Vijayawada Traffic Restrictions: స్వాతంత్ర్య దినోత్సవం వేళ.. విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు
ABN , Publish Date - Aug 14 , 2025 | 08:03 PM
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విజయవాడ నగరం ముస్తాబవుతోంది. ఈ మేరకు పోలీస్ అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే నగరవ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతోంది. ఈ మేరకు రాష్ట్రమంతా జాతీయ జెండాలతో కళకళలాడుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో జెండా ఎగురవేసే నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 05 గంటల వరకూ ట్రాఫిక్‌ను వివిధ మార్గాలకు మళ్లించనున్నారు పోలీసులు. కంట్రోల్ రూమ్ వైపు నుంచి బెంజ్ సర్కిల్ వైపునకు వెళ్లే వాహనాలను ఆర్టీసీ వై జంక్షన్ నుంచి ఏలూరు రోడ్ మీదుగా చుట్టుగుంట –గుణదల –రామవరప్పాడు రింగ్ మీదుగా బెంజ్ సర్కిల్ వైపునకు మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు.
అలాగే.. బెంజ్ సర్కిల్ వైపు నుంచి బందర్ రోడ్డు వైపునకు వచ్చే వాహనాలను బెంజ్ సర్కిల్ నుంచి ఫకీర్‌గూడెం – స్క్యూ బ్రిడ్జ్ - నేతాజీ బ్రిడ్జ్ - బస్టాండ్ వైపుకి మళ్లించనున్నారు. రెడ్ సర్కిల్ నుంచి ఆర్టీఏ జంక్షన్, శిఖామణి సెంటర్ నుంచి వెటర్నరీ జంక్షన్ వరకు ఏ విధమైన వాహనములు అనుమతించబడవని అధికారులు స్పష్టం చేశారు.
కాగా, AA, A1, A2, B1, B2 పాస్ కలిగిన ప్రజలు నిర్దేశించిన మార్గాల్లో ఇందిరా గాంధీ స్టేడియంలోకి రావాలని అధికారులు సూచిస్తున్నారు. సాయంత్రం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. రేపు(ఆగస్టు) మధ్యాహ్నం 01:00 గంట నుంచి సాయంత్రం 05:00 గంటల వరకు బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డుల నుంచి పాత కంట్రోల్ రూమ్ వరకు ఆటోలకూ అనుమతులు లేవని అధికారులు ప్రకటన విడుదల చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్..
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ