Share News

Rahul Gandhi: భారత్‌లో ప్రజాస్వామ్యంపై హోల్‌సేల్ దాడి: రాహుల్ గాంధీ

ABN , Publish Date - Oct 02 , 2025 | 06:14 PM

భారత్‌లో ప్రజాస్వామ్యంపై హోల్‌సేల్ దాడి జరుగుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అయితే, భారత్ భవిష్యత్తుకు ఢోకా లేదన్న విశ్వాసం తనకుందని కొలంబియాలోని ఈఐఏ యూనివర్సిటీలో తెలిపారు.

Rahul Gandhi: భారత్‌లో ప్రజాస్వామ్యంపై హోల్‌సేల్ దాడి: రాహుల్ గాంధీ
Rahul Gandhi Colombia Speech

ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు. దక్షిణ అమెరికా దేశం కొలంబియాలోని ఈఐఏ యూనివర్సిటీలో మాట్లాడిన ఆయన భారత్‌కు ప్రస్తుతం ఇదే పెద్ద ముప్పు అని అన్నారు. అయితే, భారత్‌కు ఉన్న సాంస్కృతిక వైవిధ్యత, సాంకేతిక సామర్థ్యం, వైద్య వ్యవస్థల కారణంగా దేశ భవిష్యత్తు ఎంతో ఆశాజనకంగా ఉందని అన్నారు (Rahul Gandhi on India's Risks).

‘ప్రస్తుతం భారత ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడే దేశానికి అతి పెద్ద ముప్పు. భారత్ అంటే వివిధ సంస్కృతులు, మతాలు, భావాల సమూహం. వీటి మధ్య చర్చకు చోటు ఉండాలి. ఇది ప్రజాస్వామ్యం ద్వారానే సాధ్యమవుతుంది. కానీ ప్రస్తుతం ప్రజాస్వామ్యంపై హోల్‌సేల్‌గా దాడి జరుగుతోంది. అది పెద్ద ముప్పు’ అని అన్నారు.


చైనా, భారత్‌ల పరిస్థితులపైనా రాహుల్ గాంధీ ప్రసంగించారు. ‘చైనా చేసినట్టు మనం చేయకూడదు. అక్కడ జనాల అణచివేత జరుగుతోంది. భారతదేశ పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదు’ అని అన్నారు. 2016 నాటి నోట్ల రద్దు నిర్ణయాన్నీ రాహుల్ గాంధీ విమర్శించారు. ‘వాళ్లు దేశంలో నగదుకు స్థానం లేకుండా చేయాలనుకున్నారు. విధానపరంగా చూస్తే నోట్ల రద్దు నిర్ణయం పెద్ద వైఫల్యం’ అని పేర్కొన్నారు.

ఇక అవినీతి నిర్మూలనకు అధికార వికేంద్రీకరణ తగిన పరిష్కారమని అన్నారు. అయితే, ప్రస్తుతం భారత్‌లో కేంద్ర స్థాయిలో అవినీతి చోటుచేసుకుంటోందని ఆరోపించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మూడు నాలుగు సంస్థల చేతుల్లో ఉందని చెప్పుకొచ్చారు. వీటికి ప్రధానితో నేరుగా సంబంధాలు ఉన్నాయని తెలిపారు.

కాగా, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ‘రాహుల్ వ్యాఖ్యలు తలవంపులు తెస్తున్నాయి. ఆయన ఎక్కడికెళ్లినా దేశ పరువు తీసేలా మాట్లాడుతున్నారని అందరికీ తెలుసు. ఇక్కడి వారు తగవులు పడతారని, నిజాయతీ లేదని అంటున్నారంటే భారతీయులకు బ్రెయిన్ లేదని చెబుతున్నట్టే’ అని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ కూడా కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి:

లంచం కోసం కస్టమ్స్ అధికారుల వేధిస్తున్నారన్న లాజిస్టిక్స్ సంస్థ.. కార్యకలాపాల నిలిపివేత

విభిన్నతలను గౌరవించి జాతీయ ఐక్యతను బలోపేతం చేయాలి: RSS చీఫ్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 02 , 2025 | 08:04 PM