WALTA Act Violations: వాల్టా చట్టం అమల్లో విఫలం.. పర్యావరణానికి ప్రమాదమేనా?
ABN , Publish Date - Aug 14 , 2025 | 08:30 AM
మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. మొక్కలు పెంచుదాం.. ఆరోగ్యాన్ని పంచుదాం, అమ్మ పేరుతో ఒక మొక్క, ఇంటింటా చెట్టు ఊరూరా వనం' అనే నినాదాల పేరుతో ప్రభుత్వాలు మొక్కలు పెంచాలని చెబుతున్నాయి. అడవుల సంరక్షణ, మొక్కల పరిరక్షణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామం, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. పైగా వాల్టా చట్టాన్ని కూడా అమలు చేస్తోంది.
» అడ్డం పేరుతో అడ్డు తొలగిస్తున్నారు
» నేల కొరుగుతున్న మహావృక్షాలు
» వాల్టా చట్టం అపహాస్యం..
» గుట్టుగా కలప తరలింపు
మదనపల్లె, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. మొక్కలు పెంచుదాం.. ఆరోగ్యాన్ని పంచుదాం, అమ్మ పేరుతో ఒక మొక్క, ఇంటింటా చెట్టు ఊరూరా వనం' అనే నినాదాల పేరుతో ప్రభుత్వాలు మొక్కలు పెంచాలని చెబుతున్నాయి. అడవుల సంరక్షణ, మొక్కల పరిరక్షణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామం, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. పైగా వాల్టా చట్టాన్ని(WALTA Act) కూడా అమలు చేస్తోంది. అయితే ఇదంతా ప్రచారం, చట్టాలు కాగితాలకే పరిమితం అయ్యాయే కానీ క్షేత్రస్థాయిలో మచ్చుకైనా కనిపించలేదు.
ఇంటా బయటా, గట్టు గుట్టా, భూమి-పొలం ఇలా అనేక చోట్ల నిత్యం చెట్ల నుంచి భారీ వృక్షాల వరకు నేలకొరుగుతున్నాయి. వివిధ అవసరాలు, భూముల అభివృద్ధి, రియల్ ఎస్టేట్ వ్యాపారం.. కారణం ఏదైనా అడ్డం పేరుతో వృక్షాలను అడ్డు తొలగిస్తున్నారు. చెట్టు, వృక్షం తొలగింపు తప్పని సరైతే అటవీశాఖ అనుమతి తప్పనిసరి. అందుకు అటవీశాఖ నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి చెట్టు, వృక్షం విలువ చెల్లించి అందుకు రెట్టింపుగా మొక్కలు నాటాల్సి ఉంది. అదేమీ లేకుండా చెట్లు కట్ చేసే ఏజెంట్లతో ఒప్పందం కుదుర్చుకుని కోసేసి వాటిని షామిల్లులకు తరలిస్తున్నారు.
పెద్ద పెద్ద వృక్షాలను ఎక్కడో అడవులు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎవరికీ తెలియదు అనుకోవచ్చు. పల్లె-పట్టణం, రాత్రి-పగలు అనే తేడా లేకుండా యంత్రాలతో నేలకూలుస్తున్నారు. వృక్షాలను కోయడానికే వ్యాపారులు, కాంట్రాక్టర్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వీరికి ఎలాంటి అనుమతులు లేకపోయినా రైతులు, వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకుని కట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మదనపల్లె పట్టణం బెంగళూరు రోడ్డులో అయిదు రోజులుగా రెండు చోట్ల వృక్షాలను కోసేస్తున్నారు.
వేపమాను కేంద్రం సమీపంలో ఒకచోట, రెడీపుడ్స్ ఎదురుగా మామిడితోటలో దర్జాగా పని కానిస్తున్నారు. అటవీశాఖ పర్యవేక్షణ లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా శబ్దం లేని రంపాలతో నేల కూల్చేస్తున్నారు. ఇందులో భారీ మర్రి, చింత, వేప, అల్లనేరేడు, మామిడి, తదితర చెట్లు ఉన్నాయి. ఈ రెండుచోట్లా ఇప్పటికే పదుల సంఖ్యలో చెట్లు నేలకూలగా మరిన్ని సిద్ధంగా ఉన్నాయి. పట్టణం, ప్రధాన రహదారుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే మారుమూల అటవీ, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వృక్షాల కోతను నివారించాలంటే కలప మిల్లులు, వీటిని కట్ చేసే ఏజెంట్లపై నిఘా పెట్టడంతో పాటు వారికి తగిన స్థాయిలో ఆంక్షలు విధించాలని పర్యావరణ ప్రేమికులు, స్థానికులు కోరుతున్నారు.
వాటికి అనుమతి లేదు: ప్రసాదావు, అటవీ శాఖాధికారి, మదనపల్లె.
బెంగళూరు రోడ్డులోని రెండు ప్రాంతాల్లో చెట్లు కోస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. భూమి యజమానులతో పాటు వాటిని కట్ చేసే వారిపై కూడా కేసులు నమోదు చేసి, అపరాధం విధిస్తాం. ఇప్పటికే మా సిబ్బందిని అక్కడికి పంపించి ఆపేశాం, చర్యలు తీసుకోమని ఆదేశించాం.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజలకు భయం పోయింది.. జగన్‌కు పట్టుకుంది
జగన్‌కు దమ్ముంటే మోదీ, షాపై పోరాడాలి
For More AndhraPradesh News And Telugu News