Share News

PVN Madhav On Jagan: జగన్‌పై పీవీఎన్ మాధవ్ షాకింగ్ కామెంట్స్..

ABN , Publish Date - Sep 29 , 2025 | 04:17 PM

ఏపీలో కూటమి నేతృత్వంలో మంచి పాలన జరుగుతోందని మాధవ్ తెలిపారు. డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వడం మంచి పరిణామమని పేర్కొన్నారు. అందుకు కృషి చేసిన మంత్రి నారా లోకేష్‌‌కు అభినందనలు తెలిపారు.

PVN Madhav On Jagan: జగన్‌పై పీవీఎన్ మాధవ్ షాకింగ్ కామెంట్స్..
BJP AP President Madhav

ఢిల్లీ: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజుల్లో అనేక దేవాలయాలపై దాడులు జరిగాయని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో ఆలయాలు నిర్మిస్తే మీకేంటి ఇబ్బందని ఆయన ప్రశ్నించారు. టీటీడీ నిధులను ఆలయాల నిర్మాణం, ధార్మిక సంస్థల నిర్మాణం, ధూపదీప నైవేద్యాల కోసం ఉపయోగించుకుంటున్నారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం టీటీడీలో 434 గదులు కూల్చి రూ.600 కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. దేవాలయాలను కించపర్చడంలో దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి కుటుంబం మొదటి నుంచీ ఇదే వైఖరి ప్రదర్శిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పరిపాలనలో జరిగిన అవినీతిపైనా విచారణ జరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు.


ఏపీలో కూటమి నేతృత్వంలో మంచి పాలన జరుగుతోందని మాధవ్ తెలిపారు. డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వడం మంచి పరిణామమని పేర్కొన్నారు. అందుకు కృషి చేసిన మంత్రి నారా లోకేష్‌‌కు అభినందనలు తెలిపారు. పెట్టుబడులకు మంచి అవకాశంగా అమరావతి ఉందని పేర్కొన్నారు. గ్రీన్ హైడ్రోజన్ పనులు నడుస్తున్నాయని వివరించారు. కొత్తగా కొన్ని పోర్టుల నిర్మాణాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తామంటూ.. పోలీసులు, కాంట్రాక్టర్లను బెదిరించడం మంచిది కాదని హెచ్చరించారు. జగన్ వైఖరి మారకపోతే వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావని హితవు పలికారు. జగన్ వైఖరిని అన్నివర్గాల ప్రజలు ఖండించాలని పిలుపునిచ్చారు.


బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేశామని మాధవ్ గుర్తు చేశారు. సెప్టెంబర్ 14వ తేదీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించామని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌‌లో అనేక కార్యక్రమాలు ప్రభావవంతంగా ముందుకు తీసుకెళ్లామని అన్నారు. తమ ప్రాంతంలో ఉన్న సంచార జాతులకు హక్కులను కల్పించే స్ఫూర్తిగా కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. విశ్వకర్మ విగ్రహాన్ని రాజధానిలో ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడుని కోరినట్లు చెప్పారు. గుర్రం జాషువా జయంతి పెద్దఎత్తున నిర్వహించినట్లు స్పష్టం చేశారు. గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఖాదిసంతల పేరిట ఖాదీ చేనేత వస్త్ర కళలకు సంబంధించిన స్వదేశీ మేళా నిర్వహించనున్నట్లు మాధవ్ పేర్కొన్నారు.


కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ఖాదీ వస్త్రాల సంత నిర్వహిస్తామని పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2న విజయవాడలో నిర్వహించే ఖాదీ వస్త్రాల ప్రారంభోత్సవానికి రాబోతున్నారని తెలిపారు. ఆ సభలో దేశానికి సంబంధించిన వస్తువులను కొనాలని సీఎం పిలుపునిస్తారని పేర్కొన్నారు. జీఎస్టీ 2.0తో ముందే దసరా, దీపావళి వచ్చిందని చెప్పుకొచ్చారు. జీఎస్టీ తర్వాత తగ్గిన ధరల పట్టికలను షాపుల ముందు డిస్‌ప్లే చేసే విధంగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మాధవ్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

విజయ్ పార్టీ నాయకులపై కేసులు నమోదు

ఆసియా కప్‌ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించిన భారత్‌

Updated Date - Sep 29 , 2025 | 06:00 PM