8th Pay Commission: ఉద్యోగులకు స్వీట్ న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు..
ABN , Publish Date - Oct 28 , 2025 | 03:37 PM
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 8వ వేతన సంఘం విధి విధానాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వేతన సంఘం మరో 18 నెలల్లో..
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారుల.. జీతాలు, పెన్షన్లు పెంచేందుకు వీలుగా 8వ వేతన సంఘం(8th Pay Commission) ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంగళవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ మీటింగ్ అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. 8వ వేతన సంఘానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ రంజనా ప్రసాద్ దేశాయ్ ఈ వేతన సంఘానికి ఛైర్ పర్సన్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపారు. మరో ఇద్దరు సభ్యులు ఈ కమిటీలో ఉంటారని చెప్పారు.
కాగా, ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం కాలపరిమితి 2026 సంవత్సరంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త వేతన సవరణలను అమలు చేసేందుకై 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర సిద్ధమైంది. దీనిపై జనవరి నెలలోనే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. కేంద్ర మంత్రులు, మంత్రిత్వ శాఖలు, అధికారులతో చర్చోపచర్చల అనంతరం 8వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. కాగా, ఈ కమిషన్ తన నివేదికను 18 నెలల్లో ఇవ్వనుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.