Share News

MG University: ఎంజీయూ విద్యార్థులపై సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సుల భారం

ABN , Publish Date - Sep 15 , 2025 | 09:38 AM

మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులపై సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సుల భారం పడుతోంది. యూనివర్సిటీలో 22 కోర్సులతో పాటు 18 డిపార్ట్‌మెంట్లు ఉన్నాయి.

MG University: ఎంజీయూ విద్యార్థులపై సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సుల భారం

  • 50 శాతం మేర విద్యార్థులే ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి

  • 10 కోర్సులకే బడ్జెట్‌ కేటాయించిన ప్రభుత్వం

  • ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద విద్యార్థులు

  • యూనివర్సిటీ సమస్యలపై గవర్నర్‌ దృష్టి సారించేనా?

  • నేడు ఎంజీయూ నాలుగో స్నాతకోత్సవం

మహాత్మా గాంధీ యూనివర్సిటీలో (Mahatma Gandhi University) విద్యార్థులపై సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సుల (Self Finance Courses) భారం పడుతోంది. యూనివర్సిటీలో 22 కోర్సులతో పాటు 18 డిపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అయితే ప్రభుత్వం కేవలం 10 కోర్సులకే బడ్జెట్‌ కేటాయించగా, మరో 12కోర్సులు సెల్ఫ్‌ఫైనాన్స్‌తో కొనసాగుతున్నాయి. ఈ కోర్సులు చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులు ఫీజులు చెల్లించాల్సి వస్తుండటంతో వారిపై ఆర్థిక భారం పడుతోంది.

- (ఆంధ్రజ్యోతి,నల్లగొండ)


ఎంజీ యూనివర్సిటీలో సైకాలజీ కోర్సు సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సుకు నిర్వహిస్తుండగా, ఫీజు రూ.20వేల వరకు ఉంది. అందులో విద్యార్థులు 50శాతం ఫీజు చెల్లిస్తే ప్రభుత్వం రూ.10వేలు చెల్లిస్తోంది. విద్యార్థి తప్పనిసరిగా రూ.10వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్‌ ఐఎంబీఏ కోర్సుకు రూ.37వేలు ఫీజు ఉండగా, అందులో రూ.20వేలు ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌గా చెల్లిస్తే రూ.17వేల వరకు విద్యార్థి ఫీజు కట్టాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


బీటెక్‌ త్రిబుల్‌ఈ, సీఎ్‌సఈ, ఈసీవంటి సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సులకు రూ.57, 200 వరకు ట్యూషన్‌ ఫీజు ఉంది. అందులో ప్రభుత్వం రూ.35వేలవరకు చెల్లిస్తుండగా, మరో రూ. 22,200 విద్యార్థులు చెల్లించాలి. 2007లో ప్రారంభమైన ఎంజీ యూనివర్సిటీ నాలుగో స్నాతకోత్సవానికి సిద్ధమైం ది. 2017, 2018, 2019లో స్నాతకోత్సవాలు నిర్వహించిన యూనివర్సిటీ తాజాగా, ఈనెల 15న నాలుగో స్నాతకోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. ఈ స్నాతకోత్సవానికి యూనివర్సిటీల కులపతి, గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ రానున్నారు. ప్రస్తుతానికి యూనివర్సిటీ బీ+ గ్రేడ్‌లో ఉండగా, 2028 నాటికి న్యాక్‌ అక్రిడేషన్‌లో ఏ+ గ్రేడ్‌కు చేరుకోవాలని యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో సమస్యలు అధికంగా ఉన్నప్పుడు ఎలా సాధ్యమవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.


టీచింగ్‌ స్టాఫ్‌ అరకొరగానే..

యూనివర్సిటీ 2007లో ఆరుకోర్సులతో 500మంది కోర్సుల భారం విద్యార్థులతో ప్రారంభమై ప్రస్తుతం 22 కోర్సులతో కొనసాగుతోంది.అయితే 70మంది టీచింగ్‌ స్టాఫ్‌కు కేవలం 35మంది మాత్రమే ఉన్నారు. 46 మందిని కాంట్రాక్ట్‌ పద్ధతిన తీసుకున్నారు. 2008లో తొలిసారిగా యూనివర్సిటీలో అడ్మిషన్ల పక్రియ మొదలైంది. అంతకు ముందు జిల్లా సమీపంలో పానగల్లులో యూనివర్సిటీని నిర్వహించగా, 2012లో అన్నెపర్తిలోని క్యాంప్‌సకు మార్చారు.


ల్యాబ్‌లు మాత్రం ఇప్పటికీ పానగల్‌లోని భవనంలోనే కొనసాగుతనాయి. ఇప్పటి వరకు ద్వితీయ, తృతీయ నాలుగో సంవత్సరానికి సంబంధించిన ల్యాబ్‌లను యూనివర్సిటీకి మార్చలేదు. ఇది ఖర్చుతో కూడుకున్న పని అని యూనివర్సిటీ భావిస్తుండగా, ల్యాబ్‌ను మార్చకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగా వచ్చే మరో ఐదు కోర్సులు ఫార్మసీ, ఎల్‌ఎల్‌బీ, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, గవర్నెర్స్‌(ఏంఎ)కు ప్రతిపాదనలు పంపగా, ఎల్‌ఎల్‌బీ, ఫార్మసీ కోర్సులకు అనుమతి వచ్చింది. బడ్జెట్‌ కేటాయింపులు జరగలేదు. ఎల్‌ఎల్‌బీ కోర్సును మూడేళ్లతో పాటు ఐదేళ్లు నిర్వహించాల్సి ఉంటుంది.


మెస్‌ చార్జీలపై గందరగోళం

వాస్తవానికి యూనివర్సిటీలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మెస్‌ నిర్వహించాల్సి ఉంది. విద్యార్థులే మెస్‌ నిర్వహించుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్కో విద్యార్థి మెస్‌చార్జి కింద రూ.1,500 చెల్లించగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.2,100కు పెంచింది. ఈ మెస్‌చార్జిలు సకాలంలో విడుదల కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. యూనివర్సిటీలోని ఆర్ట్స్‌, కామర్స్‌, సైన్స్‌, బీటెక్‌కు సంబంధించి నాలుగు బ్లాక్‌లో మొత్తం 2,500మంది విద్యార్థుల వరకు విద్యను అభ్యసిస్తున్నారు. యూనివర్సిటీ హాస్టళ్లలో 800మంది విద్యార్థినులు, 800మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. గతంలో పలుమార్లు మెస్‌లో విద్యార్థులు ఘర్షణ పడ్డారు. మెస్‌లో సరైన సౌకర్యాలు కల్పించడం లేదని విద్యార్థులు ఆందోళన నిర్వహించారు.


అదేవిధంగా యూనివర్సిటీలోని మూత్రశాలలు, మరుగుదొడ్లు సైతం అధ్వానంగా ఉన్నాయి. కనీస నిర్వహణ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు. మెస్‌ చార్జీ డిపాజిట్‌గా యూనివర్సిటీ ఒక్కో విద్యార్థి నుంచి రూ.10వేలు వసూలు చేస్తోంది. వాస్తవానికి రూ.5వేలు మాత్రమే డిపాజిట్‌గా తీసుకోవాలి. యూనివర్సిటీలో ప్రొఫెసర్లు క్వార్టర్లలో నివాసం ఉండటం లేదని, వారు అందుబాటులో లేనప్పుడు పరిశోధనలు ఎలా చేయాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు గ్రంథాలయం నుంచి విద్యార్థులు పుస్తకాలు తీసుకెళ్లకుండా సర్క్యులర్‌ జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది. అత్యవసర ప్రాతిపాదికన ఆరుగురు ప్రొఫెసర్లను నియమించగా, అందులో ఒక్కరు మాత్రమే విధుల్లో చేరారు. మరొకరు విధుల్లో చేరితే కొంతవరకు బోధన మెరుగుపడే అవకాశం ఉంది.


విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

యూనివర్సిటీలో సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సులతో విద్యార్థులపై భారం పడుతోంది. దీంతో పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 12 సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సులకు కూడా ప్రభుత్వమే బడ్జెట్‌ కేటాయించాలి. యూనివర్సిటీలో సమస్యలను అధికారులు పరిష్కరించాలి. అదేవిధంగా రెగ్యులర్‌ టీచింగ్‌ స్టాఫ్‌ను వెంటనే నియమిస్తే బోధన మెరుగుపడుతుంది. విద్యార్థులకు 75శాతం హాజరు నిబంధన ఎంతో ప్రయోజనకరమైనది. నైపుణ్యాలను పెంచే అదనపు కోర్సులను యూనివర్సిటీలో ప్రారంభించాలి. జిల్లా కేంద్రంలోని పానగల్‌లో ఉన్న ల్యాబ్‌లను వెంటనే యూనివర్సిటీకి మార్చాలి.

-వాడపల్లి నవీన్‌, ఎంజీయూ విద్యార్థి


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ వార్తల్లో మాజీ ఐఏఎస్ ఫ్యామిలీ

టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్

For TG News And Telugu News

Updated Date - Sep 15 , 2025 | 10:08 AM