Indian Snacks Health Risks: అప్పడాలతో బీపీ ముప్పు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ABN , Publish Date - Aug 31 , 2025 | 08:57 AM
భారతీయులు సాధారణంగా తినే స్నాక్స్‌తో అనారోగ్యం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీపీ, డయాబెటిస్‌తో పాటు చివరకు క్యాన్సర్ ముప్పు కూడా ఎక్కువవుతుందని చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సమోసా, టీ, భుజియా, అప్పడాలు.. ఇలా భారతీయులకు ఎన్నెన్నో స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి. కొందరు వీటిని రోజూ తింటూనే ఉంటారు. అయితే, ఇవన్నీ సైలెంట్‌గా అనారోగ్యాల ముప్పును పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అప్పడాలంటే తెలియని భారతీయ కుటుంబం ఉండదంటే అతిశయోక్తి కాదు. కానీ, వీటిల్లో సోడియం అధికంగా ఉంటుంది. ఇది బీపీ పెరిగేలా చేసి గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. తరచూ వీటిని తినే వారికి హృద్రోగాల ముప్పు పెరుగుతుంది.
చాలా మందికి భుజియా అంటే ప్రాణం. కుదిరినప్పుడల్లా రెండు పలుకులు నోట్లో వేసుకుంటుంటారు. కానీ ఇందులోనూ నూనె, రిఫైన్డ్ పిండి, ఉప్పు ఎక్కువగా ఉంటాయి. దీంతో, కొలెస్టరాల్ పెరిగి ఊబకాయం ముప్పు ఎక్కువవుతుందని నిపుణులు చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా మెజారిటీ జనాలకు నచ్చే వంటకం జిలేబీ. అయితే, వీటిల్లో చక్కెరతో పాటు ట్రాన్స్ ఫ్యాట్స్ కూడా అధికంగా ఉంటాయి. ఫలితంగా, ఇన్సులీన్ రెసిస్టెన్స్, ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ ముప్పు పెరుగుతుంది.
సమోసాలను కూడా రిఫైన్డ్ పిండితోనే చేస్తారు. వీటి వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, హృద్రోగాలు, ఊబకాయం ముప్పు ఊహించని స్థాయిలో పెరుగుతుంది.
చాలా మందికి భోజనం తరువాత పాన్ తినడం అలవాటు. ఈ అలవాటుతోనూ ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వక్కలకూ స్వల్పంగా క్యాన్సర్ కారక గుణాలు ఉంటాయని, చివరకు ఇవి నోటి క్యాన్సర్ వచ్చే ముప్పును పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు కారణంగా జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. ఇది అంతిమంగా జీవక్రియల వ్యవస్థను అతలాకుతలం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ రుచులను అప్పుడప్పుడూ ఆస్వాదిస్తే పరవాలేదు కానీ రోజూ ఇలాంటి ఫుడ్స్ తింటే మాత్రం ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము అనే అంశాలపై దృష్టి పెడితే రోగాల ముప్పును చాలా వరకూ తగ్గించుకోవచ్చని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
రాత్రిళ్లు 9 గంటల పాటు నిద్రపోతే ఆరోగ్యం మెరుగవుతుందా
కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లల్లో రాత్రిళ్లు మాత్రమే కనిపించే సమస్యలు ఇవీ