MP Kesineni: మెడికల్ కాలేజీ అంశం.. లోక్‌సభలో వైసీపీ వైఖరిని ఎండగట్టిన ఎంపీ
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:08 PM
మెడికల్ కాలేజీల అంశంపై లోక్‌సభలో వైసీపీకి ఎంపీ కేశినేని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ తమ వైఫల్యాలను దాచేందుకు, ఇప్పుడు పీపీపీ మోడల్‌ను వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 15: లోక్‌సభలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌పై ఎంపీ కేశినేని శివనాథ్ (MP Kesineni Shivanath) ప్రసంగించారు. అనుబంధ నిధుల కోసం 72 గ్రాంట్లపై జరిగిన చర్చలో రూ. 1.32 లక్షల కోట్ల వినియోగంపై కీలక అంశాలను ఎంపీ వివరించారు. మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ వైఖరిని లోక్‌సభలో ఎంపీ ఎండగట్టారు. వైసీపీ నాలుగేళ్లలో 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని గొప్పలు చెప్పి, ఒకటి కూడా ప్రారంభించకుండా ప్రజలు, విద్యార్థులను మోసం చేసిందని విమర్శించారు. వైసీపీ పాలనలో వైద్యరంగం పూర్తిగా పతనమైందని ఆరోపించారు.
17 కాలేజీల్లో చాలా వాటికి పునాది కూడా వేయలేదన్నారు. వైసీపీ తమ వైఫల్యాలను దాచేందుకు, ఇప్పుడు పీపీపీ మోడల్‌ను వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు. వైసీపీ చేయలేనిది సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చేసి చూపించడాన్ని తట్టుకోలేకపోతోందని వ్యాఖ్యనించారు. పార్లమెంట్‌లో డిసెంబర్ 12వ తేదీ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ పీపీపీ మోడల్ ద్వారా మెడికల్ కాలేజీ నిర్మాణానికి సిఫార్స్ చేసిన అంశాన్ని ఎంపీ ప్రస్తావించారు. పీపీపీ మోడల్‌లో ప్రభుత్వం 100% నియంత్రణ, 50% ప్రభుత్వ కోటా సీట్లు అలాగే కొనసాగుతాయని స్పష్టం చేశారు. వైసీపీకి పీపీపీ మోడల్‌కు ప్రైవేటీకరణ మధ్య తేడా కూడా తెలియదని కామెంట్స్ చేశారు. వైసీపీ తమ నాయకుడి కోసం రూ. 500 కోట్లతో రాజభవనం లాంటి కట్టడం నిర్మించి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారని ఆరోపించారు. వైసీపీ దుర్వినియోగం చేసిన ఆ రూ.500 కోట్ల సొమ్ముతో మెడికల్ కాలేజీలు కట్టవచ్చని పేర్కొన్నారు.
యూరియా సబ్సీడీ బలోపేతానికి రూ.31,000 కోట్లు కేటాయించడాన్ని ఎంపీ స్వాగతించారు. ఏపీలో యూరియా సంక్షోభం పరిష్కరించిన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలియజేశారు. దక్షిణ భారతంలో మెట్రో రైలు లేని ఏకైక రాష్ట్రం ఏపీ అని చెప్పుకొచ్చారు. విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులు ప్రాంతీయ ప్రగతికి అత్యవసరమన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరేందుకు కీలకమని తెలిపారు. కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో దేశం 8.2% జీడీపీ వృద్ధిని సాధించిందని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
కల్తీ నెయ్యి కేసు.. వైవీ సుబ్బారెడ్డి పీఏకు హైకోర్టులో ఎదురుదెబ్బ
కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో లోకేష్ కీలక భేటీ.. చర్చించిన అంశాలివే
Read Latest AP News And Telugu News