EPS: మాజీసీఎం విమర్శ.. హీరో విజయ్‌వి పగటి కలలే..
ABN , Publish Date - Aug 22 , 2025 | 10:57 AM
రాజకీయాల్లో అంతగా అనుభవంలేని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ ఉన్నపళంగా అధికారంలోకి రావాలని పగటి కలలు కంటున్నారని, ప్రజల అండదండలు లేకుండా ఇది ఎప్పటికీ నెరవేరదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విమర్శించారు.
- ఈపీఎస్ విమర్శ
చెన్నై: రాజకీయాల్లో అంతగా అనుభవంలేని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ ఉన్నపళంగా అధికారంలోకి రావాలని పగటి కలలు కంటున్నారని, ప్రజల అండదండలు లేకుండా ఇది ఎప్పటికీ నెరవేరదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami) విమర్శించారు. డీఎంకే అవినీతిని ఎండగట్టడానికే అన్నాడీఎంకేను ఎంజీఆర్ స్థాపించి ప్రజా సమస్యలపై దాదాపు ఐదేళ్లు పోరాడి అధికారంలో కూర్చున్నారని గతాన్ని గుర్తుచేసుకున్నారు.
రాష్ట్రంలో కొత్తగా పార్టీలు ప్రారంభించే నాయకులంతా ఎంజీఆర్, జయలలితల ఫొటోలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారని, విజయ్ కూడా టీవీకే మహానాడులో అన్నాదురై, ఎంజీఆర్ ఫొటోలు పెట్టారని వ్యాఖ్యానించారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో ఈపీఎస్ సాగిస్తున్న ప్రచారయాత్ర గురువారం ఉదయం కాంచీపురం చేరుకుంది. ఆయన ముందుగా కామాక్షి అమ్మవారిని దర్శించి విశేష పూజలు చేశారు. అనంతరం కాంచీపురం జంక్షన్‌లో సాయంత్రం జరిగిన రెడ్‌షోలో ఈపీఎస్ మాట్లాడుతూ రాజకీయ పార్టీని ప్రారంభించిన వెంటనే అధికారంలోకి వచ్చిన చరిత్ర ఇప్పటివరకు ఎవరికీ లేదని,
ప్రజల కోసం విరామం లేకుండా శ్రమించిన పార్టీలకే తగిన గుర్తింపు ఉంటుందన్నారు. అలా కాకుండా పార్టీ ప్రారంభించిన సంవత్సరానికే అధికార పీఠమెక్కాలని నటుడు విజయ్ కంటున్న పగటి కలలు నెరవేరబోవని ఆయన విమర్శించారు. చేనేత రంగాన్ని కాపాడి నేత కార్మికుల జీవనశైలిని మెరుగుపరిచేందుకు అన్నాడీఎంకే ప్రభుత్వం అమలుపరిచిన పథకాలను, చేసిన కృషిని వస్త్ర పరిశ్రమలకు పేరెన్నికగన్న కాంచీపురం ప్రజలు మరిచిపోలేదన్నారు.

అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికల డీఎంకే మేనిఫెస్టోలో 525 ప్రకటనలను ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ విడుదల చేసి ప్రజలను నమ్మించి, అధికారపీఠమెక్కారని, అయితే ఆ హామీల్లో 10 శాతం కూడా అమలుపరచకుండా రాష్ట్రప్రజానీకాన్ని మోసం చేశారని మండిపడ్డారు. కొత్తగా రాజకీయ పార్టీని ప్రారంభించిన నటుడు విజయ్ తాను పాల్గొనే సభల్లో అన్నాడీఎంకేను స్థాపించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పేరు ఉచ్ఛరిస్తున్నారని, అంతటితో ఆగకుండా మదురై టీవీకే మహానాడులో అన్నాదురై, ఎంజీఆర్ ఫొటోలను ఏర్పాటు చేయడం ఎందుకో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఆరు నెలలకే పుట్టిన శిశువుకు ప్రాణం పోసి..
Read Latest Telangana News and National News