TTD Rules Violation: తిరుమలలో జగన్ మేనమామ రాజకీయం
ABN , Publish Date - Aug 11 , 2025 | 04:45 AM
మాజీ సీఎం జగన్ మేనమామ, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి టీటీడీ నిబంధనలు ఉల్లంఘించారు.
టీటీడీ నిబంధనల ఉల్లంఘన.. చర్యలు తీసుకునే దిశగా విజిలెన్స్
తిరుమల, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ మేనమామ, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి టీటీడీ నిబంధనలు ఉల్లంఘించారు. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదనే రూల్స్‌కు తూట్లు పొడుస్తూ రెచ్చిపోయారు. తిరుమల పవిత్రత దెబ్బతీసేలా ఆయన కొండపై రాజకీయాలు మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. శ్రీవారిని ఆదివారం దర్శించుకున్న ఆయన అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పంటలు సరిగా పండటం లేదని, ఎన్నికల సమయంలో దొంగ హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, 2029 ఎన్నికల్లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్‌రెడ్డి సీఎం కావాలని ప్రార్థించానన్నారు. ‘గత ఎన్నికల నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారో తెలీదు. వాళ్లే నామినేట్ చేసుకుని ఉంటే సరిపోయేది. అలా కాకుండా ప్రజలను, వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టి ఎన్నికలు జరిపారు. ఓట్లు వేసేందుకు ప్రజలను రానివ్వకుండా చేశారు’ అని రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని తగ్గించేలా బూత్‌లను దూరంగా ఏర్పాటు చేశారని, స్వాతంత్య్రం వచ్చాక ఇంత దారుణంగా ఎన్నికలు జరగలేదని ఆరోపించారు. వీళ్లలానే జగన్ అనుకుని ఉంటే చంద్రబాబు, లోకేశ్, పవన్‌కల్యాణ్‌లు తిరిగేవారు కాదని, కనీసం నామినేషన్ కూడా వేసేవారు కాదంటూ రాజకీయ వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా రాజకీయ వ్యా ఖ్యలు చేస్తే కేసులు పెట్టాలని టీటీడీ బోర్డు ఇటీవల తీర్మానం చేసిన విష యం తెలిసిందే. ఈ క్రమంలో రవీంద్రనాథ్‌రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు టీటీడీ విజిలెన్స్ విభాగం సిద్ధమవుతున్నట్టు తెలిసింది.