Mangrove Forests: వనామీ రొయ్యల పెంపకం పేరుతో పర్యావరణ విధ్వంసం
ABN , Publish Date - Aug 11 , 2025 | 08:42 AM
కృష్ణా జిల్లాలో పెడన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్ జెడ్) పరిధిలో బందరు సముద్ర తీరం వరకు 15 వేల ఎకరాల మేర మడ అడవులు ఉన్నాయి. సీఆర్‌జెడ్, పీడబ్ల్యూడీ భూములలో ఈ మడ అడవులు ఉన్నాయి.
»పెడన సీఆర్‌జడ్ పరిధిలో అక్రమార్కుల నిర్వాకం
» వనామీ రొయ్యల సాగు.. హైఫైడ్ రసాయనాల వినియోగం
» చెరువుల్లోని వ్యర్థ కెమికల్ నీరు మడ అడవుల్లోకి విడుదల
» ఆ నీటి వల్ల కుళ్లిపోయి చనిపోతున్న మడ చెట్లు
» ఎండిపోయిన చెట్లు తొలగించి అక్కడ కొత్తగా చెరువుల తవ్వకం
» మడ అడవులు అంతరించిపోవడంతో పొంచి ఉన్న పర్యావరణ ముప్పు
» మడ అడవులు నరికి యథేచ్ఛగా రొయ్యల చెరువుల తవ్వకం
» అంతరించిపోతున్న మడ అడవులు
పెడవ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జడ్) పరిధిలో సర్యావరణ విధ్వంసం పెద్ద ఎత్తున జరుగుతోంది. కొందరు అక్రమార్కులు మడ అడవులను (Mangrove Forests) నరికి ఆక్రమంగా రొయ్యల చెర వులు తవ్వుతున్నారు. యధేచ్ఛగా వనామీ రొయ్యల సాగు (Vannamei Shrimp Farming) చేస్తున్నారు. వీటి పెరుగుదలకు మేతతో పాటు హైఫైడ్ కెమికల్‌ను వినియోగిస్తున్నారు. ఆ తర్వాత ఆ వ్యర్థనీటిని మడ అడవుల్లోకి వదులుతున్నారు. కెమికల్ నీటి వల్ల మడ చెట్లు కుళ్లిపోయి చనిపోతున్నాయి. ఎండి పోయిన చెట్లను తొలగించి అక్కడ మళ్లీ రొయ్యల చెరువులు తవ్వుతూ ముందుకుపోతున్నారు. దీంతో మడ అడవులు అంతరించిపోతున్నాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ/ పెడన రూరల్): కృష్ణా జిల్లాలో పెడన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్ జెడ్) పరిధిలో బందరు సముద్ర తీరం వరకు 15 వేల ఎకరాల మేర మడ అడవులు ఉన్నాయి. సీఆర్‌జెడ్, పీడబ్ల్యూడీ భూములలో ఈ మడ అడవులు ఉన్నాయి. పెడన మండలంలోని జింజేరు-1. జింజేరు-2 మీదుగా సాగే లజ్జబండ డ్రెయిన్‌కు రెండు వైపులా 15 వేల ఎకరాలలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ మడ అడవులపై కొంత మంది అక్రమార్కులు కన్నేశారు.
కొంత కాలంగా అడవులను నరికివేసి నాలుగైదు ఎకరాల విస్తీర్ణంలో రొయ్యల సాగు చేపడుతున్నారు. ఇలా కొన్నేళ్లుగా వేలాది ఎకరాల్లోని మడ చెట్లను నరికి రొయ్యల సాగు చేపట్టారు. వనామీ రొయ్యల సాగే ఎక్కువుగా సాగవుతుంది. వనామీ రొయ్యలు ఎంత ఆహారాన్ని తినగలిగితే అంతగా పెరుగుతాయి. పరిమాణం ఎక్కువగా ఉండే వనామీ రొయ్యలకు విదేశాల్లో ఎంతో డిమాండ్ ఉంది. ఎగుమతులకు మంచి అవకాశం ఉండటంతో పాటు ధర కూడా భారీగా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని వనామీ రొయ్యలకు మంచి పోషకాలున్న మేతను అందిస్తారు.
యథేచ్ఛగా హైఫైడ్ కెమికల్ వినియోగం
పనామీ రకం రొయ్యలు ఒక ప్రత్యేకమైన వానకు ఆకర్షితమవుతాయి. ఆ వాసన వచ్చే ఆహారాన్ని అమితంగా ఇష్టపడి తింటాయి. ఆ వాసన అనేది హైఫైడ్ అనే కెమికల్ నుంచి వస్తుంది. ఈ హైఫైడ్ కెమికల్ వనామీ రొయ్యల ఆకలిని పెంచటానికి, రొయ్యలకు వ్యాధులు రాకుండా ఉండటానికి ఉపయోగిస్తారు. మేతలో కలపటంతో పాటు, నీటిలో కూడా కలుపుతారు. ఈ వాసన కారణంగా వనామీ రొయ్య మేతను ఎక్కువుగా తింటూ తన పరిమాణాన్ని పెంచుకుంటుంది. రొయ్యలు వేగంగా పెరగటంతో పాటు గణనీయమైన ఉత్పత్తిని ఇస్తాయి. నీటిలో కలపటం వల్ల రొయ్యలకు బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌లను సోకకుండా నిరోధిస్తుంది. రొయ్యల సాగుకు అనుగుణంగా నీటిని ఉంచేలా ఈ హైఫైడ్ కెమికల్ దోహదపడుతుంది. నీటిలో అమోనియా, నైట్రేట్ స్థాయిలను తగ్గిస్తుంది. నీటిలో ఆక్సిజన్ స్థాయిలను కూడా పెంచుతుంది. రోగాలు తొందరగా రావు, మరణాలు తగ్గుతాయి. దీంతో సాగు ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. సాగుదారుల కోణంలో ప్రయోజనాలున్న హైఫైడ్ కెమికల్ పర్యావరణానికి ఎంతగానో హాని చేస్తుంది.
కుళ్లిపోతున్న మడ చెట్లు
ఈ రసాయనం నీటిని కలుషితం చేస్తుంది. జలచరజీవులకు హాని కలిగిస్తుంది. రొయ్యల సాగు పూర్తయ్యాక నీటిని తోడి వేస్తారు. ఇలా తేడి వేసిన నీళ్లన్నీ కూడా మడ చెట్లు ఉండే నీటిలోకి కలుస్తున్నాయి. ఈ ప్రభావం మడచెట్ల మీద ప్రభావం చూపుతోంది. మడచెట్లు ఉండే నీటిలో కలవటం వల్ల చెట్లు కుళ్లిపోయి చనిపోతున్నాయి. మడ చెట్లు అనేవి నీటిని శుద్ధి చేస్తాయి. సముద్రంలోకి వెళ్లే నీటిని కూడా ఇవి శుద్ధి చేస్తాయి. అలాంటి మడచెట్లు హైఫైడ్ రసాయనాల కారణంగా చచ్చిపో తున్నాయి. ఈ రసాయన అవశేషాలున్న రొయ్యలను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఈ రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తే క్యాన్సర్, కాలేయ వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రొయ్యల సాగులో ఇప్పటికిప్పుడు లాభాలను ఇచ్చినా.. మడ చెట్ల వినాశనం ద్వారా పర్యావరణానికి హాని కలగటంతో పాటు మానవ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి మడ అడవుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AndhraPradesh News And Telugu News