Share News

Wintrack Inc Controversy: లంచం కోసం కస్టమ్స్ అధికారుల వేధిస్తున్నారన్న లాజిస్టిక్స్ సంస్థ.. కార్యకలాపాల నిలిపివేత

ABN , Publish Date - Oct 02 , 2025 | 04:23 PM

తమిళనాడుకు చెందిన ఓ లాజిస్టిక్స్ సంస్థ అకస్మాత్తుగా తన కార్యకలాపాలను నిలిపివేయడం సంచలనంగా మారింది. కస్టమ్స్ అధికారుల వేధింపులు తాళలేక ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ ఆరోపించడం కలకలానికి దారితీసింది.

Wintrack Inc Controversy: లంచం కోసం కస్టమ్స్ అధికారుల వేధిస్తున్నారన్న లాజిస్టిక్స్ సంస్థ.. కార్యకలాపాల నిలిపివేత
Wintrack shutdown India

ఇంటర్నెట్ డెస్క్: చెన్నై కస్టమ్స్ అధికారుల అక్రమాలను తాళలేక తమ కార్యకలాపాలు నిలిపివేస్తున్నామంటూ ఓ ఇంపోర్టు లాజిస్టిక్స్ సంస్థ చేసిన ప్రకటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తమిళనాడుకు చెందిన విన్‌ట్రాక్ సంస్థ (Wintrack) ఈ సంచలన ప్రకటన చేసింది. అక్టోబర్ 1 నుంచీ తమ కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ ఉదంతంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, ప్రముఖ వ్యాపారవేత్త మోహన్‌దాస్ పాయ్ కూడా స్పందించారు (Wintrack-Chennai Customs bribery allegations).

ఏమిటీ కాంట్రవర్సీ

విన్‌ట్రాక్ సంస్థ సోషల్ మీడియా వేదికగా చెన్నై కస్టమ్స్ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేసింది. అవినీతి వ్యవస్థాగతమైపోయిందని ఆరోపించింది. అధికారులు భారీగా లంచాలు అడుగుతుండటంతో తట్టుకోలేక తాము కార్యకలాపాలను ముగిస్తున్నట్టు పేర్కొంది. చెన్నై కస్టమస్స్ అధికారులు తమను నిరంతరం వేధిస్తున్నారని సంస్థ వ్యవస్థాపకుడు ప్రవీణ్ గణేశన్ ఆరోపించారు. కొందరు అధికారుల పేర్లను కూడా ప్రస్తావించారు. ఇందుకు సంబంధించి వాట్సాప్ చాట్స్‌ స్క్రీన్ షాట్స్‌ను కూడా షేర్ చేశారు. లాజిస్టిక్స్ సేవలు అందిస్తున్న విన్ ట్రాక్ సంస్థ చిన్న వ్యాపారాల దిగుమతులకు సాయం పడుతుంది. అలీ ఎక్స్‌ప్రెస్, అలీబాబా, లజాదా, షాపీ థాయ్‌లాండ్ వంటి సంస్థల నుంచి దిగుముతులకు వివిధ సేవలు అందిస్తుంది. 2021 నుంచి సంస్థ తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది.

అయితే, జూన్‌లోనే సంస్థ వ్యవస్థాపకుడు కస్టమ్స్ అధికారుల తీరుపై బహిరంగ విమర్శలు చేశారు. తాను దిగుమతి చేసుకున్న వస్తువులకు క్లియరెన్స్ ఇచ్చేందుకు అధికారులు లక్షన్నర రూపాయల లంచం డిమాండ్ చేశారని అన్నాడు. తాజాగా ఆగస్టులో మరోసారి ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. 45 రోజులుగా తాను వేధింపులను ఎదుర్కుంటున్నానని ఆరోపించిన విన్ ట్రాక్ తన కార్యకలాపాలను బంద్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో పేర్కొంది. కస్టమ్స్ అధికారులు లంచాలు అడుగుతున్న తీరును బహిరంగంగా ఎండగట్టినందుకు తమపై వేధింపులు మరింత పెరిగాయని, కార్యకలాపాలకు తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయని తెలిపింది.


ఆరోపణలను ఖండించిన కస్టమ్స్ అధికారులు

చెన్నై కస్టమ్స్ అధికారులు మాత్రం ఈ ఆరోపణలను తోసి పుచ్చారు. దిగుమతి చేసుకున్న వస్తువులకు సంబంధించి కొన్ని కీలక డాక్యుమెంట్స్‌ను సంస్థ సమర్పించలేదని అంటున్నారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం కంపెనీకి పరిపాటిగా మారిందని అన్నారు. బిల్టిన్ బ్యాటరీ ఉన్న యూఎస్‌బీ చార్జింగ్ కేబుల్స్‌కు సంబంధించి ఎక్స్‌టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ సరిస్టిఫికేట్ తప్పనిసరి అన్నారు. అయితే, కస్టమ్స్ అధికారులు నిబంధనలను రెట్రోస్పెక్టివ్‌గా అమలు చేస్తున్నారని కంపెనీ చెబుతోంది. ఈ ఉదంతంపై సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కూడా స్పందించింది. దిగుమతి చేసుకున్న వస్తువుల పూర్తి వివరాల వెల్లడి, వాటి వర్గీకరణకు సంబంధించిన వివాదమని పేర్కొంది. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది.

ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా స్పందించారు. దేశంలో వ్యవస్థాగతంగా మారిన అవినీతి వాణిజ్యానికి అడ్డంకిగా మారుతున్న వైనంపై ఆందోళన వ్యక్తం చేశారు. లంచాలు ఇచ్చుకోవడం వ్యాపారంలో ఓ భాగం అనుకుని చాలా కంపెనీలు సద్దుకుపోతున్నాయని అన్నారు. ఇక ఇన్ఫోసిస్ కోఫౌండర్ మోహన్‌దాస్ పాయ్ కూడా ఈ ఉదంతంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టారు.


ఇవి కూడా చదవండి:

విభిన్నతలను గౌరవించి జాతీయ ఐక్యతను బలోపేతం చేయాలి: RSS చీఫ్

నిలకడగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోగ్యం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 02 , 2025 | 04:39 PM