Pawan Kalyan: అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టండి.. అధికారులకి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ABN , Publish Date - Nov 05 , 2025 | 06:18 PM
ఏపీలో జరుగనున్న అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఏపీ సచివాలయంలో మొంథా తుపాను నష్టం, అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధిపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
అమరావతి, నవంబరు5 (ఆంధ్రజ్యోతి): ఏపీలో జరుగనున్న అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దిశానిర్దేశం చేశారు. ఏపీ సచివాలయంలో మొంథా తుపాను నష్టం, అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ(బుధవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకి డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా నదిపై హై లెవెల్ వంతెనతో దీవుల్లోని గ్రామాలు అనుసంధానం చేసేలా వంతెన నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు పవన్ కల్యాణ్.
ఏపీ ప్రభుత్వ నిధులతోపాటు, సాస్కీ పథకం నిధులు మంజూరుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో అవనిగడ్డ పరిధిలో అవుట్ ఫాల్ స్లూయిజ్‌ల పునరుద్ధరణ చేసినట్లు తెలిపారు. నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పుకొచ్చారు. అటవీ శాఖ అనుమతుల కోసం నిలిచిన అభివృద్ధి పనులకూ మోక్షం లభించనుందని తెలిపారు. మొంథా తుఫానులో నష్టపోయిన కౌలు రైతుల వివరాలతో వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు పవన్ కల్యాణ్.
తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటన...
ఈనెల 8, 9వ తేదీల్లో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. 8వ తేదీ తిరుపతి జిల్లా పరిధిలోని ఎర్రచందనం డిపోని సందర్శిస్తారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో ఎర్రచందనం అక్రమ రవాణా, స్మగ్లింగ్ నిరోధంపై టాస్క్‌ఫోర్స్, అటవీ శాఖ అధికారులతో నిర్వహించే సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పాల్గొంటారు. అలాగే, ఈనెల 9వ తేదీ పలమనేరులోని కుంకీ ఏనుగుల క్యాంపును సందర్శిస్తారు. కుంకీ ఏనుగుల సంరక్షణతోపాటు... ఏనుగులు, మనుషుల మధ్య సంఘర్షణ నియంత్రణకు అనుసరిస్తున్న నూతన సాంకేతిక విధానాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలిస్తారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి...
జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్
భారీ పెట్టబడులు, ఒప్పందాలకు విశాఖ వేదిక.. మంత్రి డీబీవీ స్వామి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News