Home Minister Anitha: అసత్య ప్రచారాలు కొనసాగితే.. 11 సీట్లు కూడా మిగలవు...
ABN , Publish Date - Sep 12 , 2025 | 06:32 PM
ఏపీలో కళాశాలల నిర్మాణాలు లేకుండా ఆహా అనేలా 17 వైద్య కళాశాలలు కట్టేశామని చెప్పుకోవడం మాజీ సీఎం జగన్‌కే చెల్లిందని హోమ్ మంత్రి అనిత విమర్శించారు. 17 వైద్య కళాశాలలు నిర్మించానని చెప్తున్న జగన్ వాటి క్షేత్రస్థాయి పర్యటనకు రాగలరా..? అని ప్రశ్నించారు.
అమరావతి: లండన్ మందులు వేసుకోకుండా మెడికల్ కళాశాలల గురించి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. బెంగుళూరులో ఫుల్ టైమ్ ఉంటూ.. ఏపీకి పార్ట్ టైమ్ వస్తున్న జగన్.. అక్కడి నుంచి బురద తెచ్చి ప్రభుత్వంపై చల్లుతున్నారని ఆరోపించారు. వైద్య కళాశాలల పీపీపీ మోడల్ నిర్మాణంపై ప్రజల్ని భయపెట్టే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు హోమ్ మంత్రి ఇవాళ (శుక్రవారం) మీడియాతో మాట్లాడారు.
ఏపీలో కళాశాలల నిర్మాణాలు లేకుండా ఆహా అనేలా 17 వైద్య కళాశాలలు కట్టేశామని చెప్పుకోవడం మాజీ సీఎం జగన్‌కే చెల్లిందని హోమ్ మంత్రి అనిత మండిపడ్డారు. 17 వైద్య కళాశాలలు నిర్మించానని చెప్తున్న జగన్ వాటి క్షేత్రస్థాయి పర్యటనకు రాగలరా..? అని ప్రశ్నించారు. జగన్ కళాశాలలు కట్టానని చూపించేందుకు సిద్ధమైతే పోలీసు భద్రతతో తానే ఆయన్ను అక్కడికి తీసుకెళ్తానని వివరించారు. ఈ నేపథ్యంలో జగన్ ఆహా అనేలా నిర్మించిన వైద్య కళాశాలల్ని ప్రజలు చూడాలంటూ.. వైద్య కళాశాలల నిర్మాణ స్థితిగతులపై ఆమె వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు.
మొండి గోడల నుంచి ఇంటికో వైద్యుడిని తీసుకోస్తానని చెప్తున్న జగన్‌ను ఏమనాలని హోమ్ మంత్రి అనిత విమర్శించారు. తాను దేనినైనా మసిపూసి మారేడుకాయ చేయగలనని జగనే చెప్పుకుని అడ్డంగా దొరికిపోయారని పేర్కొన్నారు. పీపీపీ మోడల్‌ని జగన్ ప్రైవేటు పార్టనర్ షిప్ (జేపీపీ)గా భావిస్తున్నాడేమో అని అనుమానం వ్యక్తం చేశారు. పీపీపీ మోడల్ వల్ల ఏ ఒక్క సీటు కూడా పేదలకు తగ్గదని తేల్చి చెప్పారు. తొందరగా కళాశాలల నిర్మాణం జరిగి ప్రజలకు అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో నిబంధనల ప్రకారం ఉన్న పీపీపీ విధానాన్ని ఎంచుకున్నామని ఆమె స్పష్టం చేశారు. జగన్ చేసిన పాపాలకు కొత్త అడ్మిషన్లు కూడా ఇంతవరకు రాలేదని ఆరోపించారు.
వైద్య విద్యను సామాన్యులకు ఎంత మేర దూరం చేయాలో అంతమేర జగన్ దూరం చేశారని అనిత మండిపడ్డారు. సామాన్యులకు మెరుగైన వైద్య విద్య అందించాలనే కూటమి ప్రభుత్వ తపనను రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలా నల్ల నోటుకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీ తెలుగుదేశం కాదని ధీమా వ్యక్తం చేశారు. అసత్యాలు చెప్పినందుకే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు ప్రజలు సరిపెట్టారని గుర్తు చేశారు. ఇవే అసత్యాలు కొనసాగితే ఆ 11 కూడా మిగలవని హెచ్చరించారు. పగటి కలలు కంటూ.. మేకపోతు గాంభీర్యంతో మళ్లీ అధికారంలోకి వస్తానని జగన్ చెప్తున్నారని హోమ్ మంత్రి అనిత ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్