Share News

Hyderabad: ఆరు నెలలకే పుట్టిన శిశువుకు ప్రాణం పోసి..

ABN , Publish Date - Aug 22 , 2025 | 05:58 AM

ఆరు నెలలు కూడా నిండకుండానే భూమ్మీద పడ్డ శిశువు బతుకుతాడా? తనకు తోడుగా ఇద్దరితో తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన స్థితిలో వారిని కోల్పోయి..

Hyderabad: ఆరు నెలలకే పుట్టిన శిశువుకు ప్రాణం పోసి..

  • ఐవీఎఫ్‌ విధానంలో సుడాన్‌ మహిళ గర్భం.. 3 పిండాలతో అభివృద్ధి

  • ఒక పిండం తొలగింపు.. 23 వారాలకే కవలల జననం.. ఒకరి మృతి

  • మూడో శిశువుకు 115 రోజుల వైద్యం.. మెడికవర్‌ వైద్యుల ఘనత

హైదరాబాద్‌ సిటీ/హైటెక్‌ సిటీ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ఆరు నెలలు కూడా నిండకుండానే భూమ్మీద పడ్డ శిశువు బతుకుతాడా? తనకు తోడుగా ఇద్దరితో తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన స్థితిలో వారిని కోల్పోయి.. తానొక్కడే నెలలు నిండకుండానే అరకిలో బరువుతో పుట్టిన ఆ శిశువుకు హైటెక్‌సిటీలోని మెడికవర్‌ ఉమెన్‌ చైల్డ్‌ ఆస్పత్రి వైద్యుల కృష్టితో ఊపిరి నిలిచింది. మూడు నెలల పాటు ప్రత్యేక వైద్యంతో 2కిలోల బరువు చేరి పూర్తిగా కోలుకున్నాడు. ఇంత తక్కువ సమయంలో పుట్టిన శిశువులు బతకడం ప్రపంచంలోనే అత్యంత అరుదు అని.. ఇది భారతీయ నియోనాటల్‌ ఆరోగ్య సంరక్షణలో చరిత్రాత్మక విజయమని ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. సూడాన్‌కు చెందిన ఇన్సాఫ్‌ అనే వ్యక్తి భార్య షాకీర్‌ ఐవీఎఫ్‌ పద్ధతిలో గర్భం దాల్చింది. మూడు పిండాలు ప్రాణం పోసుకున్నాయి. ఒక పిండం అభివృద్ధి చెందకపోవడంతో తొలగించారు.


గత ఏప్రిల్‌ 18న 23వారాలకే కవలలు జన్మించారు. ఒక శిశువు పుట్టిన తొమ్మిదో రోజున చనిపోయాడు. కేవలం 565 గ్రాములతో పుట్టిన మూడో శిశువునైనా కాపాడేందుకు నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఎన్‌ఐసీయూ)కు తరలించి చికిత్స మొదలుపెట్టారు. 115 రోజుల పాటు చికిత్స చేశారు. గుండె, మెదడు, రెటీనా అభివృద్ధిని నిరంతరం పర్యవేక్షించారు. పేటెంట్‌ డక్టస్‌ ఆర్టెరియోసస్‌ అనే గుండె సంబంధిత సమస్యకు మందులతో చికిత్స అందించారు. ఆగస్టు 11నాటికి రెండు కిలోల బరువుతో, స్థిరమైన ఆరోగ్యంతో ఉన్న శిశువును డిశ్చార్జి చేసినట్లు చీఫ్‌ నియోనాటాలజిస్టు డాక్టర్‌ రవీందర్‌రెడ్డి చెప్పారు. శిశువు చికిత్సలో వైద్యులు రాధిక, నవిత, వంశీరెడ్డి, ప్రశాంతి కీలకపాత్ర పోషించారు.

Updated Date - Aug 22 , 2025 | 05:58 AM