YS Sharmila:సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వం.. తెలుగు ప్రజలకు గర్వకారణం
ABN , Publish Date - Aug 19 , 2025 | 09:21 PM
ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి పేరు ప్రకటించడం తెలుగు ప్రజలకు గర్వకారణమని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. పార్టీలు, రాజకీయాలను పక్కన పెట్టి న్యాయ నిపుణుడికి ఇండియా కూటమి అవకాశం ఇవ్వడం హర్షణీయమని షర్మిల వ్యాఖ్యానించారు.
విజయవాడ, ఆగస్టు19 (ఆంధ్రజ్యోతి): ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి (Justice Sudarshan Reddy) పేరు ప్రకటించడం తెలుగు ప్రజలకు గర్వకారణమని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) పేర్కొన్నారు. పార్టీలు, రాజకీయాలను పక్కన పెట్టి న్యాయ నిఫుణుడికి ఇండియా కూటమి అవకాశం ఇవ్వడం హర్షణీయమని వ్యాఖ్యానించారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు. దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్న ఈ సమయంలో సుదర్శన్ రెడ్డి లాంటి న్యాయరంగ నిపుణులు ఉప రాష్ట్రపతి పదవిలో ఉంటేనే…రాజ్యాంగం పరిరక్షించబడుతుందని ఇండియా కూటమి బలంగా నమ్ముతుందని ఉద్ఘాటించారు వైఎస్ షర్మిల.
ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి ప్రకటన తెలుగు వారికి దక్కిన గౌరవమని నొక్కిచెప్పారు. రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ఏకం కావాల్సిన సందర్భం ఇదని తెలిపారు. తెలుగు బిడ్డకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే సమయం ఇదని చెప్పుకొచ్చారు. సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదని... ఆయనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆయన ఇండిపెండెంట్ ఎక్స్‌పర్ట్ కమిటీ చైర్మన్ అని వెల్లడించారు. సుదర్శన్ రెడ్డిని తెలుగు బిడ్డగా పరిగనణలోకి తీసుకుని, న్యాయరంగంలో ఆయన చేసిన విశేష సేవలను గుర్తు చేసుకుంటూ, రాజకీయాలు ఆపాదించకుండా తెలుగుదేశం, జనసేన, వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సహకరించాలని వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీకి బిగ్ షాక్... కీలక నేతపై కేసు
నన్ను చంపేందుకు వైసీపీ నేత ప్లాన్ చేశారు: కావ్యా కృష్ణారెడ్డి
Read Latest AP News and National News