Mobile Call Diversion Scam: మరో కొత్త స్కాం.. వెలుగులోకి సంచలన విషయాలు
ABN , Publish Date - Dec 08 , 2025 | 07:54 AM
సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆపదలో ఉన్నాడని పాపం తలచి ఫోన్ ఇస్తే అకౌంట్లలోని నగదును కాజేసే వినూత్న సైబర్ నేరాలకు పాల్పడేవారు తారసపడుతున్నారు. ముఖ్యంగా వయస్సు మళ్లిన వారు కీప్యాడ్ ఫోన్లు వాడుతుంటారు.
సెల్‌ఫోన్ నుంచి నగదు బదిలీ చేసుకున్న వ్యక్తి అరెస్ట్
వినూత్న రీతిలో సైబర్ నేరాలు
అప్రమత్తంగా ఉండాలని కోరిన సీఐ ప్రసాద్
కాల్ చేసుకుంటానంటూ కాజేశాడు
చీమకుర్తి, డిసెంబర్ 6 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరాలు (Cyber crimes) కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆపదలో ఉన్నాడని పాపం తలచి ఫోన్ ఇస్తే అకౌంట్లలోని నగదును కాజేసే వినూత్న సైబర్ నేరాలకు పాల్పడేవారు తారసపడుతున్నారు. ముఖ్యంగా వయస్సు మళ్లిన వారు కీప్యాడ్ ఫోన్లు వాడుతుంటారు. అలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని వారి వద్ద నుంచి అర్జంట్‌గా ఒక కాల్ చేసుకుంటానని ఫోన్ తీసుకొని వారి బ్యాంకు అకౌంట్ల నుంచి నగదును కాజేసిన సైబర్ నేరగాడిన చీమకుర్తి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను శనివారం చీమకుర్తి పోలిస్‌స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐ దాసరి ప్రసాద్ తెలియజేశారు.
మండలంలోని బక్కిరెడ్డిపాలెంకు చెందిన వీరపల్లి వెంక య్య(63) పనిమీద మర్రిచెట్లపాలెం వెళ్లగా అక్కడ ఆయనకు ఎటువంటి పరిచయం లేని నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాలెంకు చెందిన ఆదిపూడి వెంకటశేషయ్య అర్జంట్‌గా మాట్లాడాలి అని చెప్పి ఆయన ఫోన్ తీసుకున్నాడు. మాట్లాడుతున్నట్లుగా నటించి ఫోన్‌లోని కాల్ డైవర్ట్ ఆప్షన్ ఎనేబుల్ చేసి తన నంబర్‌ను నమోదు చేశాడు. తర్వాత దానిని ఆపరేట్ చేస్తూ ఓటీపీలను సేకరించి అకౌంట్‌లోని నగదును నొక్కేసి బెట్టింగ్‌ల యాప్‌లలో పెట్టి సొమ్ము చేసుకున్నాడు. దాదాపు రూ.5లక్షలకుపైగా సొమ్మును అకౌంట్ నుంచి బదిలీ చేసుకోగా, ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన వెంకయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీస్ ఐటీ టీం సహకారంతో కేసును ఛేదించిన చీమకుర్తి పోలీసులు నిందితుడు వెంకటశేషయ్యను అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరిచారు. ఇలాంటి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ ప్రసాద్ ప్రజలను కోరారు.
నకిలీ బంగారాన్ని తాకట్టుపెట్టి సొమ్ము చేసుకుంటున్న వ్యక్తి అరెస్ట్
బంగారం దుకాణాల్లో నకిలీ బంగారాన్ని తాకట్టుపెట్టి మోసం చేసిన వ్యక్తిని చీమకుర్తి పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనా వివరాలను సీఐ ప్రసాద్ తెలిపారు. చీమకుర్తి పట్టణంలోని పిడతలపూడి రోడ్డులో ఉన్న ధనలక్ష్మి గోల్డ్‌హౌస్‌లో నెల్లూరు జిల్లాకు చెందిన కె.వెంకటేశ్వరరావు నకిలీ బంగారాన్ని తీసుకొచ్చి తనకు అర్జంట్‌గా డబ్బులు కావాలని చెప్పి తాకట్టు పెట్టి సొమ్ము తీసుకున్నాడు. తదుపరి విషయం తెలుసుకున్న యజమాని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించగా సీసీ పుటేజి ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం: పవన్ కల్యాణ్
గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి
Read Latest AP News and National News