Best Savings Schemes: చిన్న మొత్తాలతో పెద్ద లాభాలు కావాలా? ఇండియాలో టాప్-10 స్కీమ్స్ ఇవే..
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:28 PM
చాలామంది తమ నెలవారీ ఆదాయంలో చిన్న మొత్తాలను మాత్రమే పొదుపు చేయగలరు. మీరు అలాంటి వారిలో ఒకరా? దీర్ఘకాలంలో అధిక లాభాలను రిస్క్ లేకుండా ఆర్జించాలని ఉందా? అయితే, ఇండియాలోన టాప్-10 సేవింగ్ స్కీమ్స్ లిస్ట్ మీకోసం..
మీరు చిన్న చిన్న మొత్తాలను ఆదా చేసి భవిష్యత్తు జీవితానికి డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? ఎటువంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కోసం చూస్తున్నారా? అయితే, నష్ట భయం లేకుండా మంచి ఆదాయం సంపాదించేందుకు కొన్ని బెస్ట్ ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. ముందుగా ఏ ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయి? ఏ పథకానికి ఎంత వడ్డీ రేటు ఉంటుంది? ఏది ఉత్తమమైనది? ఇలా ప్రతి విషయాన్ని డీటైల్‌గా ఈ స్టోరీలో తెలుసుకోండి.
1. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా: ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ. 500 నుండి ప్రారంభమవుతుంది. గరిష్ఠ పెట్టుబడికి ఎటువంటి పరిమితి లేదు. మీరు ఖాతాలో కనీసం రూ. 500 నిర్వహించలేక బ్యాలెన్స్ సున్నాకి చేరుకుంటే ఖాతా మూసివేయబడుతుంది. మీరు దీనిలో పెట్టుబడి పెడితే వార్షిక వడ్డీ రేటు 4% లభిస్తుంది.
2. నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్: కనీసం రూ. 1000 డిపాజిట్‌తో ఖాతాను తెరవవచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. ఒక సంవత్సరం టర్మ్ డిపాజిట్‌పై వడ్డీ రేటు 6.9 శాతం, రెండేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7 శాతం, మూడేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.10 శాతం, ఐదేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.50 శాతం. వడ్డీ రేటు క్రమం తప్పకుండా చెల్లిస్తారు.
3. ఐదేళ్ల RD ప్లాన్: ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి మీరు కనీసం రూ. 100 డిపాజిట్‌తో ఖాతాను తెరవవచ్చు. గరిష్ఠ పెట్టుబడికి పరిమితి లేదు. ఈ పథకంపై ప్రస్తుత వడ్డీ రేటు 6.7 శాతం.
4. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్: మీరు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ కోసం ఖాతాను తెరవాలనుకుంటే కనీసం రూ. 1000 డిపాజిట్‌తో ప్రారంభించాలి. మీరు ఈ ఖాతాలో గరిష్ఠంగా రూ. 30 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకానికి వడ్డీ రేటు 8.20 శాతం.
5. నెలవారీ ఆదాయ పథకం: ఈ పథకంలో పెట్టుబడిదారులు నెలవారీ ఆదాయం పొందవచ్చు. ఒకే ఖాతా కింద కనీసం రూ. 1000, గరిష్ఠంగా రూ. 9 లక్షలు, ఉమ్మడి ఖాతా కింద గరిష్ఠంగా రూ. 15 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుండి ప్రతి నెలా ఆదాయం వడ్డీ రూపంలో వస్తుంది. దీనికి వడ్డీ రేటు 7.40%గా ఉంది.
6. జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం (NSC): ఈ పథకంలో చేరాలనుకునే వారు కనీసం రూ. 1000 డిపాజిట్‌తో ఖాతాను తెరవవచ్చు. గరిష్ఠ పెట్టుబడి ఎంతైనా ఉండవచ్చు. వార్షిక వడ్డీ రేటు 7.70%.
7. PPF (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్): పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఒక సంవత్సరంలో కనీసం రూ. 500. గరిష్ఠంగా రూ. 1,50,000 పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం, ఈ పథకం 7.71 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
8. కిసాన్ వికాస్ పత్ర: ఈ కిసాన్ వికాస్ పత్ర పథకంలో కనీసం రూ. 1000 డిపాజిట్‌తో ఖాతాను తెరవవచ్చు. మీరు ఎంత మొత్తమైనా పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీ రేటు 7.50 శాతం.
9. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్: ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి కనీసం రూ. 1000 తో ఖాతాను తెరవాలి. ఒక ఖాతాలో గరిష్ఠంగా రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. 3 నెలల కాలపరిమితితో ఎన్ని ఖాతాలనైనా తెరవవచ్చు. వార్షిక వడ్డీ రేటు 7.50%.
10. సుకన్య సమృద్ధి యోజన: కేంద్ర ప్రభుత్వం ఈ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రత్యేకంగా బాలికల కోసం తీసుకువచ్చింది. వడ్డీ రేటు 8.20 శాతం. మీరు కనీసం రూ. 250 తో ఖాతాను తెరవవచ్చు. గరిష్ఠ పెట్టుబడి రూ. 1.50 లక్షలు.
ఇవీ చదవండి:
క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లిస్తున్నారా
ఏఐ సరికొత్త కామధేనువు: ముఖేశ్ అంబానీ
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి