Chandrababu CRDA Meeting: రాజకీయ కుట్రలను భగ్నం చేయాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ABN , Publish Date - Oct 08 , 2025 | 10:08 PM
కల్తీ లిక్కర్ తయారీని ఉపేక్షించొద్దని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రమంతటా.. నకిలీ మద్యం అని తప్పుడు ప్రచారంతో ప్రజలను భయపెడుతున్నారని పేర్కొన్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 53వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి నారాయణ, సీఎస్ కె.విజయానంద్, సీఆర్డీఏ, ఏడీసీ, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి 18 అంశాలపై సమావేశంలో చర్చించారు. అలాగే.. రాజ్ భవన్ నిర్మాణానికి పాలనా అనుమతితో పాటు హెచ్ఓడీ టవర్ల నిర్మాణంపై మాట్లాడారు.
వీటితో పాటు తాడేపల్లి పరిధిలో సీఆర్డీఏ జోన్లల్లో ఎస్టీపీల నిర్మాణాలు, రాజధాని నగరం వెలుపల చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, భూ లభ్యత, జోనింగ్ నిబంధనల్లో మార్పులు, చేర్పులు,హోటళ్ల పార్కింగ్ నిబంధనల్లో మార్పులపై మంత్రులకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. హ్యాపీనెస్ట్, ఏపీ ఎన్‌ఆర్‌టీ ప్రాజెక్టులకు సంబంధించి వివిధ ఫీజుల మినహాయింపులపైనా మంత్రులు, ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
కల్తీ లిక్కర్ తయారీని ఉపేక్షించవద్దు..
కల్తీ లిక్కర్ తయారీని ఉపేక్షించొద్దని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రమంతటా.. నకిలీ మద్యం అని తప్పుడు ప్రచారంతో ప్రజలను భయపెడుతున్నారని పేర్కొన్నారు. కల్తీ లిక్కర్‌తో ప్రాణాలు పోతున్నాయని ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మద్యం మరణాల ఆరోపణలపై విచారణ జరిపి, వాస్తవాలు బయటపెట్టాలని అధికారులకు సూచించారు. రాజకీయ కుట్రతో మరణాలపై తప్పుడు ప్రచారాలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. వైసీపీ నేతల రాజకీయ కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేయాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు.
ప్రెస్‌క్లబ్ ఆఫ్ అమరావతి వెబ్‌సైట్..
అనంతరం ప్రెస్‌క్లబ్ ఆఫ్ అమరావతి వెబ్‌సైట్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. రాజధానిలో మీడియా అవసరాలకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో.. జర్నలిస్టులు వెనుకంజ వేయకూడదని చంద్రబాబు సూచించారు.
ప్రధాని పర్యటన ఏర్పాట్లు..
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు మంత్రులకు, ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. శ్రీశైలంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలను ప్రధాని దర్శించుకోనున్నట్లు తెలిపారు. అనంతరం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో జరిగే జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా.. ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు.
Also Read:
కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ ఫ్రైజ్..
మాజీ సీఎం జగన్‌పై కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఫైర్..
అభ్యర్థుల ఖరారుకు బీజేపీ కీలస సమావేశం