Share News

Venkaiah Naidu: మాతృభూమి సేవలోనే నిజమైన ఆనందం

ABN , Publish Date - Dec 18 , 2025 | 12:23 PM

ఏ వ్యక్తి తన మూలాలను మర్చిపోకూడదని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు. విదేశాలకు వెళ్లి సంపాదించుకోవడం కంటే మాతృమూర్తి, మాతృదేశానికి సేవ చేయడంలో వచ్చే ఆనందం వేరని పేర్కొన్నారు.

Venkaiah Naidu: మాతృభూమి సేవలోనే నిజమైన ఆనందం
Venkaiah Naidu

కృష్ణాజిల్లా గుడివాడ , డిసెంబరు18 (ఆంధ్రజ్యోతి): జై ఆంధ్ర ఉద్యమ కాలం నుంచి గుడివాడ అంటే తనకు చాలా ఇష్టమని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) వ్యాఖ్యానించారు. విద్యార్థి ఉద్యమంలో ఎక్కువగా గుడివాడ వచ్చానని పేర్కొన్నారు. కన్నతల్లి, జన్మ భూమిని మర్చిపోకుండా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు వెంకయ్య నాయుడు.


ఇవాళ(గురువారం) గుడివాడలో వెంకయ్య నాయుడు పర్యటించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గాడ్ ఆఫ్ హానర్‌తో వెంకయ్య నాయుడుకు ఘన స్వాగతం పలికారు కళాశాల ఎన్సీసీ విద్యార్థులు. కళాశాల వజ్రోత్సవ పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, డాక్టర్ కామినేని శ్రీనివాస్, నాట్స్, ఐఎంఏ పెద్దలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడారు. బాల్య దశలో తన జీవన శైలిని సభ ముఖంగా వివరించారు.


మూలాలను మర్చిపోకూడదు: వెంకయ్య నాయుడు

‘ఏ వ్యక్తి తన మూలాలను మర్చిపోకూడదు. విదేశాలకు వెళ్లి సంపాదించుకోవడం కంటే మాతృమూర్తి, మాతృదేశానికి సేవ చేయడంలో వచ్చే ఆనందం వేరు. జీవన శైలి, మారిన ఆహారపు అలవాట్లతో పలు కొత్త రోగాలు వస్తున్నాయి. ప్రకృతి సమతుల్యత కనుమరుగవుతున్న రోజుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు ప్రజలకు అవగాహన కల్పించాలి. సేవా దృక్పథంతో కూడిన వైద్యాన్ని వైద్యులు అందించాలి. స్మార్ట్ ఫోన్లు, విద్యుత్ పరికరాలను వాడటం, జంక్ ఫుడ్‌తో సమతుల్యత దెబ్బ తింటుంది. ప్రకృతి అందించిన వాటిని సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటూ నేటి యువతరం ముందుకు వెళ్లాలి’ అని వెంకయ్య నాయుడు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వంశీకి ఊహించని షాక్.. మరో కేసు నమోదు

గవర్నర్‌ను కలవనున్న జగన్.. పోలీసులు అలర్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 18 , 2025 | 12:33 PM