Minister Satya Kumar:మెడికల్ పీజీ కౌన్సెలింగ్ వివాదం.. మంత్రి సత్యకుమార్ ఏమన్నారంటే..
ABN , Publish Date - Jan 03 , 2025 | 04:21 PM
Minister Satya Kumar: పేదలను మభ్యపెట్టి అవయవాలు తీసుకునే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ యాదవ్ హెచ్చరించారు. అవయవ దానంపై ప్రజల్లో అవగాహన తీసుకురావడం అభినందనీయమని ప్రశంసించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోజుకు 5 బ్రెయిన్ డెడ్ కేసులు వస్తన్నాయని చెప్పారు.
గుంటూరు: ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌ను ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఇవాళ(శుక్రవారం) సందర్శించారు. ఈ సమయంలో మంత్రికు నిరసన సెగ తాకింది. మెడికల్ పీజీ కౌన్సెలింగ్‌లో అక్రమాలపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సెలింగ్‌లో లోపాలు మంత్రికి చెప్పుకునేందుకు తల్లిదండ్రులు వచ్చారు. సమస్య చెబుతున్న వినకుండా మంత్రి సత్య కుమార్ ముందుకు వెళ్లిపోయారు. మంత్రి సత్యకుమార్ తీరుపై తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. వైద్యశాఖ నిర్లక్ష్యంతో మెడికల్ విద్యార్థులు చాలా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. అయితే మెడికల్ పీజీ కాలేజ్ కౌన్సెలింగ్ వివాదంపై మంత్రి సత్య కుమార్ యాదవ్ స్పందించారు.
జగన్ ప్రభుత్వం నిర్వాకం వల్లే మెడికల్ పీజీ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కోర్టు తీర్పుల వల్లే పీజీ విద్యార్థులు ఇబ్బందులు ఏదుర్కొంటున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వేసిన కమిషన్ అనేక విషయాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు, శాస్త్రీయ అంశాలను కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి మేలు జరుగుతుందో చూస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు. వైద్య శాఖలో ఖాళీలను భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అన్ని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
అవయవ దానంపై ముందుకు రావాలి..
పేదలను మభ్యపెట్టి అవయవాలు తీసుకునే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హెచ్చరించారు. అవయవ దానంపై మెడికల్ కళాశాల్లో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. అవయవ దానంపై ప్రజల్లో అవగాహన తీసుకురావడం అభినందనీయమని ప్రశంసించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోజుకు 5 బ్రెయిన్ డెడ్ కేసులు వస్తున్నాయని చెప్పారు. అవయవ దానం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.