Nara Lokesh: సజ్జల సన్నిహితులు మోసం చేశారు.. ప్రజాదర్బార్‌లో మంత్రి లోకేష్‌కి ఫిర్యాదు
ABN , Publish Date - Jul 01 , 2025 | 01:56 PM
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి మంత్రి విజ్ఞప్తులు స్వీకరించారు. ఆయా ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

అమరావతి: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (AP Minister Nara Lokesh) ఉండవల్లిలోని తన నివాసంలో ఇవాళ(మంగళవారం) ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి మంత్రి విజ్ఞప్తులు స్వీకరించారు. ఆయా ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత అధికారులకు లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వంలో అందరికీ అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. మెడికల్ సీటు ఇప్పిస్తామంటూ వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి సన్నిహితులు మోసం చేశారని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లికి చెందిన మన్నె సుబ్బారావు మంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు.
తమ కుమారుడికి పీజీ మెడికల్ సీటు ఇప్పిస్తామంటూ సజ్జల రామకృష్ణారెడ్డి అండతో తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట, వాడపాలెంకి చెందిన సజ్జల సన్నిహితులు అడపా ప్రేమ్‌చంద్, గుత్తుల అవినాష్, కట్టెవాటి బాలిరెడ్డి రూ.1.20 కోట్లు తీసుకుని మోసం చేశారని.. విచారించి తగిన న్యాయం చేయాలని బాధితుడు మన్నె సుబ్బారావు కోరారు. తాను మెడికల్ సీటు గురించి వారిని ప్రశ్నించగా.. అప్పటి సీఎంవో అధికారి ధనుంజయరెడ్డి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో సీటు ఇప్పిస్తానంటూ రూ. 2 కోట్లు డిమాండ్ చేశారని లోకేష్‌కి బాధితుడు ఫిర్యాదు చేశాడు.
అంత సొమ్ము చెల్లించలేమని చెప్పడంతో తాము కట్టిన నగదుకు బెంగుళూరులోని రామయ్య మెడికల్ కాలేజీలో సీటు ఇప్పిస్తామంటూ సజ్జల సన్నిహితులు తమను తీసుకెళ్లి సీట్ అలాట్‌మెంట్‌కు సంబంధించి నకిలీ లేఖను చేతిలో పెట్టి మోసం చేశారని మంత్రికి బాధితుడు ఫిర్యాదు చేశారు. నగదును తిరిగి ఇవ్వాలని కోరగా సజ్జల పేరుచెప్పి బెదిరిస్తున్నారని అన్నారు. తప్పుడు పత్రాలతో తమను మోసం చేశారని, తమకు రావాల్సిన నగదును తిరిగి ఇప్పించాలని బాధితుడు మన్నె సుబ్బారావు విజ్ఞప్తి చేశాడు. ఈ ఫిర్యాదుని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
రెండు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
త్రిభాషా విధానంపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర
ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల వర్షం..
For More AP News and Telugu News