CM Nara Chandrababu: ఏపీ పరిశ్రమల రూపురేఖలు మారుతున్నాయి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:25 AM
తాము అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాయలసీమలో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీలకు శంకుస్థాపన చేశామని వివరించారు.
విశాఖపట్నం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): రేమాండ్ గ్రూప్ దేశ ఏరోస్పేస్, రక్షణ అవసరాలను తీర్చేలా పరికరాలు తయారు చేయటం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ఇవాళ(శనివారం) సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రేమాండ్ గ్రూప్ ప్రాజెక్టులకు వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాప్తాడులో రూ.497 కోట్ల వ్యయంతో సిల్వర్ స్పార్క్ అపరెల్ మాన్యుఫాక్చరింగ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నారని వివరించారు.
అనంతపురం జిల్లా గుడిపల్లిలో రూ.441 కోట్లతో ఆటో కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌ను కియాకు దగ్గరలోనే ఏర్పాటు చేయబోతున్నారని వెల్లడించారు. అనంతపురం జిల్లా టెకులోడు వద్ద రూ.262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్‌ను కూడా రేమాండ్ కంపెనీ ఏర్పాటు చేస్తోందని స్పష్టం చేశారు. మొత్తంగా రూ.1201 కోట్ల పెట్టుబడులతో మూడు వేర్వేరు పరిశ్రమల ద్వారా 6500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని ఉద్ఘాటించారు.
20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న లక్ష్యాన్ని వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలోనే చేరుకుంటామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని వెల్లడించారు. 2027 నాటికి ఈ మూడు ప్రాజెక్టులు ప్రారంభిస్తామని రేమాండ్ హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. రాయలసీమలో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీలకు శంకుస్థాపన చేశామని వివరించారు. కియా మోటార్స్ ఇప్పటికే ఉందని... ఏరోస్పేస్, డిఫెన్స్ కారిడార్లు వస్తున్నాయని స్పష్టం చేశారు. విమానాల వినియోగం పెరుగుతున్న దృష్ట్యా వాటి ఉత్పత్తి కూడా మరింత పెరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ మద్యం కుంభకోణం.. అనిల్ చోకరా అరెస్ట్
ఆర్ఐ సతీష్ కుమార్ హత్య కేసు.. ఏబీఎన్ చేతిలో ఎఫ్‌ఐఆర్ కాపీ
Read Latest AP News And Telugu News