APSRTC: ఆర్టీసీలో కండక్టర్ల కొరత.. ఓడీ విధులపై విమర్శలు
ABN , Publish Date - Aug 13 , 2025 | 08:37 AM
ఆర్టీసీకి కండక్టర్ల కొరత ఏర్పడింది. మహిళల ఉచిత బస్సు పథకం అమలుకు తగిన సంఖ్యలో కండక్టర్లు లేరు. దీంతో ఓడీలలో ఉన్న కొంతమంది కండక్టర్లను రప్పించాలని, అవసరమైతే డ్రైవర్లను కూడా కండక్టర్లుగా వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు.
» మహిళలకు ఉచితం ఎఫెక్ట్
» ఆర్టీసీలో కండక్టర్ల కొరత !
» ఓడీల రద్దుపై అధికారుల వివక్ష
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఆర్టీసీకి కండక్టర్ల కొరత (APSRTC Conductor Shortage) ఏర్పడింది. మహిళల ఉచిత బస్సు పథకం అమలుకు తగిన సంఖ్యలో కండక్టర్లు లేరు. దీంతో ఓడీలలో ఉన్న కొంతమంది కండక్టర్లను రప్పించాలని, అవసరమైతే డ్రైవర్లను కూడా కండక్టర్లుగా వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. పూర్తిస్థాయిలో ఓడీలు చేస్తున్న కండక్టర్లందరినీ అన్ని శాఖలు, అన్ని విభాగాల నుంచి తిరిగి వెనక్కు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ కొన్ని విభాగాల్లో పనిచేసే వారినే కండక్టర్లుగా ఉపయోగించుకోవాలనుకోవటం విమర్శలకు దారి తీస్తోంది.
మరో రెండు రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రారంభం కానున్న 'మహిళలకు ఉచిత ప్రయాణం' పథకాన్ని దృష్టిలో ఉంచుకుని సంస్థలో కొనసాగుతున్న అవుట్ అప్ డిజిగ్నేషన్ (ఓడీ) డ్యూటీలను రద్దు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. వాస్తవ విధులకు భిన్నంగా వివిధ శాఖలు, విభాగాల్లో పనిచేస్తున్న వారంతా ఓడీ కేటగిరీలోకి వస్తారు. ప్రస్తుతం కండక్టర్ల కొరత నేపథ్యంలో దీనిని అధిగమించేందుకు కొన్ని విభాగాల్లో ఓడీ విధానంలో పనిచేస్తున్న వారిని కండక్టర్లుగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. డ్రైవర్లుగా ఉన్న వారిని కూడా కండక్టర్లుగా పంపాలని భావిస్తోంది.
గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీలో పనిచేసే వారిని టీఆర్ అండ్ పరిధిలోకి కొంతమందిని ఓడీ విధానంలో పనిచేసేందుకు పంపించారు. ఆర్టీసీ హౌస్‌లో ఐటీ, పీఎఫ్, పర్సనల్ డిపార్ట్‌మెంట్, సీఈడీ, అక్కౌంట్స్ తదితర విభాగాలలో ఓడీ విధానంలో 70 మందికి పైగా పనిచేస్తున్నారు. ఆయా శాఖలు, విభాగాల్లో పనులు చేయటానికి అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకుంటే సరిపోతుంది. ఆయా శాఖలు, విభాగాలకు పంపిన వారంతా అక్కడ డేటా ఎంట్రీ ఉద్యోగాలే చేస్తున్నారు. లక్షలాది. రూపాయలు జీతాలు ఇచ్చి కండక్టర్లను ఈ విధులకు తీసుకునేకంటే రూ.15, రూ.20 వేలు ఇచ్చి అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకోవటానికి అవకాశం ఉంది. హెడ్‌ఫీసుల్లో పనిచేసే వారిని తొలగిస్తే పనులు ఆగిపోతాయన్న వాదనలను అధికారులు తీసుకువస్తున్నారు.
ఉన్నతాధికారులకు కూడా అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. గతంలో సురేంద్రబాబు ఎండీగా ఉన్న సమయంలో ఇలాంటి ఓడీలన్నింటినీ రద్దు చేసి అవుట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇది అమలు జరిగేలోగా ఆయన బదిలీతో ప్రక్రియ ఆగిపోయింది. ఆర్టీసీ హౌస్, ఎన్టీఆర్ జిల్లా రీజియిన్, పీఎన్ బీఎస్‌లలో కూడా కొంతమంది అధికారులు తమకు కావాల్సిన వారి కోసం అనధికారికంగా ఓడీలలో కొన సాగిస్తున్నారు. అనధికారిక ఓడీలను రద్దు చేయాల్సిన అవసరం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించటంతో ఆర్టీసీకి కండక్టర్ల కొరత ఏర్పడింది. చాలాకాలంగా ఆర్టీసీ సర్వీసులను అధికారులు తగ్గిస్తూ వస్తున్నారు. దీంతో కండక్టర్ల సమస్య పెద్దగా కనిపిం చలేదు. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల ప్రయాణాలు పెరగటమే కాకుండా సర్వీసులను పెంచాల్సి వస్తోంది. దీంతో ఇప్పుడు కండక్టర్ల సమస్య కనిపిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించుకోవటానికి ఎంచుకున్న విధానం పక్షపాతంతో ఉందన్న విమర్శలు వస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది: లోకేశ్
గెలిచి చరిత్ర సృష్టించబోతునున్నాం: పల్లా
For More AndhraPradesh News And Telugu News