Pre IPO Trading: ప్రీ ఐపీఓ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్
ABN , Publish Date - Aug 22 , 2025 | 05:23 AM
కంపెనీల పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) ప్రక్రియల్లో అనధికారిక లేదా అనియంత్రిత (గ్రే మార్కెట్) కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీ-ఐపీఓ షేర్ ట్రేడింగ్ కోసం నియంత్రిత ప్లాట్‌ఫామ్‌ను...
ప్రవేశపెట్టే ఆలోచనలో సెబీ
ఐపీఓ షేర్ల కేటాయింపు, లిస్టింగ్‌కు మధ్య 3 రోజుల్లో ట్రేడింగ్‌కు చాన్స్
గ్రే మార్కెట్ కార్యకలాపాలకు చెక్
ముంబై: కంపెనీల పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) ప్రక్రియల్లో అనధికారిక లేదా అనియంత్రిత (గ్రే మార్కెట్) కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీ-ఐపీఓ షేర్ ట్రేడింగ్ కోసం నియంత్రిత ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే సంకేతాలిచ్చారు. ఫిక్కీ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఐపీఓ షేర్ల కేటాయింపు, లిస్టింగ్‌కు మధ్య మూడు రోజుల సమయంలో నియంత్రిత వాతావరణంలో కంపెనీ షేర్లలో ట్రేడింగ్ నెరిపేందుకు ఈ కొత్త ప్లాట్‌ఫామ్ వీలు కల్పించనుంది. ప్రస్తుతం ఈ మూడు రోజుల సమయంలో జరిగే గ్రే మార్కెట్ లావాదేవీలను కొత్త వేదిక భర్తీ చేయనుంది.
‘‘ఏదైనా కంపెనీ స్టాక్ మార్కెట్లో షేర్లను నమోదు చేసే ముందు వెల్లడించిన సమాచారం ఆ కంపెనీలో పెట్టుబడులపై నిర్ణయం తీసుకునేందుకు సరిపోదు. క్యాపిటల్ మార్కెట్‌ను మరింత విస్తృతం చేయడంతోపాటు ఇన్వెస్టర్ల ప్రయోజనాలను రక్షించేందుకు ప్రీ- ఐపీఓ షేర్ ట్రేడింగ్‌కు నియంత్రిత వేదికను పైలట్ పద్ధతిన ప్రవేశపెట్టాలనుకుంటున్నాం. ప్రీ-ఐపీఓ కంపెనీలు నిర్దేశిత సమాచారం వెల్లడించడం ద్వారా ఈ ప్లాట్‌ఫామ్‌లో షేర్ల ట్రేడింగ్ అవకాశాన్ని ఎంచుకోవచ్చ’’ని పాండే అన్నారు. ఈ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి వస్తే అనియంత్రిత వేదికలపై అన్ లిస్టెడ్ షేర్ల ట్రేడింగ్‌కు అడ్డుకట్ట పడనుందన్నారు. ప్రస్తుతం ఏదైనా కంపెనీ ఐపీఓ సబ్‌స్ర్కిప్షన్ గడువు ముగిసిన తర్వాత స్టాక్ ఎక్స్ఛేంజీల్లో షేర్ల నమోదుకు కనీసం 3 రోజులు పడుతుంది. ఈ సమయంలో గ్రే మార్కెట్‌లో ఆ కంపెనీ షేర్ల అనధికారిక ట్రేడింగ్ జరుగుతోంది. ఇందులో నష్ట అవకాశాలున్నప్పటికీ, ఇన్వెస్టర్లు ప్రీ- లిస్టింగ్ షేర్లను చేజిక్కించుకునేందుకు ఎగబడుతున్న నేపథ్యంలో సెబీ ఇందుకోసం నియంత్రిత వేదికను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.
ఈక్విటీ డెరివేటివ్‌ల గడువు పెంపు
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎ్‌ఫ అండ్ ఓ) ట్రేడింగ్‌లో చిన్న మదుపరుల పాత్రను తగ్గించేందుకు సెబీ మరో చర్య చేపట్టబోతోంది. హెడ్జింగ్ అవసరాలకు, దీర్ఘకాలిక పెట్టుబడుల రక్షణకు మాత్రమే ఉపయోగపడేలా ఈక్విటీ డెరివేటివ్ కాంట్రాక్టుల కాలపరిమితిని క్రమపద్ధతిలో పెంచాలనుకుంటున్నట్లు సెబీ చైర్మన్ పాండే ఫిక్కీ సదస్సులో తెలిపారు. ‘‘దీర్ఘకాలిక సాధనాల ద్వారా డెరివేటివ్‌ల నాణ్యతను పెంచుతూనే క్యాష్ ఈక్విటీ మార్కెట్‌ను మరింత విస్తృతం చేసేందుకు సెబీ మార్గాలను అన్వేషిస్తోంది. డెరివేటివ్ సాధనాల గడువు పెంపుపైౖ మార్కెట్ సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరపనున్న’’ట్లు పాండే చెప్పారు.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి