Dhana Trayodashi: ధనత్రయోదశి.. బంగారం ధరల పెరుగుదల.. షాపులు వెలవెల
ABN , Publish Date - Oct 19 , 2025 | 09:31 AM
ధన త్రయోదశి (శనివారం) కావడంతో వ్యాపారులు బంగారం అమ్మకాలు బాగా జరుగుతాయని ఆశించారు. కానీ వారికి నిరాశే మిగిలింది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో గాంధీరోడ్డులో మొత్తం బంగారం షాపులే ఉంటాయి.
అందుబాటులో లేని బంగారం ధర
నిత్యం పెరుగుదలతో తగ్గిపోయిన కొనుగోళ్లు
వ్యాపారాలు లేక దుకాణాలు వెలవెల
ఒంగోలు కలెక్టరేట్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : ధన త్రయోదశి (Dhana Trayodashi) (శనివారం) కావడంతో వ్యాపారులు బంగారం (Gold) అమ్మకాలు బాగా జరుగుతాయని ఆశించారు. కానీ వారికి నిరాశే మిగిలింది. జిల్లా కేంద్రమైన ఒంగోలు (Ongole)లో గాంధీరోడ్డులో మొత్తం బంగారం షాపులే ఉంటాయి. అయితే ఏ షాపులో కూడా కొనుగోళ్లు జరిగిన పరిస్థితి లేదు. ఆవిధంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 150కిపైగా షాపులు ఉండగా ఆయాషాపుల్లో శనివారం మొదటి(బోణి) కొనుగోలు కూడా లేదని వ్యాపారులు చెప్తున్నారు.
చుక్కలు చూపిస్తున్న ధర
బంగారం ధర చుక్కలు చూపిస్తోంది, కనివిని ఎరగని రీతిలో రోజూ పెరుగుతోంది. దీంతో బంగారంఅంటేనే సామాన్యులు జంకాల్సిన దుస్థితి నెలకొంది. అంతర్జాతీయంగా మార్కెట్లో బంగారానికి మరింత డిమాండ్ ఏర్పడటంతో కొనేందుకు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. గత కొంత కాలంగా బంగారం ధరలు నిత్యం పెరుగుతూ ఉన్నాయి. శనివారం ఎనిమిది గ్రాముల బంగారం ధర రూ. 97,500లకు చేరింది. మదుపరులు మాత్రం ఇంకా ధర పెరుగుతుందనే అశతో మేలిమి బంగారం బిస్కెట్లు కొనుగోలు చేస్తున్నారు. దీనికి తోడు పసిడి ఈటీఎఫ్ (ఎక్చ్సేంజ్ ట్రేడెడ్ ఫండ్)లలో, కమొడిటీస్ ఎక్స్చేంజ్‌లో గోల్డ్ ప్యూచర్స్‌పై పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు.
గతంలో ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఆర్థిక మాంద్యం ముంచుకొచ్చినప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు బంగారం ధర పెరుగుతున్నట్లు చరిత్ర చెప్తుంది. అలా కొవిడ్ సమయం నుంచి బంగారం ధర అమాంతంగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం బంగారం ధరల పెరుగుదలతో ఆ వైపు చూడాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదో వివాహాలు ఉండి తప్పని పరిస్థితుల్లో మినహా కనీసం గ్రాము బంగారం కొనుగోలు చేసేందుకు కూడా వెనుకాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది గ్రాము బంగారం రూ. 7,500 వరకు ధర ఉండగా ప్రస్తుతం గ్రాము రూ. 12,187కు చేరింది. అంటే ఏడాది కాలంలో గ్రాముకు ఐదువేల మేర పెరిగింది.
బంగారంతో పోటీ పడుతున్న వెండి
వెండి ధరలు కూడా బంగారంతో పోటీ పడి పెరుగుతున్నాయి. శనివారం కిలో వెండి రూ. 1.82 లక్షలకు చేరింది. అంటే పది గ్రాముల వెండి రూ. 1,820కి చేరింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా చుక్కలుచూపిస్తుండటంతో అది కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు రెండువేలకు 20 గ్రాములు వచ్చే వెండి ఇప్పుడు పది గ్రాములు కూడా రావడం లేదు. ఈ ధరల పెరుగుదల వల్ల సామాన్యులు ఏ వస్తువూ కొనుగోలు చేసే అవకాశం లేకుండా పోయింది.
ఇవి కూడా చదవండి..
ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేష్.. ఎన్ని రోజులంటే
ఉద్యోగ సంఘాలతో సర్కార్ కీలక చర్చలు
Read Latest AP News And Telugu News