NTR Cultural Association: అరుదైన ఘనత.. నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తున్న ఎన్టీఆర్ అభిమానులు
ABN , Publish Date - Dec 25 , 2025 | 10:11 AM
పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ అరుదైన ఘనత సాధించింది. గుంటూరులో ప్రతి గురువారం ఉదయం 8:30 గంటలకు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న విషయం తెలిసిందే.
గుంటూరు జిల్లా, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ (Padma Sri NTR Cultural Association) గుంటూరు జిల్లాలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన దివంగత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (NTR) విగ్రహానికి నిరంతరంగా 25 ఏళ్లుగా ప్రతి గురువారం నివాళులు అర్పిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంది ఈ అసోసియేషన్.
గుంటూరు నగరంలోని బస్టాండ్ సెంటర్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రతి గురువారం ఉదయం 8:30 గంటలకు నివాళి కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ అసోసియేషన్ ఆనవాయితీగా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈరోజుతో ఆ కార్యక్రమానికి 25 ఏళ్లు పూర్తి కావడంతో... రజతోత్సవ వేడుకలను అభిమానులు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఎన్టీఆర్‌కు చిరునామాగా..
ఎన్టీఆర్ అంటే నటన, రాజకీయాలు మాత్రమే కాదని.. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక అని ఆయన అభిమానులు చెబుతున్నారు. అటువంటి మహానుభావుడికి గుంటూరులో ప్రతి వారం నిరంతరంగా నివాళులు అర్పించడం రాష్ట్రంలోనే అరుదైన అంశంగా అభిమానులు పేర్కొంటున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా ఒక్క గురువారం కూడా మిస్ కాకుండా ఈ కార్యక్రమం కొనసాగించామని తెలిపారు.
వైభవంగా రజతోత్సవ వేడుకలు..
25 ఏళ్ల సంబరాల సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ప్రత్యేక పుష్పాలంకరణ నిర్వహించారు. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళి అర్పించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర, సినీ ప్రస్థానం, రాజకీయ సేవలను అభిమానులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆయన తెలుగు జాతికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు. ఆయన ఆశయాలను తరతరాలకు తెలియజేయడమే మా లక్ష్యం. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ప్రతి గురువారం ఎన్టీఆర్‌కు నివాళులు అర్పిస్తాం’ అని అభిమానులు వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ అభిమాన సంఘం చరిత్ర..
గుంటూరులో ఎన్టీఆర్ అభిమాన సంఘానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1969లో గుంటూరు రైలుపేట ప్రాంతంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఏర్పడింది. అప్పటి నుంచి ఎన్టీఆర్ సినిమాలు, రాజకీయ జీవితానికి అభిమానులు అండగా నిలుస్తూ వస్తున్నారు. ఆ అభిమాన సంఘానికి కొనసాగింపుగానే పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఏర్పడి, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది.
మా సంకల్పం అదే..
రజతోత్సవ వేడుకల సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ ఆశయాలను యువతకు చేరువ చేయడమే మా సంకల్పం. భవిష్యత్తులోనూ ప్రతి గురువారం ఇదే విధంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తాం’ అని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ పలు స్వచ్ఛంద కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
అభిమానులతో కళకళలాడిన బస్టాండ్ సెంటర్
ఈ కార్యక్రమంతో గుంటూరు బస్టాండ్ సెంటర్ ప్రాంతం అభిమానులతో కళకళలాడింది. ఎన్టీఆర్ నినాదాలు, పుష్పవర్షం, జై ఎన్టీఆర్ అంటూ మార్మోగిన నినాదాలతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది. ఈ కార్యక్రమం చూసిన పలువురు ప్రయాణికులు కూడా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
ఇవి కూడా చదవండి...
సీఎం చంద్రబాబుతో ఎంపీ కేశినేని కీలక భేటీ.. పలు అంశాలపై చర్చ
క్రిస్మస్ పండుగ.. క్రైస్తవుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి
Read Latest AP News And Telugu News