OpenAI: ఇండియాలోకి ఓపెన్ ఏఐ.. త్వరలో కొత్త యూనిట్ ప్రారంభం..!
ABN , Publish Date - Aug 22 , 2025 | 11:36 AM
చాట్‌జీపీటీ మాతృసంస్థ త్వరలోనే ఇండియాలో తమ కంపెనీ కార్యకలాపాలు మొదలుపెట్టనున్నట్లు ప్రకటించింది. త్వరలోనే న్యూఢిల్లీలో తొలి కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ప్రపంచ ప్రసిద్ధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) త్వరలోనే భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ఏడాది చివర్లో దేశ రాజధాని న్యూఢిల్లీలో తన తొలి కార్యాలయం ప్రారంభించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. భారత మార్కెట్లో చాట్‌జీపీటీ (ChatGPT) వినియోగం భారీగా పెరగడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ స్వయంగా ప్రకటించారు
చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ మాట్లాడుతూ, 'భారత్ ఒక గ్లోబల్ ఏఐ లీడర్‌గా ఎదిగేందుకు అవసరమైన ప్రతిభ, మద్దతు, మౌలిక సదుపాయాలన్నీ కలిగి ఉంది. ఇండియా ఏఐ మిషన్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సహకారం అభినందనీయమైనది' అని తెలిపారు. భారత్‌లో కార్యాలయం ప్రారంభించడం తమ స్థానిక సేవలను బలోపేతం చేయడంలో తొలి అడుగు అవుతుందని అన్నారు. అయితే, ఈ విషయంపై భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ఓపెన్‌ఏఐ ఇప్పటికే ఇండియా ఏఐ మిషన్ భాగస్వామిగా పని చేయడానికి అంగీకరించింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రభుత్వ అవసరాల కోసం ప్రత్యేక ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేస్తుంది. భారత వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. గణాంకాల ప్రకారం, అమెరికా తర్వాత ఇండియా చాట్‌జీపీటీకి రెండవ అతిపెద్ద మార్కెట్‌గా కొనసాగుతోంది. వీక్లీ యాక్టివ్ యూజర్ల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగినట్లు సంస్థ పేర్కొంది. అంతేగాక, చాట్‌జీపీటీ ప్లాట్ ఫాంను ఇండియాలో అత్యధికంగా విద్యార్థులు, డెవలపర్లే వినియోగిస్తున్నారు.
ఇప్పటికే ఓపెన్‌ఏఐ, భారత వినియోగదారుల కోసం ‘చాట్‌జీపీటీ గో’ పేరుతో ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ సేవలను ప్రకటించింది. రూ.399 ధరతో అందుబాటులో ఉండే ఈ ప్లాన్‌లో మెసేజ్‌లు, ఫైల్ అప్‌లోడ్లు, ఇమేజ్ క్రియేట్ వంటి ఫీచర్లను విస్తృత స్థాయిలో వినియోగించుకునే అవకాశం కల్పించనుంది. అంతేకాదు, ఇండిక్ లాంగ్వేజ్ మద్దతుతో పాటు యూపీఐ పేమెంట్స్‌ను కూడా ఇందులో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కూడా ప్రకటించింది.
ఇవీ చదవండి:
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ప్రీ ఐపీఓ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్