Auto Drivers Scheme: గుడ్ న్యూస్.. మరో పథకాన్ని ప్రకటించిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 27 , 2025 | 05:07 PM
‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని అక్టోబర్ 4వ తేదీన ప్రారంభిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. చాలా ఆలోచించి ఈ పథకానికి ‘పేదల సేవలో’ అనే పేరు పెట్టామని ఉద్ఘాటించారు. ప్రతి నెలా ఫించన్లు అందించే కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా సంతృప్తి ఇస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
అమరావతి , సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): సూపర్ సిక్స్ (Super Six), మేనిఫెస్టో హామీల అమలుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) ప్రసంగించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో మరో సంక్షేమ పథకాన్ని సీఎం ప్రకటించారు. అక్టోబర్ 4వ తేదీన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని (Auto Drivers Scheme) ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేశారు. చాలా ఆలోచించి ఈ పథకానికి ‘పేదల సేవలో’ అనే పేరు పెట్టామని ఉద్ఘాటించారు. ప్రతి నెలా ఫించన్లు అందించే కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా సంతృప్తి ఇస్తోందని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు.
ఏపీ పునర్: నిర్మాణం చేస్తాం...
టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాయని గుర్తుచేశారు సీఎం చంద్రబాబు. అభివృద్ధి - సంక్షేమం - సుపరిపాలన ద్వారా ఏపీ పునర్: నిర్మాణం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నాడు చెప్పామని.. నేడు అమలు చేసి చూపుతున్నామని వివరించారు. ‘ఆటోడ్రైవర్ల సేవలో’ పేరుతో ప్రతి ఏడాది రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారు. అక్టోబరు 4వ తేదీన ‘ఆటోడ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రారంభిస్తున్నామని.. ఏపీలోని 2,90,234 మంది లబ్ధిదారులుగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఏదైనా కారణంతో ఎవరైనా లబ్ధిదారుల పేరు ఈ జాబితాలో లేకపోతే.. వారి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆటోడ్రైవర్ల స్కీమ్ ను వర్తింపచేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ పథకానికి రూ.435 కోట్ల ఖర్చు చేస్తున్నామని వివరించారు. గత జగన్ ప్రభుత్వం ఆటోడ్రైవర్లకు రూ.12 వేలు మాత్రమే ఇచ్చేదని.. తాము రూ.15 వేలు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
పెద్దఎత్తున ఫించన్లు ఇస్తున్నాం..
‘ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కింద పెద్దఎత్తున ఫించన్లు ఇస్తున్నాం. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇవ్వనన్ని ఫించన్లను కూటమి ప్రభుత్వం ఇస్తోంది. జగన్ గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఫించన్లను ఇవ్వకుండా వృద్ధులను ఇబ్బంది పెట్టింది. మా ప్రభుత్వంలో ఉన్న సచివాలయ సిబ్బందితో తొలిరోజునే 97 శాతం ఫించన్ల పంపిణీని పూర్తి చేస్తున్నాం. నెలకు రూ.2,745 కోట్లను ఫించన్లకు ఖర్చు చేస్తున్నాం. మొత్తంగా 63.50 లక్షల మందికి ఫించన్లను పంపిణీ చేస్తున్నాం. ఫించన్లు అందుకుంటున్న వారిలో 59 శాతం మంది మహిళలే ఉన్నారు. ఫించన్లు ఇవ్వడమే కాకుండా.. పంపిణీ ఎలా జరుగుతుందన్న అంశం మీద లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలూ తీసుకుంటున్నాం’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.
స్త్రీ శక్తి ద్వారా రూ.8.86 కోట్ల ఉచిత ప్రయాణాలు..
‘ఏడాదికి రూ.32,143 కోట్ల పెన్షన్ల నిమిత్తం మా ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఏపీ తర్వాత తెలంగాణ, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణలో ఏడాదికి రూ.8,179 కోట్లు, కేరళ రూ.7,295 కోట్లు పెన్షన్ల కింద ఖర్చు పెడుతున్నాయి. అంటే పెన్షన్ల కోసం మనం ఖర్చు పెట్టే దాంట్లో పావు వంతు ఖర్చు పెడుతున్నాయి. స్త్రీ శక్తి పథకం ద్వారా ఇప్పటివరకూ మహిళలు 8.86 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారు. స్త్రీ శక్తి వల్ల ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగింది. ఉచిత బస్సు స్కీమ్ కు ఏడాదికి రూ.2,963 కోట్లను కూటమి ప్రభుత్వం ఖర్చు పెడుతోంది.. అయినా ఫర్వాలేదు.. ఆనందంగా ఖర్చు పెడతాం. స్త్రీ శక్తి పథకం నాకు చాలా సంతృప్తినిచ్చిన పథకం. డ్రైవర్లు, కండక్టర్లు స్త్రీ శక్తి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఏపీలో ఉన్న 97 శాతం మందికి స్త్రీ శక్తి పథకం గురించి తెలుసు. 85 శాతం మంది ఈ పథకం అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారు. దీని అమలుతో సోషల్ గేదరింగ్ పెరిగింది. మహిళలకు ఉచిత ప్రయాణాల వల్ల డబ్బు కూడా ఆదా అయింది. ఆడబిడ్డల ఆర్థిక ఎదుగుదలకు స్త్రీ శక్తి పథకం తోడ్పడింది’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వ విప్ ఫైర్
వాళ్లకు ఒకలా... మాకు ఒకలానా... మండలిలో ‘కాఫీ’పై వార్
Read Latest AP News And Telugu News