Lanka Dinkar: కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లంకా దినకర్ లేఖ...
ABN , Publish Date - Aug 12 , 2025 | 07:59 PM
కార్పొరేట్ సామాజిక బాద్యత నిధుల వినియోగం - కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(CSR) నిధులను సమర్థవంతంగా వినియోగించడంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) సర్సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన ప్రకటనను మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
న్యూఢిల్లీ: కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఏపీ 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ లేఖ రాశారు. అణగారిన వర్గాల ప్రజలకు అవసరమైన విద్యా మౌలిక సదుపాయాల ఆధునీకరణ, నైపుణ్యాభివృద్ధి కోసం, కార్పొరేట్ సామాజిక బాద్యత నిధుల వినియోగం సంబంధించిన వాటి కోసం లేఖ రాస్తున్నట్లు ఆయన తెలిపారు.
కార్పొరేట్ సామాజిక బాద్యత నిధుల వినియోగం - కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(CSR) నిధులను సమర్థవంతంగా వినియోగించడంపై RSS సర్సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన ప్రకటనను మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల నైపుణ్యాలు, విజ్ఞానాన్ని పెంపొందించడానికి కీలకమైన ప్రాధాన్యతగా విద్య కోసం ప్రభుత్వం వినియోగించే నిధులతో కార్పొరేట్ సామాజిక బాద్యత నిధుల వినియోగం అవసరమన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(CSR) నిధులను అనుసంధానం కోసం ఇచ్చిన సలహాకు ఆచరణ అత్యంత అవశ్యకమని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ప్రభుత్వ విద్యా రంగంలో ముఖ్యమైన పీఎం శ్రీ, సమగ్ర శిక్షా అభియాన్ మొదలైన కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాటి ద్వారా పాఠశాలల మౌలిక సదుపాయాలు ఇతర సౌకర్యాల పెంపుదలకు ఇప్పటికే అత్యధిక ప్రాధాన్యత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. జాతీయ విద్యా విధానం(NEP), నైపుణ్యాభివృద్ధి చొరవలకు అనుగుణంగా CSR నిధులను సమర్థవంతంగా అమలు చేయడం పరివర్తనాత్మక ఫలితాలను ఇస్తుందని చెప్పుకొచ్చారు.
ఆధునిక మౌలిక సదుపాయాలతో వెనుకబడిన, ఆకాంక్షిత జిల్లాల్లో పాఠశాలలను స్థాపించడం, ఆధునీకరణ చేయడం వంటివి ఈ నిధుల వినియోగంలో పరిగణనలోకి వస్తాయని లంకా దినకర్ వివరించారు. పట్టణ-గ్రామీణ విద్య అంతరాన్ని తగ్గించడానికి డిజిటల్ అభ్యాస సాధనాలు, ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలన్నారు. గ్రామీణ యువతలో ఉపాధి నైపుణ్యాలను పెంపొందించడానికి వృత్తి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతిభావంతులైన, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్ కార్యక్రమాల చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పథకాలతో పాటు, మంచి ఫలితాల కోసం CSR నిధులను వ్యూహాత్మకంగా మళ్లిస్తే, విద్య, నైపుణ్య అభివృద్ధిపై సానుకూల ప్రభావం వల్ల ఈ రంగంలో గణనీయంగా వృద్ధి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందువల్ల కార్పొరేట్లు తమ CSR నిధుల వినియోగంలో ఎక్కువ భాగాన్ని విద్య, నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చేలా ప్రోత్సహించడానికి నిర్దిష్ట మార్గదర్శకాలు, ప్రోత్సాహకాలను రూపొందించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని తాను కోరుకుంటున్నట్లు లేఖలో రాసుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పం వికసిత్ భారత్ 2047 కోసం ఇరవై సూత్రాల కార్యక్రమ అమలు చైర్మెన్‌గా ఇటువంటి కార్యక్రమాల అమలుకు అవసరమైన సంస్కరణలకు మద్దతు ఇవ్వడానికి తాను కట్టుబడి ఉన్నట్లు లంకా దినకర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు