఆక్షేపణ తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సైతం పదపదే చొరబాటుదారుల ప్రస్తావన చేస్తూ మైనారిటీలను విమర్శిస్తుంటారని, ఇంతపెద్ద ఎస్ఐఆర్ చేపట్టి ఎంతమంది చొరబాటుదారులను నిలువరించారో చెప్పాలని అన్నారు. అమిత్‌షా మంత్రిత్వ శాఖ పరిధిలోని బీఎస్ఎఫ్ దేశ సరిహద్దులో మోహరించి ఉండగా చొరబాట్లు ఎలా కొనసాగుతున్నాయో చెప్పాలన్నారు. ఈ అంశాలపై అసెంబ్లీలో బిహార్ ముస్లింలు నిలదీయాలనుకుంటే ఎఐఎంఐఎం పతంగి (Kite) గుర్తుకు ఓటేయాలని కోరారు. మోదీ మనసు అహ్మదాబాద్‌పై, నితీష్ మనసు రాజ్‌గిర్‌పై, లాలూ మనసు ఆయన కొడుకుపైనా ఉంటుందని, సామాన్య ప్రజానీకం గురంచి వారికి ఆలోచనే లేదని ఒవైసీ విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
ఎంసీడీ వార్డుల్లో ఉపఎన్నికలను ప్రకటించిన ఈసీ
ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి