OP Registration Problems: రిమ్స్‌లో ఓపీ సమస్యలు.. రోగుల ఆందోళన
ABN , Publish Date - Dec 16 , 2025 | 07:44 AM
కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో వైద్యం కోసం వచ్చే రోగులకు ఓపీ కష్టాలు తప్పడం లేదు. రోగం నయం చేసుకోవడానికి వైద్యం కోసం వచ్చే వారికి ఓపీ తీసుకోవడం ఎంతో కష్టంగా మారింది.
రిమ్స్‌లో ఓపీ కావాలంటే.. ఆండ్రాయిడ్ ఫోన్ ఉండాల్సిందే
అవస్థలు పడుతున్న వృద్ధులు, గర్భిణీలు, రోగులు
ఓపీ ఆలస్యంతో సమయం వృథా.. ప్రయాణ ఖర్చులు అదనం
కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో (Kadapa RIMS) వైద్యం కోసం వచ్చే రోగులకు ఓపీ కష్టాలు తప్పడం లేదు. రోగం నయం చేసుకోవడానికి వైద్యం కోసం వచ్చే వారికి ఓపీ తీసుకోవడం ఎంతో కష్టంగా మారింది. ఒకవైపు సర్వర్ సమస్యతో సతమతమవుతుంటే.. మరోవైపు కచ్చితంగా ఆండ్రాయిడ్ మొబైల్ ఉండాల్సిన పరిస్థితిని ఆసుపత్రి అధికారులు తీసుకొచ్చారు. నిరక్షరాస్యులు, పేదలు, మొబైల్ వాడకం గురించి సరిగా తెలియని అమాయకులు వైద్యం కోసం సర్వజన ఆసుపత్రికి ఎక్కువగా వస్తుంటారు. వీరి వద్ద చాలా వరకు కీప్యాడ్ ఫోన్లు మాత్రమే ఉంటాయి. అసలు ఫోన్లే ఉండని వారు కూడా ఉంటారు. ఇలాంటి వారందరికీ ఓపీ తీసుకోవడం పెద్ద సమస్యగా మారుతోంది.
కడప సెవెన్ రోడ్స్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రిమ్స్‌కు ప్రతిరోజు వైద్యంకోసం 1200 నుంచి 1500 మంది రోగులు వస్తుంటారు. ప్రస్తుతం వాతావరణ మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు పెరగడంతో ఓపీ దాదాపు 2000 దాకా ఉంటోంది. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలంటే అధికంగా ఖర్చు అవుతుంది. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందిస్తారని ఆశతో దూర ప్రాంతాల నుంచి కూడా రిమ్స్‌కు వస్తుంటారు. వీరిలో ఇప్పుడు చాలామందికి ఓపీ కష్టాలు ఎదురయ్యాయి.
క్యూఆర్ కోడ్‌తో ఓపీ టికెట్
గతంలో ఆసుపత్రి ఓపీ కౌంటర్ వద్దకు వెళ్లి పేరు, ఊరు వ్యాధి చెబితే ఓపీ టికెట్ ఇచ్చేవారు. ఇప్పుడు ఓపీ టికెట్ తీసుకోవాలంటే స్మార్ట్ ఫోన్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్‌చేసి రోగి పేరు, ఊరు తదితర వివరాలు నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీని కౌంటర్ వద్ద చెబితే ఓపీ టికెట్ ఇస్తారు. చాలా మంది వద్ద స్మార్ట్ ఫోన్‌లు లేకపోవడం, నిరక్షరాస్యులు, వృద్ధులు, కొంతమందికి వీటి మీద అవగాహన లేదు. దీంతో వీరంతా ఓపీ టికెట్ కౌంటర్ వద్దనే ఇబ్బందులు పడుతూ నిరీక్షించాల్సి వస్తోంది.
అనారోగ్యం.. ఆపై నిరీక్షణ
సాధారణంగా ఆసుపత్రికి రోగం నయం చేసుకోవడానికి వస్తుంటారు. రోగులకు త్వరితగతిన వైద్య సహాయం అదిస్తే రోగులకు సాంత్వన చేకూరుతుంది. కానీ రిమ్స్‌లో వైద్యం పొందాలంటే మొదటగా ఓపీ టికెట్ వద్దనే ఎక్కువ సమయం నిరీక్షించాల్సి రావడంతో రోగులు మరింత ఇబ్బంది పడుతున్నారు. వ్యాధిగ్రస్తులు, వృద్ధులు గర్భిణీలు, పిల్లలు, వికలాంగులు ఓపీ కౌంటర్ వద్ద నిరీక్షించడంతో మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. వీరే కాక దివ్యాంగులు సైతం ఒక్కోసారి చాలా సమయం నిరీక్షించాల్సి వస్తోంది.
అదనపు ప్రయాణ ఖర్చులు
సర్వజన ఆసుపత్రికి వైద్యంకోసం వచ్చేరోగులకు త్వరితగతిన వైద్య సహాయం అందితే తొందరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఓపీ కౌంటర్ వద్దే పుణ్యకాలం కాస్త పూర్తవుతుండటంతో.. తర్వాత వైద్యులు అందుబాటులో లేక, కొన్ని రకాలైన రక్త, వివిధ వ్యాధి తెలిపే పరీక్షలు ఆలస్యం అవడం, భోజన ఖర్చులు పలుమార్లు తిరగడంతో రోగులకు ప్రయాణఖర్చుల భారం పెరుగుతోంది. ఉచిత వైద్యం కాస్త ఖరీదు వైద్యంగా మారుతోంది. కాస్త డబ్బులు పెడితే ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం, వైద్య సహాయం వెంటనే అందుతుంది అనే భావన ప్రజల్లో కలుగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఓపీ కష్టాలు తొలగించాలని రోగులు కోరుతున్నారు.
సహాయం అందిస్తున్నాం
రోగి మెడికల్ హిస్టరీ సులభంగా తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్ వ్యవస్థను తీసుకొచ్చాం. దీనిద్వారా రోగికి కచ్చితమైన వైద్యం అందివ్వడానికి అవకాశం ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు లేక ఇబ్బందులు పడే వారికి వైద్య విద్యార్థులు, వైద్య సిబ్బంది తమ సొంత ఫోన్లలో నమోదు చేసి రోగులకు ఓపీ టికెట్ ఇస్తున్నారు. అప్పుడప్పుడు సర్వర్ సమస్య వల్ల కాస్త ఆలస్యం అవుతుంది. రోగులకు ఇబ్బంది కలగండా వైద్య సిబ్బంది ఓపీ కౌంటర్ వద్ద నిరంతరం సహాయం చేస్తూనే ఉంటారు.
- డాక్టర్ శ్రీనివాసులు, సీఎస్‌ఆర్‌ఎంఓ, సర్వజన ఆసుపత్రి, కడప
ఈ వార్తలు కూడా చదవండి..
ఆధునాతనంగా మోడల్ పోలీస్‌స్టేషన్‌ల నిర్మాణం: హోంమంత్రి అనిత
ముగిసిన భవానీ దీక్షలు.. ఎంతమంది దర్శించుకున్నారంటే..
Read Latest AP News And Telugu News