Share News

Ind-China Flight Service: కుదిరిన అంగీకారం.. భారత్, చైనా మధ్య ఈ నెలాఖరు నుంచీ..

ABN , Publish Date - Oct 02 , 2025 | 08:09 PM

డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను పునరుద్ధరించేందుకు చైనాతో అంగీకారం కుదిరినట్టు భారత విదేశాంగ శాఖ తాజాగా తెలిపింది. ఈ నెలాఖరు నుంచీ ఇరు దేశాల మధ్య ఫ్లైట్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

Ind-China Flight Service: కుదిరిన అంగీకారం.. భారత్, చైనా మధ్య ఈ నెలాఖరు నుంచీ..
India China direct flights

ఇంటర్నెట్ డెస్క్: దాదాపు అయిదేళ్లుగా భారత్, చైనాల మధ్య నిలిచిపోయిన వైమానిక సర్వీసుల పునరుద్ధరణ ముహూర్తం కుదిరింది. ఈ నెలాఖరు నుంచీ నేరుగా ఫ్లైట్ సర్వీసులు ప్రారంభించేందుకు భారత్, చైనాల పౌర విమానయాన శాఖల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ తాజాగా వెల్లడించింది. ఫ్లైట్ సర్వీసులకు సంబంధించి సాంకేతిక అంశాలపై ఇరు దేశాల అధికారులు కొన్ని నెలలుగా చర్చిస్తున్నారని విదేశాంగ శాఖ తెలిపింది (Ind-China Direct Flight Services).

నూతన ఒప్పందం ప్రకారం, ఇరు దేశాల్లోని ఎంపిక చేసిన ఎయిర్‌లైన్స్ నేరుగా విమాన సర్వీసులు నిర్వహించొచ్చు. సర్వీసుల పునఃప్రారంభంతో ప్రజల మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయి. ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి చేరుకునేందుకు మార్గం మరింత సుగమం అవుతుందని విదేశాంగ శాఖ తెలిపింది. డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు నిలిచిపోవడంతో భారత్- చైనాల మధ్య వాణిజ్యం, పర్యాటకం, విద్యా సంబంధిత అంశాలకు ఆటంకాలు ఏర్పడిన విషయం తెలిసిందే.


ఇక విదేశాంగ శాఖ ప్రకటన నేపథ్యంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ కీలక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 26 నుంచి చైనాకు నేరుగా ఫ్లైట్ సర్వీసులు నిర్వహిస్తామని తెలిపింది. కోల్‌కతా, గ్వాంగ్జో మధ్య ప్రతి రోజూ ఈ సర్వీసు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇందుకోసం ఇండిగో ఎయిర్‌బస్ ఏ-320 నియో మోడల్ విమానాలను వినియోగించనుంది. ఢిల్లీ, గ్వాంగ్జో మధ్య కూడా త్వరలో సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపింది.

చైనాలో ఇటీవల జరిగిన షాంఘై సహకార సదస్సుకు భారత ప్రధాని మోదీ హాజరైన నేపథ్యంలో ఈ ఒప్పందం కుదరడం విశేషం. అయితే, చైనా విషయంలో భారత్ ఇప్పటికీ అప్రమత్తంగా ఉందనేది విశ్లేషకులు చెబుతున్న మాట. భారత్‌పై ట్రంప్ 50 సుంకం విధించిన నేపథ్యంలో ఈ పరిణామానికి ప్రాధాన్యం ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక భౌగోళిక రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో భారత్, చైనాలు తమ మధ్య దౌత్యబంధాన్ని బలోపేతం చేసుకునేందుకు నడుం కట్టాయి.


ఇవి కూడా చదవండి:

లంచం కోసం కస్టమ్స్ అధికారుల వేధిస్తున్నారన్న లాజిస్టిక్స్ సంస్థ.. కార్యకలాపాల నిలిపివేత

భారత్‌లో ప్రజాస్వామ్యంపై హోల్‌సేల్ దాడి: రాహుల్ గాంధీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 02 , 2025 | 09:57 PM