Brinjal: వంకాయతోనూ సమస్యలు.. దీన్ని ఎవరు తినకూడదంటే..
ABN , Publish Date - Aug 31 , 2025 | 11:55 AM
సాధారణంగా అందరూ తినే వంకాయతో కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి నిపుణులు చెప్పే దాని ప్రకారం వంకాయ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన వారు ఎవరంటే..
ఇంటర్నెట్ డెస్క్: వంకాయ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, కొందరికి దీనితో అనారోగ్యం కలిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి వంకాయ విషయంలో ఏయే వ్యక్తులు అప్రమత్తత వహించాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
వృక్షశాస్త్ర ప్రకారం, వంకాయను నైట్‌షేడ్ మొక్కల కుటుంబానికి చెందినదిగా పరిగణిస్తారు. టమాటాలు, బంగాళదుంప, పెప్పర్స్ కూడా నైట్‌షేడ్ కుటుంబానికి చెందినవే. ఇవి కొందరిలో అలర్జీని కలుగజేస్తాయి. చర్మ సంబంధిత సమస్యలు, జీర్ణ వ్యవస్థ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి అలర్జీలు ఉన్న వారు వంకాయ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
వంకాయలోని ఆక్సాలేట్స్ అనే రసాయనాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సమస్య ఉన్న వారిని వంకాయ మరింత ఇబ్బంది పెడుతుంది.
వంకాయలో అధికంగా ఉండే పీచు పదార్థం కొందరి ఒంటికి సరిపడదు. ఇలాంటి వారు వంకాయ తింటే కడుపుబ్బరం లేదా ఇబ్బంది ఏర్పడుతుంది. కొందరిలో డయేరియా కూడా వస్తుంది.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం ప్రకారం, వంకాయలోని టైరమైన్ అనే కాంపౌండ్ మోనోఅమైన్ ఆక్సిడేస్ ఇన్‌హిబిటర్స్ అనే ఔషధాలకు అడ్డంకిగా మారుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ మందులు తీసుకునేవారిలో డిప్రెషన్ పెరుగుతుంది. అధికమొత్తంలో టైరమైన్ కారణంగా బీపీ కూడా ప్రమాదకర స్థాయిలో తగ్గే అవకాశం ఉంది.
వంకాయలోని నాసునిన్ అనే కాంపౌండ్ ఆహారంలోని ఐరన్‌తో గట్టిగా అనుసంధానమై శరీరం ఈ పోషకాన్ని గ్రహించకుండా చేస్తుంది. కాబట్టి రక్తహీనత వంటి సమస్యలు ఉన్న వారు కూడా వంకాయ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
వంకాయ కారణంగా కీళ్ల నొప్పులు కూడా ఎక్కువ అవుతాయని కొందరు రోగులు చెబుతారు. అయితే, దీన్ని పూర్తిస్థాయిలో రుజువు చేసే శాస్త్రపరమైన ఆధారాలు మాత్రం ఇంకా లభించలేదు. గర్భిణులు కూడా వంకాయ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు
కాబట్టి, వంకాయ తినాలనుకునే వారు ఈ విషయాలను తెలుసుకుని జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి
ఇవి కూడా చదవండి:
అప్పడాలతో బీపీ ముప్పు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లల్లో రాత్రిళ్లు మాత్రమే కనిపించే సమస్యలు ఇవీ