Mukesh Ambani: ఏఐ సరికొత్త కామధేనువు
ABN , Publish Date - Aug 30 , 2025 | 04:01 AM
రిలయన్స్ జియోతో దేశ టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆర్‌ఐఎల్ మరో సంచలనానికి సిద్ధమవుతోంది..
ప్రతి ఒక్కరికీ కృత్రిమ మేధ సేవలందిస్తాం
గూగుల్, మెటా భాగస్యామ్యంలో ప్రత్యేక కంపెనీ ఏర్పాటు
వచ్చే ఏడాది జియో పబ్లిక్ ఇష్యూ.. ఆర్‌ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడి
న్యూఢిల్లీ: రిలయన్స్ జియోతో దేశ టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) మరో సంచలనానికి సిద్ధమవుతోంది. దేశంలో ప్రతి చోట, ప్రతి ఒక్కరికీ కృత్రిమ మేధ (ఏఐ) సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం రిలయన్స్ ఇంటలిజెన్స్ పేరుతో ప్రత్యేక అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసింది. శుక్రవారం కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఆర్‌ఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ముకేశ్ అంబానీ ఈ విషయం వెల్లడించారు. ‘జియో ద్వారా దేశంలో ప్రతి చోట, ప్రతి ఒక్కరికీ డిజిటల్ సేవలను చేరువ చేశాం. ఇప్పుడు అదే తరహాలో రిలయన్స్ ఇంటలిజెన్స్ ద్వారా దేశంలోని ప్రతి ఒక్కరికీ, ప్రతి చోటా ఏఐ సేవలు అందిస్తాం’ అన్నారు. ఏఐ కామధేనువులా తమ వ్యాపార విస్తరణకు తదుపరి చోదక శక్తి కాబోతోందని ముకేశ్ అంబానీ ప్రకటించడం విశేషం.
మెటా, గూగుల్‌తో జట్టు: అంతర్జాతీయ టెక్ దిగ్గజాలతోనూ రిలయన్స్ చేతులు కలుపుతోంది. ఏఐ సేవల కోసం ఫేస్‌బుక్ మాతృసంస్థ ‘మెటా’తో కలిసి ఒక జాయింట్ వెంచర్ (జేవీ) కంపెనీని ఏర్పాటు చేసింది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బెర్గ్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ జేవీలో తొలుత ఇరు సంస్థలు రూ.10 కోట్ల డాలర్ల (రూ.855 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నాయి. ఈ జేవీ ద్వారా కంపెనీలు, ప్రభుత్వానికి అవసరమైన ప్రత్యేక ఏఐ సేవలను అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం మెటాకు చెందిన ఓపెన్‌సోర్స్ ఎల్‌ఎల్‌ఏఎంఏ మోడల్స్‌ను ఉపయోగిస్తామని జుకర్‌బర్గ్ తెలిపారు. మరోవైపు గూగుల్‌తో కలిసి గుజరాత్, జామ్‌నగర్ ప్రాంతంలోని తన వ్యాపార అవసరాల కోసం ప్రత్యేక క్లౌడ్ రీజియన్ ఏర్పాటు చేయబోతున్నట్టు అంబానీ ప్రకటించారు.
జియో నుంచి స్మార్ట్ గ్లాసెస్: జియో ఫ్రేమ్స్ పేరుతో జియో స్మార్ట్ గ్లాసె్‌సలోకి ప్రవేశించింది. ఆర్‌ఐఎల్ ఏజీఎంలో రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ ఈ స్మార్‌గ్లాసె్‌సను ఆవిష్కరించారు. ఈ గ్లాసెస్ ద్వారా చేయి పెట్టకుండానే ఏఐ వాయిస్ అసిస్టెంట్ ‘రియా’ సాయంతో అన్ని భారతీయ భాషల్లో ఫోన్ కాల్స్, మ్యూజిక్, వీడియో రికార్డింగ్స్ వంటి పనులు చేసుకోవచ్చు.
జోరుగా రిటైల్ వ్యాపారం: రిలయన్స్ రిటైల్ వ్యాపారం కూడా జోరందుకున్నట్లు ఆర్‌ఐఎల్ డైరెక్టర్ ఈషా అంబానీ ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఈ విభాగం రూ.3.3 లక్షల కోట్లకుపైగా వ్యాపారం నమోదు చేసిందని వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో రిటైల్ వ్యాపారం ఏటా సగటున 20 శాతం చొప్పున పెరగనుందన్నారు. తమ వ్యాపార ఆదాయంలో 70 శాతం స్టోర్ల ద్వారానే వస్తున్నందున ఏటా 2,000 నుంచి 3,000 కొత్త స్టోర్ల ఏర్పాటు కొనసాగుతుందని ఈషా అంబానీ తెలిపారు.
ఏజీఎం ఇతర ప్రధాన అంశాలు
2030 నాటికి రెండింతలు పెరగనున్న వ్యాపారం
వచ్చే మూడు, నాలుగేళ్లలో జియో, రిటైల్ ఆదాయాలు రెట్టింపు
కేజీ బేసిన్‌లో చమురు, సహజ వాయువుల కోసం మరిన్ని బావుల తవ్వకం
కేజీ బేసిన్‌లో 21,000 బ్యారళ్లకు చేరిన రోజువారీ ముడి చమురు ఉత్పత్తి
గత ఆర్థిక సంవత్సరం 11 శాతం వృద్ధితో రూ.6,26,921 కోట్ల ఆదాయం
మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా చమురు శుద్ధి సామర్ద్యం పెంపు
న్యూ ఎనర్జీలో కొత్త వ్యాపార ప్రాజెక్టులపై రూ.75,000 కోట్ల పెట్టుబడులు
తొలి మూడు నెలల్లోనే 60 కోట్లకు చేరిన జియోహాట్‌స్టార్ వినియోగదారులు
త్వరలో రిలయన్స్ నుంచి ఏఐ ఆధారిత హ్యూమనాయిడ్ రోబోలు
2035 నాటికి పూర్తి కాలుష్య రహిత కంపెనీగా ఆర్‌ఐఎల్
2026 జూన్ నాటికి జియో మెగా ఐపీఓ
రిలయన్స్ జియో మెగా పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) మీద కూడా ముకేశ్ అంబానీ స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది (2026) జూన్ లోపే ఈ ఐపీఓ మార్కెట్‌కు వస్తుందని ప్రకటించారు. భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలో ఇదే అతి పెద్ద ఐపీఓ అవుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జియో ఖాతాదారుల సంఖ్య 50 కోట్లు మించిపోయిందని జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ ప్రకటించారు. దీంతో ప్రపంచంలోని అతిపెద్ద టెలికాం కంపెనీల్లో ఒకటిగా జియో ఆవిర్భవించినట్టు తెలిపారు.