AP Onion Farmers: ఉల్లి సాగు విస్తీర్ణం పెరిగినా.. దిగుబడులు తగ్గి రైతుల కష్టాలు
ABN , Publish Date - Sep 25 , 2025 | 08:03 AM
కర్నూలు జిల్లాలో ఉల్లి (Onion) సాధారణ సాగు విస్తీర్ణం 45,278 హెక్టార్లు. ఈ ఏడాది ఈ-క్రాప్ రికార్డుల ప్రకారం 52,306 ఎకరాల (20,923 హెక్టార్లు)లో సాగు చేశారు. ఈ నెఖారుల వరకు ఈ-క్రాప్ నమోదుకు అవకాశం ఉండటంతో మరో 2-3 వేల ఎకరాలు పెరిగే అవకాశం ఉందని ఉద్యాన శాఖ అధికారుల అంచనా వేశారు.
ధరలు పతనమై నష్టపోయిన ఉల్లి రైతులు
మద్దతు ధర రూ.1,200 ప్రకటించిన ప్రభుత్వం
1.50 లక్షల క్వింటాళ్ల సేకరణ
రైతులకు బకాయిలు రూ.15.18 కోట్లు
ఉల్లి డబ్బు కోసం అన్నదాతల నిరీక్షణ
రూ.50 వేల సాయం కోసం ఎదురుచూపు
కర్నూలు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో ఉల్లి (Onion) సాధారణ సాగు విస్తీర్ణం 45,278 హెక్టార్లు. ఈ ఏడాది ఈ-క్రాప్ రికార్డుల ప్రకారం 52,306 ఎకరాల (20,923 హెక్టార్లు)లో సాగు చేశారు. ఈ నెఖారుల వరకు ఈ-క్రాప్ నమోదుకు అవకాశం ఉండటంతో మరో 2-3 వేల ఎకరాలు పెరిగే అవకాశం ఉందని ఉద్యాన శాఖ అధికారుల అంచనా. పంట దిగుబడులు చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలకు ఉల్లి దిబ్బతిని దిగుబడి కూడా భారీగా తగ్గిపోయింది. చేతికొచ్చిన అరకొర పంట దిగుబడులు అమ్మడానికి కర్నూలు మార్కెట్‌కు వస్తే.. ధరలు పతనమై కష్టజీవులు కన్నీళ్లు పెట్టారు. క్వింటా కనిష్ఠంగా రూ.వంద కూడా పలకని పరిస్థితి.
మట్టిలో పోసిన పెట్టుబడి, భార్యపిల్లలు పొలంలో చేసిన కష్టం దేవుడెరుగు.. పంట కోత, రవాణా ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో పలువురు రైతులు పొలంలోనే వదిలేశారు. ఉల్లి రైతుల కన్నీటి వ్యథలను ఆంధ్రజ్యోతి వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చింది. కూటమి ప్రభుత్వం స్పందించి ఉల్లి రైతులకు అండగా నిలబడింది. మద్దతు ధర క్వింటాకు రూ.1,200 ప్రకటించింది. ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. పెట్టుబడిలో కొంతైనా చేతికొస్తుందని, చేసిన అప్పుకు వడ్డీలైనా చెల్లించవచ్చని ఉల్లి దిగుబడులు మార్కెట్‌కు తీసుకొచ్చారు. సాగు పెట్టుబడి కాదని పంట కోత, రవాణా కోసం ఎకరాకు రూ.35-40 వేల వరకు అప్పులు చేశారు.
కొన్న ఉల్లికి డబ్బుల కోసం..
కర్నూలు మార్కెట్ యార్డులో ఆగస్టు 31న మద్దతు ధర రూ.1,200 ప్రకారం ఏపీ మార్క్‌ఫెడ్ నేరుగా ఉల్లి కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. అదే క్రమంలో మార్కెట్ యార్డు లైసెన్స్‌డ్ వ్యాపారులు పర్చేజ్ డిఫరెంట్ ప్రైజ్ స్కీం (పీడీపీఎస్) కింద కొనుగోలు చేసిన ఉల్లి ధరపై వ్యత్యాసం అమౌంట్ (ఉదా: వ్యాపారికి క్వింటా రూ.350కు కొనుగోలు చేస్తే మిలిగిన వ్యత్యాసం డబ్బులు రూ.950 ప్రభుత్వం ఇచ్చేలా) ప్రభుత్వం చెల్లిస్తుంది. ఏపీ మార్క్‌ఫెడ్ 69,390 క్వింటాళ్లు (6,939 మెట్రిక్ టన్నులు) కొనుగోలు చేసింది. రూ.8.12 కోట్లు, వ్యాపారులు పీడీపీఎస్ కింద 80,230 క్వింటాళ్లు (8,023 మెట్రిక్ టన్నులు) కొనుగోలు చేశారు.
వ్యత్యాసం (డిఫరెంట్) అమౌంట్ రూ.7.06 కోట్లు కలిపి రూ.15.18 కోట్లు ఉల్లి రైతులకు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం రూ.2 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో జమ చేశారు. పంట అమ్ముకొని 15-20 రోజులు గడిచినా ఉల్లి డబ్బులు రాకపోవడంతో పంట కోత, రవాణా ఖర్చులకు చేసిన అప్పులు కూడా చెల్లించలేక కష్టజీవులు కన్నీరు పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే ఉల్లి కొనుగోలు డబ్బులు చెల్లించడంతో పాటు ఇకపై కొనుగోలు చేసే ఉల్లికి అదే రోజు డబ్బులు చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఉల్లి కొనుగోలు చేసిన డబ్బులే సకాలంలో ఇవ్వడం లేదు.. హెక్టారుకు రూ.50 వేలు సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ డబ్బులు ఎప్పుడిస్తారో..? అని ప్రశ్నిస్తున్నారు.
క్వింటా ఉల్లికి రెండు వందలు ధరలేదు..
‘రెండెకరాల్లో ఉల్లి సాగు చేస్తే 250 బస్తాలు (125 క్వింటాళ్లు) దిగుబడి వచ్చింది. క్వింటా రూ.రెండు, మూడు వందలు కూడా పలకకపోవడంతో చేనులోనే వదిలేద్దామనుకున్నా.. ప్రభుత్వమోళ్లే కింటాలు రూ.1,200లకు కొంటుదని చెప్పారు.. పెట్టుబడిలో కొంతైనా చేతికొస్తుందనే ఆశతో పంటకోత, రవాణా ఖర్చులకు మరో రూ.45 వేలు అప్పు చేసి కర్నూలు మార్కెట్‌కు తీసుకొచ్చాను. ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా కొన్నారు. నాకు రూ.1.25 లక్షలు రావాల్సి ఉంది. 15 రోజులైనా సొమ్ము రాలేదు. అప్పులు ఇచ్చినవారు మా ఇంటి చుట్టూరా తిరుగుతున్నారు. ఉల్లి అమ్మిన దుడ్లు ఎప్పుడిస్తారో ఏమో..’
- సి.బెళగల్ మండలం తిమ్మందొడ్డి గ్రామానికి చెందిన ఓ రైతు ఆవేదిన ఇది.
ఈ వార్తలు కూడా చదవండి
అది నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: మంత్రి లోకేష్
మీ వాదనలో నిజం ఉంటే సభకు రా.. జగన్‌కు మంత్రి సవాల్
For More Andhra Pradesh News and Telugu News..