Share News

Dasara Banni Utsavam: కర్రల సమరం.. బన్ని ఉత్సవానికి సర్వం సిద్ధం..

ABN , Publish Date - Oct 02 , 2025 | 09:28 PM

బన్ని ఉత్సవంలో భక్తులు చాలా మంది గాయపడుతుంటారు. ఇలా గాయపడిన భక్తులకు స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వైద్యం అందిస్తారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని పట్టణాలకు తరలిస్తారు.

Dasara Banni Utsavam: కర్రల సమరం.. బన్ని ఉత్సవానికి సర్వం సిద్ధం..
Dasara Banni Utsavam

కర్నూల్: దసరా పండుగ వేళ దేవరగట్టులో బన్ని ఉత్సవాలకు సర్వసిద్ధం అయ్యింది. ఇవాళ(గురువారం) రాత్రి కర్రల సమరానికి సై.. అంటూ స్థానికులు తయారయ్యారు. ఈ మేరకు ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే.. ఇది దైవ కార్యం అయినప్పటికీ భక్తులు కర్రలతో తలపడి గాయాలపాలవ్వడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. దేవతామూర్తులను రక్షించుకునేందుకు మూడు గ్రామాల భక్తులు ఒకవైపు.. 7 గ్రామాల భక్తులు మరోవైపు ఉండి ఉత్సవంలో ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా కర్రలతో దాడి చేసుకుంటారు. ఈ దృశ్యం చూస్తున్న ప్రతి ఒక్కరిలో దడ పుట్టిస్తుంది.


కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో 800 అడుగుల ఎత్తైన కొండపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే దసరా సందర్భంగా దేవతామూర్తులను కాపాడుకోడానికి నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపు.. అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో హోరాహోరీగా తలపడతారు. ఉత్సవ మూర్తులు తమ గ్రామనికే దక్కాలంటూ కర్రలతో శబ్దం చేస్తూ.. పోటీ పడడంతో భక్తులకు తీవ్రగాయాలు అవుతుంటాయి. అయినా మళ్లీ వెంటనే బండారు(పసుపు) పూసుకుని అలాగే ఉత్సవంలో పాల్గొంటారు. ఈ కర్రల సమరం.. చూడటానికి భీకర యుద్ధాన్ని తలపిస్తుంది.


ఈ ఉత్సవంలో భక్తులు చాలా మంది గాయపడుతుంటారు. ఇలా గాయపడిన భక్తులకు స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వైద్యం అందిస్తారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని పట్టణాలకు తరలిస్తారు. చాలా మంది భక్తులు గాయాలపాలైన.. స్థానికంగా దొరికే బండారు (పసుపు) పూసుకుని ఎలాంటి చికిత్స పొందకుండానే మళ్లీ.. కర్ర సమరంలో పాల్గొంటారని అధికారులు తెలుపుతున్నారు. ఈ మేరకు ఉత్సవాలకు 800 మంది పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. మరోవైపు 100 నైట్ విజన్ సీసీ కెమెరాలు, 700 ఎల్ఈడీ లైట్లు అమర్చారు. 10 డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. 10 చెక్‌ పోస్టులు, వీడియో కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే.. ఈసారి బన్ని ఉత్సవాలకు దాదాపు రెండు లక్షల మందికి పైగా తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Ind-China Flight Service: కుదిరిన అంగీకారం.. భారత్, చైనా మధ్య ఈ నెలాఖరు నుంచీ..

President Murmu At Red Fort Dasara: ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్

Updated Date - Oct 02 , 2025 | 10:06 PM