Rent Payment: క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లిస్తున్నారా
ABN , Publish Date - Aug 31 , 2025 | 03:10 AM
దేశ జనాభాలో చాలా మందికి సొంత గూడు లేదు. ఆదాయానికి తగ్గట్టు ఏదో ఒక అద్దె ఇల్లే గతి. పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత ఎక్కువ. మంచి ఇల్లు అద్దెకు దొరకడం ఒక సమస్య అయితే, అద్దె చెల్లించడం మరో సమస్య...
అయితే ఆలోచించి ఉపయోగించండి
దేశ జనాభాలో చాలా మందికి సొంత గూడు లేదు. ఆదాయానికి తగ్గట్టు ఏదో ఒక అద్దె ఇల్లే గతి. పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత ఎక్కువ. మంచి ఇల్లు అద్దెకు దొరకడం ఒక సమస్య అయితే, అద్దె చెల్లించడం మరో సమస్య. ఒక్కోసారి సమయానికి జీతం రాదు. లేదా అత్యవసర ఖర్చులు వస్తాయి. అలాంటప్పుడు అప్పు చేసి లేదా క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లించాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లించడంలో కొన్ని లాభాలతో పాటు కొన్ని నష్టాలూ ఉన్నాయి. అవేమిటంటే..
లాభాలు
రివార్డులు, క్యాష్‌బ్యాక్‌లు : క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే అన్ని చెల్లింపులకు రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లు లభిస్తాయి. అదె ్ద చెల్లింపులకూ ఇది వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి క్రెడిట్ కార్డు ద్వారా తన ఇంటి నెలవారీ అద్దె రూ.30,000 చెల్లిస్తే క్యాష్‌బ్యాక్ రూపంలో ఒక శాతం వరకు (రూ.300) లభిస్తుంది.
వెసులుబాటు: క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లిస్తే క్రెడిట్ కార్డు కంపెనీకి ఆ మొత్తాన్ని 25 నుంచి 50 రోజుల్లో వడ్డీ లేకుండా చెల్లించవచ్చు. తాత్కాలిక ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారికి ఇది పెద్ద ఊరట.
క్రెడిట్ స్కోరు: క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించిన అద్దె మొత్తాన్ని మళ్లీ సమయానికి క్రెడిట్ కార్డు కంపెనీకి చెల్లించాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. తద్వారా భవిష్యత్‌లో రుణాలు తీసుకోవాల్సి వస్తే సులభమైన షరతులతో లేదా ఎక్కువ మొత్తాన్ని తక్కువ వడ్డీ రేటుతో అప్పుగా తీసుకునే సౌలభ్యం ఉంటుంది.
వెసులుబాటు: క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లించడం చాలా సులభం. ఈ చెల్లింపులకు సంబంధించిన డిజిటల్ రికార్డులూ అందుబాటులో ఉంటాయి. భవిష్యత్‌లో ఇంటి యజమానితో లేదా పన్ను అధికారులతో ఏవైనా సమస్యలు ఏర్పడితే సాక్ష్యాలుగానూ ఉపయోగపడతాయి.
సమస్యలు
ఫీజులు: చాలా బ్యాంకులు తమ క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే అద్దె చెల్లింపులపై ఒకటి నుంచి రెండు శాతం వరకు ఫీజుగా వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి తన క్రెడిట్ కార్డు ద్వారా రూ.30,000 అద్దె చెల్లించాడనుకుందాం. దీనిపై బ్యాంకు 1.5 శాతం చొప్పున రూ.375 ఫీజుగా వసూలు చేసింది. దీంతో రివార్డులు, క్యాష్‌బ్యాక్‌ల ద్వారా వచ్చే దానికంటే ఫీజు రూపంలో పోయేదే ఎక్కువవుతుంది.
ట్యాక్స్ స్ర్కూటినీ: క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లిస్తుంటే, ఆ డిజిటల్ రికార్డులు భద్రంగా ఉంటాయి. ఐటీ రిటర్న్‌లో మీరు పేర్కొన్న ఆదాయానికి, అద్దె చెల్లింపు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నా, హెచ్‌ఆర్‌ఏ ఎక్కువగా క్లెయిమ్ చేసినా ఐటీ శాఖకు దొరికిపోతారు.
యాజమాని ఆమోదించాలి: చాలా మంది ఇళ్ల యజమానులు క్రెడిట్ కార్డు చెల్లింపులను ఆమోదించరు. నగదు లేదా బ్యాంకు ట్రాన్స్‌ఫర్ అడుగుతుంటారు. అద్దె ఆదాయంపైనే ఆధారపడే యజమానులైతే బ్యాంకు ట్రాన్స్‌ఫర్‌లను కూడా అంగీకరించరు. అంతా నగదు రూపంలోనే చెల్లించమంటారు.
అప్పుల ఊబి: గడువులోగా క్రెడిట్ కార్డు బకాయిలు చెల్లించాలి. లేకపోతే వడ్డీ మీద వడ్డీ చెల్లించలేక అప్పుల ఊబిలో చిక్కుకుపోవాల్సి ఉంటుంది.
పై విషయాలన్నిటిని బేరీజు వేసుకున్న తర్వాతే క్రెడిట్ కార్డు చెల్లింపులను ఎంచుకోవాలి. ఇక్కడ ఫీజుల రూపంలో పోయేదానికంటే రివార్డులు, క్యాష్‌బ్యాక్‌ల రూపంలో వచ్చేది ఎక్కువగా ఉండాలి. లేకపోతే క్రెడిట్ కార్డు ద్వారా అద్దెల చెల్లింపు దండగ అని చెప్పక తప్పదు.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి