Minister Nara Lokesh on Teacher Recruitment: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:26 PM
ప్రభుత్వ విద్యలో విద్యాప్రమాణాలను మెరుగుపర్చేందుకు గత 14నెలలుగా సమర్థవంతంగా సంస్కరణలు అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారాలోకేష్ ఉద్ఘాటించారు. సంస్కరణల అంతిమ లక్ష్యం అభ్యసన ఫలితాలేనని తెలిపారు. మెరుగైన ఫలితాలపై దృష్టిసారించాల్సిన బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులపై ఉందని లోకేష్ పేర్కొన్నారు.
అమరావతి, ఆగస్టు22(ఆంధ్రజ్యోతి): ఇకపై టీచర్ పోస్టుల భర్తీకి ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారాలోకేష్ (Minister Nara Lokesh) స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్యలో విద్యాప్రమాణాలను మెరుగుపర్చేందుకు గత 14నెలలుగా సమర్థవంతంగా సంస్కరణలు అమలు చేశామని ఉద్ఘాటించారు. ఫలితాలు రాబట్టే బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులదేనని దిశానిర్దేశం చేశారు. దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో కీలక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని నొక్కిచెప్పారు. అమరావతిలో ఏడాదిలోగా సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ ఇవాళ(శుక్రవారం) ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఏపీ చరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించి, విజయవంతంగా నిర్వహించామని వ్యాఖ్యానించారు మంత్రి నారాలోకేష్.
అనవసరమైన శిక్షణా కార్యక్రమాలతో ఉపాధ్యాయుల విలువైన సమయాన్ని వృథా చేయొద్దని సూచించారు. సంస్కరణల అంతిమ లక్ష్యం అభ్యసన ఫలితాలేనని తెలిపారు. అసర్ నివేదిక ప్రకారం ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) ప్రోగ్రామ్ అమల్లో జాతీయస్థాయిలో ఏపీ 14వ స్థానంలో ఉందని ఉద్ఘాటించారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని... మెరుగైన ర్యాంక్ సాధించేందుకు నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు మంత్రి నారాలోకేష్.
దేశంలోనే తొలిసారిగా ప్రతి బిడ్డకు గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ఒక హక్కుగా ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల సహకారంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి బిడ్డకి గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అందించడమే లక్ష్యంగా పనిచేద్దామని సూచించారు. తల్లికి వందనం చివరి దశ నిధులను విడుదల చేశామని ప్రకటించారు. తల్లికి వందనం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేశామని గుర్తుచేశారు. చివరి విడతగా పెండింగ్ దరఖాస్తులను ఆమోదిస్తూ రూ. 325కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 2024-2025 ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీలో కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలకు దాతల సహకారంతో భూసేకరణకు చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ మార్గనిర్దేశం చేశారు.
నైపుణ్యాభివృద్ధి శాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష..
అలాగే..నైపుణ్యాభివృద్ధి శాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోర్టల్ డెమోను మంత్రి లోకేష్ పరిశీలించారు. దేశానికే రోల్ మోడల్‌గా నైపుణ్యం పోర్టల్‌ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఏడాదికి 50వేల మంది యువతకు నైపుణ్య శిక్షణకు అవకాశం ఉంటుందని వివరించారు. పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌తో నైపుణ్యం పోర్టల్ అనుసంధానం చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
హిందూ ధర్మంపై విషం చిమ్ముతున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ఆనం ధ్వజం
Read Latest AP News And Telugu News