Share News

Amaravati Housing Plots: ఇంకా రంగుల కలే

ABN , Publish Date - Aug 11 , 2025 | 05:14 AM

ఇల్లు కట్టాలంటే స్థలం ఉండాలి! రోడ్లు కావాలి. విద్యుత్‌ కనెక్షన్లు రావాలి. లేఅవుట్‌ వేసి అవసరమైన అన్ని మౌలిక వసతులూ కల్పించాలి. అవేవీ లేకుండా ఇల్లు కట్టుకోవడమెలా? ఇళ్లు లేనిచోట్ల అభివృద్ధి జరిగేదెలా? ‘ప్రజా రాజధాని’ కల సాకారమయ్యేదెలా? ప్రస్తుతం ఇదీ రాజధాని పరిస్థితి! ‘అన్నీ చేసేయండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడో చెప్పారు. కానీ... అధికారుల స్థాయిలో అడుగు ఒక్క అంగుళం కూడా ముందుకు పడటంలేదు.

Amaravati Housing Plots: ఇంకా రంగుల కలే

  • కంప్యూటర్‌ తెరపైనే ‘రాజధాని ప్లాట్లు’

  • లేఅవుట్లు అభివృద్ధి చేయని అధికారులు

  • 2016లోనే రిటర్నబుల్‌ ప్లాట్ల కేటాయింపు

  • రెండేళ్లలోనే లే అవుట్ల అభివృద్ధికి హామీ

  • 2025 వచ్చినా నేటికీ నెరవేరని వైనం

  • లెవెలింగ్‌ లేదు, రోడ్లు, హద్దులూ లేవు

  • మౌలిక సదుపాయాల కల్పన అసలే లేదు

  • ఐదేళ్లు రాజధానిని అటకెక్కించిన జగన్‌

  • కూటమి వచ్చి 15 నెలలైనా ప్లాట్లకు పాట్లే

  • సీఎం దృష్టి సారించాలని రైతుల వినతి

మాట.. నెరవేరదేమి?

2016 మే నెలలో అధికారులు చెప్పిన ప్రకారం..

  • రాజధాని ప్రాంతంలో గ్రామాల వారీగా రిటర్నబుల్‌ ప్లాట్లకు లే అవుట్లు వేయాలి.

  • లే అవుట్‌లలో మట్టిపోసి లెవెలింగ్‌ చేయాలి.

  • సరిహద్దు రాళ్లు పాతి... ఏ ప్లాటు ఎవరిదో ప్రత్యక్షంగా చూపించాలి.

  • ఆ తర్వాత... విద్యుత్‌ సదుపాయం కల్పించాలి.

  • అంతర్గత రహదారులు నిర్మించాలి.

  • నీటి వసతి కల్పించాలి.

  • డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి.

ఇవన్నీ రెండేళ్లలోనే పూర్తి చేసి ఇస్తామని 2016 మే నెలలో సీఆర్డీయే అధికారులు చెప్పారు. ఇప్పటికి.. తొమ్మిదేళ్లు దాటింది. మధ్యలో ఐదేళ్ల జగన్‌ హయాం తీసేసినా.. నాలుగేళ్లు! కానీ ఇప్పటికీ.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఇల్లు కట్టాలంటే స్థలం ఉండాలి! రోడ్లు కావాలి. విద్యుత్‌ కనెక్షన్లు రావాలి. లేఅవుట్‌ వేసి అవసరమైన అన్ని మౌలిక వసతులూ కల్పించాలి. అవేవీ లేకుండా ఇల్లు కట్టుకోవడమెలా? ఇళ్లు లేనిచోట్ల అభివృద్ధి జరిగేదెలా? ‘ప్రజా రాజధాని’ కల సాకారమయ్యేదెలా? ప్రస్తుతం ఇదీ రాజధాని పరిస్థితి! ‘అన్నీ చేసేయండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడో చెప్పారు. కానీ... అధికారుల స్థాయిలో అడుగు ఒక్క అంగుళం కూడా ముందుకు పడటంలేదు. రాజధానిలో ‘ప్లాటు’ అంటే... ఇప్పటికీ కంప్యూటర్‌ తెరపై కనిపించే రంగు రంగుల చదరాలే!

Untitled-4 copy.jpg


భూములు ఇచ్చిన రైతులు వాటిని చూసుకోవాల్సిందే. 69,700 రిటర్నబుల్‌ ప్లాట్స్‌ ఉండగా... వాటిలో చాలావరకు అప్పట్లోనే సరిహద్దు రాళ్లు పాతి వదిలేశారు. జగన్‌ హయాంలో ఆ రాళ్లు కూడా చెదిరిపోయాయి. రాజధాని రూపురేఖలు చెరిపివేసేందుకు ఉద్దేశపూర్వకంగానే సరిహద్దు రాళ్లను పీకేయించిన దాఖలాలూ ఉన్నాయి. వెరసి... ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్లాటు ఎక్కడున్నాయన్నది నిక్కచ్చిగా తెలుసుకోలేని పరిస్థితి.

‘రెండేళ్లు’ అంటే ఎన్నేళ్లు?

రాజధాని భూసమీకరణ నిబంధనల మేరకు భూములిచ్చిన రైతులకు 2016లోనే రిటర్నబుల్‌ ప్లాట్లు ఇచ్చారు. రెసిడెన్షియల్‌, కమర్షియల్‌... ఇలా వేర్వేరుగా ప్లాట్లు కేటాయించారు. రెండేళ్లలోనే నివాస ప్రాంతాల లే అవుట్‌లు వేస్తామని... సకల సదుపాయాలతో అభివృద్ధి చేస్తామని, ఆ ప్లాట్లలో చక్కగా ఇళ్లు కట్టుకోవచ్చునని 2016లోనే సీఆర్డీయే చెప్పింది. ఇలా హామీ ఇచ్చి, నమ్మకం కల్పించినందుకే రైతులు భూములు ఇచ్చారు. అధికారులు రైతుల నుంచి భూములు తీసుకోవడానికి అవసరమైన లాంఛనాలన్నీ పకడ్బందీగా పూర్తి చేశారు. కానీ... రైతులకు ఇచ్చిన మాట ప్రకారం లే అవుట్ల అభివృద్ధిని మాత్రం పక్కనపెట్టేశారు. రెండేళ్ల గడువు... 2018 దాటిపోయింది. 2019 కూడా పోయింది. ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటింది. లేఅవుట్‌ వేయడం కాదుకదా... కనీసం భూమిపై మార్కింగ్‌ కూడా చేయలేదు. భూములు తీసుకోవడంలో ఉన్న శ్రద్ధ రైతులకు ఇచ్చిన హామీల అమలులో చూపించలేకపోయారు.


ఇప్పటికైనా ఏం మారింది...

జగన్‌ అధికారంలో ఉన్న ఐదేళ్లు అమరావతి జీవన్మరణ సమస్యను ఎదుర్కొంది. రైతులు పోరుబాట పట్టారు. అమరావతికి రాష్ట్ర ప్రజలంతా బాసటగా నిలిచారు. జగన్‌ను ఇంటికి పంపి కూటమి సర్కారుకు పట్టంకట్టారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతుల ప్లాట్లలో లే అవుట్‌లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాల్సింది. ఆరు నెలల్లోనే ఈ పని పూర్తయ్యేది. కానీ అధికారులు తమదైన శైలిలో కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు. లే అవుట్‌ల అభివృద్ధి జరిగి, వాటిల్లో మౌలిక సదుపాయలు వచ్చిఉంటే... అక్కడ ఇళ్లు, గృహ సముదాయాలు వచ్చేవి. రాజధానిలో నివాసం కావాలనుకునే ఇతర ప్రాంతాల వారూ ఆ ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపేవారు. తద్వారా... లావాదేవీలు పెరిగేవి. రైతులకు ఆర్థిక లబ్ధితోపాటు... ప్రభుత్వానికీ ఆదాయం వచ్చేది. అసలు లేఅవుట్‌ లేకుండా అభివృద్ధి జరిగేదెలా?


రైతులతో సమావేశమేదీ సీఎం సార్‌?

అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తామని, వారి సమస్యలన్నీ శరవేగంగా పరిష్కరిస్తామని ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. 2024 జూన్‌ 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని రైతుల సమస్యలపై ఇప్పటికీ ఆయన రాజధాని రైతులను కలవలేదు. రైతులతో ఒక్కసారి సమావేశమైతే... క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుస్తాయి.


పదేళ్లు కావొస్తున్నా...

‘అమరావతి ఇలా ఉంటుంది’ అంటూ 2016లో డిజిటల్‌ మ్యాపులు, అద్భుతమైన గ్రాఫిక్స్‌తో ఊరించారు. రాజధాని రైతులు వాటిని చూసే సంబరపడ్డారు. విషాదమేమిటంటే... ఇప్పటికి పదేళ్లు గడుస్తున్నా అవే రంగుల కలలు కొనసాగుతున్నాయి. రైతుల రిటర్నబుల్‌ ప్లాట్లకు లే అవుట్లే లేవు. అరాకొరా ఉన్నా వాటి ఆనవాళ్లు కనిపించవు. మధ్యలో జగన్‌ వచ్చి ఐదేళ్లు రాజధానిని ముంచేశారు. ఇప్పుడు... కూటమి సర్కారు వచ్చి 15 నెలలవుతున్నా ఈ విషయంలో ఏ పురోగతీ లేకపోవడం రైతులను తీవ్ర నిరాశకు, ఆవేదనకు గురిచేస్తోంది. అధికారులు మాత్రం తమదైన శైలిలో సాగదీసుకుంటూ పోతూనే ఉన్నారు.


ఇంకెప్పుడు?

‘‘రెండేళ్లలోనే ప్లాట్లను అభివృద్ధి చేస్తాం... 2018కి అంతా రెడీ అయిపోతాయి... ఇల్లు, అపార్ట్‌మెంట్‌ ఏమైనా కట్టుకోవచ్చు అని 2016లో చెప్పారు. 2019లో ప్రభుత్వం మారేదాకా ఎలాంటి మార్పులేదు. ఇప్పుడు మాకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చి 15 నెలలవుతోంది. ఇంకా పాత పరిస్థితే కొనసాగితే మాకు భరోసా దక్కేది ఎప్పుడు? లే అవుట్‌లను ఇంకా ఎప్పుడు అభివృద్ధి చేస్తారు? ఎవరి ప్లాటు ఎక్కడో తెలియని పరిస్థితి ఉంటే మేం ఎక్కడని నిర్మాణం చేయాలి? ఎవరికి అమ్ముకోగలం?’’

- నూతక్కి కిశోర్‌, మందడం

Updated Date - Aug 11 , 2025 | 07:58 AM