Minister Sandhyarani: గిరిజన ప్రాంతాల మహిళల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు: మంత్రి సంధ్యారాణి
ABN , Publish Date - Nov 04 , 2025 | 03:41 PM
గిరిజన ప్రాంతాల్లో ఉండే మహిళల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వ్యాఖ్యానించారు. గిరిజన మహిళలు రక్తహీనతకి గురికాకుండా ప్రత్యేక శ్రద్ధ చూపామని పేర్కొన్నారు.
అమరావతి, నవంబరు4 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల్లో ఉండే మహిళల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Minister Gummidi Sandhyarani) వ్యాఖ్యానించారు. గిరిజన మహిళలు రక్తహీనతకి గురికాకుండా ప్రత్యేక శ్రద్ధ చూపామని పేర్కొన్నారు. సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్న వారి కోసం విశాఖపట్నం కేజీహెచ్‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో బాలింతలు, గర్భవతులకు సకాలంలో పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇవాళ(మంగళవారం) వెలగపూడిలోని సచివాలయంలో మీడియాతో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడారు.
గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం ఈ ఏడాది తమ ప్రభుత్వం రూ.113 కోట్లు మంజూరు చేసిందని గుర్తుచేశారు. 30 గురుకుల పాఠశాలలు, 83 ఆశ్రమ పాఠశాలల్లో ఈ నిధులతో మౌలిక వసతులు కల్పించామని స్పష్టం చేశారు. గత ఏడాది రూ.155 కోట్లు మంజూరు చేశామని చెప్పుకొచ్చారు. గిరిజన ప్రాంతాల్లో ఈఎంఆర్ఎస్‌లతో కలిపి 199 గురుకుల పాఠశాలలు, 558 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయని తెలిపారు. వీటన్నింటిలో పూర్తిగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా 2012 టాయిలెట్స్ మంజూరు చేశామని తెలిపారు. ఆర్వో ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. గత జగన్ ప్రభుత్వం ట్రైకార్ లోన్స్ ఇవ్వలేదని.. అయితే, తమ ప్రభుత్వం రూ.24 కోట్లతో గోకులాలు ఏర్పాటు చేసి గిరిజనులకు ఉపాధి కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. పాడిపరిశ్రమ అభివృద్ధి చెందితే గిరిజనులకు స్వయం ఉపాధి ఉంటుందని నొక్కిచెప్పారు. ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని ఉద్ఘాటించారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.
పాడిపరిశ్రమ, పాల పరిశ్రమ అభివృద్ధి చెందితే గిరిజనులకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయుల పోస్టులని వెంటనే భర్తీ చేశామని తెలిపారు. పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 150 మంది విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ కోచింగ్ ఇస్తున్నామని అన్నారు. గతంలో గిరిజన ప్రాంతాల్లో భూములు పొందేందుకు గిరిజన యువతులను పెళ్లిళ్లు చేసుకొని మోసం చేసేవారని... అటువంటి సంఘటనలు జరుగకుండా తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఉల్లి రైతుల సమస్యలని ఏపీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: ఎంపీ అవినాశ్ రెడ్డి
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్
Read Latest AP News And Telugu News