CM Chandrababu: పర్యాటకం, లాజిస్టిక్స్ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 14 , 2025 | 01:10 PM
హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీని నిర్మించేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖ సదస్సు కేవలం పెట్టుబడులు, వాణిజ్య, వ్యాపారం, ఒప్పందాల కోసం మాత్రమే కాదని స్పష్టం చేశారు. ఈ సమ్మిట్ మేథోపరమైన చర్చలు, ఆవిష్కరణల గురించి కూడా అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
విశాఖపట్నం,నవంబరు14 (ఆంధ్రజ్యోతి): ఏపీలో పరిశ్రమలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేసే వారికి భూమి కొరత లేదని... వారికి వేగంగా భూములు కేటాయిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. పెట్టుబడులకు అనుకూలమైన 25 పాలసీలు రాష్ట్రంలో అమల్లో ఉన్నాయని వివరించారు. ఇవాళ(శుక్రవారం) విశాఖపట్నంలోని సీఐఐ పెట్టుబడుల సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. పెట్టుబడులకు అవసరమైన సంస్కరణలు కూడా తెచ్చామని స్పష్టం చేశారు. పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాల కోసం ఏపీలో ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సావరిన్ గ్యారంటీని కూడా ఇస్తామని స్పష్టం చేశారు.
20 లక్షల ఉద్యోగాలు..
కేవలం 17 నెలల్లో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని ఉద్ఘాటించారు. ఏపీ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కూడా దక్కుతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం 0.5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు, 50 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని నొక్కిచెప్పారు. వచ్చే పదేళ్లలో వన్ ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షిస్తామనే విశ్వాసం తమకుందని పేర్కొన్నారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీని నిర్మించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. ఈ సదస్సు కేవలం పెట్టుబడులు, వాణిజ్య, వ్యాపారం, ఒప్పందాల కోసం మాత్రమే కాదని స్పష్టం చేశారు. ఈ సమ్మిట్ మేథోపరమైన చర్చలు, ఆవిష్కరణల గురించి కూడా అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
దేశంలోనే సుందరమైన నగరం విశాఖ...
‘దేశంలోనే సుందరమైన నగరం విశాఖపట్నం. ఈ నగరాన్ని సురక్షిత నగరంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. డైనమిక్, సృజనాత్మకత కలిగిన నాయకుడు. దేశానికి గేట్‌వేలా ఆంధ్రప్రదేశ్ ఉంది. పెట్టుబడుదారుల లక్ష్యంగా ఏపీ మారుతోంది. మోదీ పాలనా సంస్కరణలను దేశ ప్రజలు నమ్మారు. మోదీ పరిపాలనపై దేశ ప్రజలకు విశ్వాసం ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ మోదీ ప్రభుత్వమే గెలుస్తుంది. దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు ఉన్నారు. 2047లోగా మనదేశం నెంబర్‌వన్ ఎకానమీ అవుతుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసే పరిస్థితి వచ్చింది. పేదరికం, అసమానతలు రూపుమాపేందుకు అనేక చర్యలు చేపట్టాం. గ్రీన్ ఎనర్జీ వినియోగం, స్వచ్ఛాంధ్ర దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ఐటీలో మనవాళ్లే ముందున్నారు. ఏపీకి స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ వస్తున్నాయి. ఏపీకి క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ వస్తున్నాయి. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీలో మన రాష్ట్రమే ముందుంది. వనరులు సమర్థంగా వాడుకుంటే ఏపీ అభివృద్ధికి ఆకాశమే హద్దు. మరో రెండేళ్లలో డ్రోన్ ట్యాక్సీలు వస్తాయి. ఏపీ అభివృద్ధిలో పర్యాటక రంగానిది కీలకపాత్ర. అరకు కాఫీని అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహిస్తున్నాం. మరో మూడేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేది మా లక్ష్యం. ఏపీకి పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు రావాలనేదే మా లక్ష్యం. 522 మంది విదేశీ ప్రతినిధులు, 72 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. 2,500 మంది పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
భారత్‌లో పెట్టుబడులకు గేట్ వేగా ఏపీ..
‘భారత్‌లో పెట్టుబడులకు గేట్ వేగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించటంలో భారత్ ఇప్పుడు అగ్రగామిగా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం. రియల్ టైమ్‌లో అనుమతులు ఇవ్వటంతో పాటు వేగంగా పరిశ్రమలు నిర్మించేలా చూస్తున్నాం. పది సూత్రాల ఆధారంగా దేశంలో పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలను భారతీయులే నడిపిస్తున్నారు. డ్రోన్, ఎలక్ట్రానిక్, ఏరోస్పేస్, స్పేస్, సెమీ కండక్టర్స్, డిఫెన్స్ కారిడార్లను ఏర్పాటు చేసి రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. ఏపీలో త్వరలోనే క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్లకు అవసరమైన పరికరాలను కూడా ఉత్పత్తి చేసేలా ప్రయత్నిస్తున్నాం. అలాగే గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా పనిచేస్తున్నాం. సౌర, పవన, పంప్డ్ ఎనర్జీలతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాం. ఆర్ధిక వ్యవస్థలను నిర్మించటంతో పాటు సంపద సృష్టించటంలో కలసి పనిచేద్దామని పిలుపునిస్తున్నా. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఆర్గానిక్ ఉత్పత్తులు, పర్యాటకం ఇలా వేర్వేరు రంగాల్లో అపారమైన అవకాశాలను వినియోగించుకోవాలని పారిశ్రామికవేత్తలను కోరుతున్నా’ అని సీఎం చంద్రబాబు సూచించారు.
డీప్ టెక్నాలజీ రంగంలోనూ విస్తృత అవకాశాలు..
‘గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తోంది. డీప్ టెక్నాలజీ రంగంలోనూ విస్తృత అవకాశాలు ఏపీలో ఉన్నాయి. ఏరో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేసి ప్రోత్సాహం అందిస్తున్నాం. త్వరలోనే ఏపీ నుంచి డ్రోన్ టాక్సీలను ప్రారంభిస్తాం. ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్ అపారంగా ఉన్నాయి. ఈ రంగంలో పెట్టుబడులకు ఆస్కారం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం, లాజిస్టిక్స్ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి. పోర్టులు, డ్రైపోర్టులు, అంతర్గత జలరవాణా, హెల్త్ కేర్ తదితర రంగాల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకోవచ్చు. అగ్రిటెక్, ఈవీ టెక్ లాంటి రంగాల్లో పెట్టుబడులకు కూడా విస్తృతమైన అవకాశాలను వినియోగించుకోవాలి. విశాఖలో వాణిజ్యపరమైన ఎగ్జిబిషన్లు, ప్రదర్శనలకు వీలుగా ఐటీపీఓ ద్వారా ఆంధ్రా మండపం నిర్మించేందుకు స్థలం కేటాయిస్తామని హామీ ఇస్తున్నాం. భారత్ మండపం తరహాలోనే ఆంధ్రా మండపం నిర్మాణానికి స్థలం కేటాయిస్తాం. విశాఖ వచ్చిన వారికి అరకు లాంటి ప్రాంతాలను కూడా సందర్శించాలి. అలాగే స్థానిక గిరిజనులు పండిస్తూ గ్లోబల్ బ్రాండ్‌గా మారిన అరకు కాఫీని, స్థానిక ఆక్వా రుచులని ఆస్వాదించాలి’ అని సీఎం చంద్రబాబు కోరారు.
ఇవి కూడా చదవండి...
దేశానికి గ్రోత్ ఇంజన్‌గా ఏపీ: మంత్రి నారా లోకేష్
విశాఖలో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం
Read Latest AP News And Telugu News