Bihar Elections: మహాకూటమి సీఎం అభ్యర్థిగా తేజస్వి.. కాంగ్రెస్ ఎంపీ వెల్లడి
ABN , Publish Date - Oct 17 , 2025 | 07:37 PM
తేజస్వి సీఎం అభ్యర్థిత్వంపై మహాకూటమిలో ఎలాంటి ఇబ్బందులు కనిపించనప్పటికీ సీట్ల పంకాల విషయంలో టెన్షన్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 48 మంది అభ్యర్థుల జాబితాను గురువారంనాడు ప్రకటించింది.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ దగ్గర పడుతుండగా విపక్ష మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత వచ్చింది. కూటమి ప్రధాన భాగస్వామ్య పక్షమైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) 'మహాఘట్‌బంధన్' (Mahaghatbandhan) ముఖ్యమంత్రి అభ్యర్థి అని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు అఖిలేష్ ప్రసాద్ సింగ్ (Akhilesh Prasad Singh) అధికారికంగా శుక్రవారం నాడు ధ్రువీకరించారు. పాట్నాలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, సీట్ల పంపకాలకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయని, బీజేపీ-జేడీయూ కూటమికి వ్యతిరేకంగా విపక్ష ఐక్య కూటమి పోటీకి కట్టుబడి ఉందని చెప్పారు.
'తేజస్వి యాదవ్ మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి. సీట్ల షేరింగ్ ప్రక్రియ త్వరలోనే ఖరారవుతుంది' అని సింగ్ తెలిపారు. సింగ్‌తోపాటు ఇంతకుముందు కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్ సైతం సీఎం అభ్యర్థిత్వంపై తేజస్వి యాదవ్‌కు మద్దతుగా మాట్లాడారు. తేజస్విని సీఎం అభ్యర్థిగా ప్రకటించడంలో తప్పేమీలేదన్నారు. ఎన్డీయే కూడా తమ ముఖ్యమంత్రి అభ్యర్థిపై స్పష్టత ఇవ్వాలన్నారు.
మహాఘట్‌బంధన్‌లో టెన్షన్
తేజస్వి సీఎం అభ్యర్థిత్వంపై మహాకూటమిలో ఎలాంటి ఇబ్బందులు కనిపించనప్పటికీ సీట్ల పంకాల విషయంలో టెన్షన్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 48 మంది అభ్యర్థుల జాబితాను గురువారం నాడు ప్రకటించింది. అయితే భాగస్వామ్య పక్షాలతో విభేదాలు ఇంకా సమసిపోలేదు. వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) చీఫ్ ముఖేష్ సహాని సీట్ల షేరింగ్‌పై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోందని తారిఖ్ అన్వర్ తెలిపారు. తాము కూడా పొరపాటు చేశామని, తగినంత సమయం చేతిలో ఉన్నా ముందే సీట్ల షేరింగ్‌పై ఒక అవగాహనకు వచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
కాగా, సీట్ల పంపకాల విషయంలో ఎలాంటి అసంతృప్తులకు తావీయకుండా ఎన్డీయే వ్యూహాత్మకంగా వ్యవహరించింది. జేడీయూ, బీజేపీలు చెరో 101 సీట్లలో పోటీ చేసేందుకు నిర్ణయించాయి. చిరాగ్ పాశ్వాన్ లోక్ జన్‌శక్తి పార్టీ (రామ్ విలాస్) 29 స్థానాల్లోనూ, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ సారథ్యంలోని హిందుస్థాన్ అవామ్ మోర్చా (సెక్యూలర్), రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహ రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం) చెరో 6 స్థానాల్లోనూ పోటీ చేసేందుకు అవగాహన కుదిరింది. బిహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
ఇన్ఫోసిస్‌లో ఉన్నంత మాత్రాన వాళ్లకి అన్నీ తెలుసా.. సిద్ధరామయ్య మండిపాటు
నితీష్‌తో అమిత్‌షా భేటీ.. మొదటి విడత నామినేషన్లకు ఇవాళే చివరిరోజు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి