Pattabhiram Slams YS Jagan: జగన్ పాలనలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి..
ABN , Publish Date - Sep 06 , 2025 | 06:15 PM
గత ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో వైద్యశాఖ తీవ్రంగా దెబ్బతిన్నట్లు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. దాని పర్యవసానాలను కోవిడ్ సమయంలో అందరూ ప్రత్యక్షంగా అనుభవించారని చెప్పుకొచ్చారు.
అమరావతి: వైద్య రంగం నిధులను దోపిడి చేసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన ధన దాహాన్ని తీర్చుకున్నారని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా భ్రష్టుపడ్డ.. అనేక వ్యవస్థలను తిరిగి స్థాపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తీవ్ర కృషి జరుగుతోందని తెలిపారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అవినీతి దాహానికి బలి అయిపోయిన రంగాలను కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని ధీమా వ్యక్తం చేశారు.
వైద్యరంగం నిర్లక్ష్యం.
గత ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో వైద్యశాఖ తీవ్రంగా దెబ్బతిన్నట్లు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. దాని పర్యవసానాలను కోవిడ్ సమయంలో అందరూ ప్రత్యక్షంగా అనుభవించారని చెప్పుకొచ్చారు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో చంద్రబాబు రాష్ట్రానికి 22 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. జగన్ రెడ్డి ఐదు సంవత్సరాలలో కేవలం ఐదు కాలేజీలను మాత్రమే తెచ్చారని విమర్శించారు. అవి కూడా నిర్మాణాలు పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి అసంపూర్ణంగా వదిలిపోయిన కాలేజీ నిర్మాణాలను కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తోందని స్పష్టం చేశారు. ఇంకా అదనంగా 10 కొత్త మెడికల్ కాలేజీలను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య(PPP) మోడల్‌లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
జగన్ ఊరువాడా డప్పు కొడుతున్నారు..
అయితే.. 17 మెడికల్ కాలేజీలు తెచ్చానని ఊరువాడా డప్పు కొట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డి రూ.8,480 కోట్లకు గాను కేవలం రూ.1,451 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. ఇందులో రూ.975 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందించిందని పేర్కొన్నారు. జగన్ రెడ్డి నియోజకవర్గం పులివెందుల కాలేజీకి రూ.168 కోట్లు పెండింగ్ వర్క్స్ ఉన్నాయని తెలిపారు. జాతీయ వైద్య మండలి(NMC) పాడేరు, మార్కాపూరు, మదనపల్లి, ఆదోని, పులివెందుల్లోని కళాశాలల నిర్మాణాలపై అసంతృప్తి వ్యక్తం చేసిందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి..
ముంబైను పేల్చేస్తామన్న వ్యక్తి 24 గంటల్లో అరెస్టు
అన్నాడీఎంకేలో ముదిరిన విభేదాలు.. సెంగోట్టియన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించిన ఈపీఎస్