Godavari Floods: శాంతిస్తున్న ఉగ్ర గోదావరి
ABN , Publish Date - Aug 22 , 2025 | 05:41 AM
ఎగువన కురిసిన భారీ వర్షాలు, వస్తున్న వరదతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గురువారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 51.9 అడుగులు ఉండగా వరద ప్రవాహం 13.66 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది.
8 భద్రాచలం వద్ద 51.9 నుంచి 51.4 అడుగులకు తగ్గిన నీటిమట్టం
8 కొనసాగుతున్న 2వ ప్రమాద హెచ్చరిక
8 తెలంగాణ-ఏపీ సరిహద్దులో రాయని పేట వద్ద రహదారిపైకి వరద
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): ఎగువన కురిసిన భారీ వర్షాలు, వస్తున్న వరదతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గురువారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 51.9 అడుగులు ఉండగా వరద ప్రవాహం 13.66 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. రాత్రి 11 గంటలకు నీటిమట్టం తగ్గుముఖం పట్టి 51.4 అడుగులకు చేరింది. బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు 48.6 అడుగులు ఉండగా గురువారం తెల్లవారుజామున 3 గంటలకు 49.5 అడుగులకు పెరిగింది. ఉదయం 6 గంటలకు 50.3, 9 గంటలకు 50.9, మధ్యాహ్నం 12 గంటలకు 51.4, 3 గంటలకు 51.9 అడుగులకు చేరింది. 5 గంటల పాటు అదేస్థాయిలో నిలకడగా కొనసాగింది. రాత్రి 9 గంటలకు 51.7, 10 గంటలకు 51.5, 11 గంటలకు 51.4 అడుగులకు తగ్గింది. శుక్రవారం తెల్లవారుజాముకల్లా ఈ ప్రవాహం మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. గురువారం దుమ్ముగూడెం (సీతమ్మసాగర్)కు 13.23 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది.
సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) బ్యారేజీకి 8.26 లక్షలు, మేడిగడ్డకు 7.40 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. వచ్చింది వచ్చినట్లే దిగువకు వదిలిపెట్టారు. గోదావరి ఉధృతితో తెలంగాణ-ఏపీ సరిహద్దులోని అల్లూరి జిల్లా యటపాక మండలం రాయనిపేట వద్ద జాతీయ రహదారిపై వరద నీరు వచ్చి చేరింది. ముందు జాగ్రత్తగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. భద్రాచలం-చర్ల మార్గంలో కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోదావరి ఉగ్రరూపంతో ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 29 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రెండు మండలాల్లో లోతట్టు ప్రాంతాలు, రహదారులపైకి వరద చేరుకోవడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. శబరి నది ఉధృతి కారణంగా వేలేరుపాడు మండలంలోకి వరద అంతకంతకు పెరుగుతూనే ఉంది. భద్రాచలం నుంచి దిగువకు 13.60 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండటంతో వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని గ్రామాలను వరద చుట్టుముట్టింది. కుక్కునూరు మండలంలో 1,222 కుటుంబాలు, వేలేరుపాడు మండలంలో 2,468 కుటుంబాలు ముంపు బారిన పడ్డాయి.
కృష్ణా నదికి పెరుగుతున్న వరద
కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, భీమా, తుంగభద్ర నదులకు వరద పెరుగుతోంది. గురువారం శ్రీశైలం ప్రాజెక్టుకు 5.40 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు పది గేట్లు ఎత్తి 4.20 లక్షల క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 4.32 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 26 క్రస్ట్ గేట్ల నుంచి 3.81 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రాల్లో జోరుగా ఉత్పత్తి జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్
టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం
Read Latest AP News and National News